Summer | ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 13 : ఎండలు మండిపోతుండటంతో ప్రజలు భానుడి ప్రతాపానికి ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండలు విపరీతంగా కొడుతుండటంతో ఉదయం 9 గంటలు అయ్యిందంటే ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలంటే ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఉదయం నుంచే ఎండలు విపరీతంగా దంచి కొడుతున్నందున ప్రజలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొంది తమను తాము కాపాడుకోవడం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే అనారోగ్యాల భారీన పడే అవకాశముంటుందని తెలియజేస్తున్నారు.
నియోజకవర్గంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతున్నందున ప్రజలు ఎండలో ఎక్కువ తిరగకూడదు. అత్యవసర పరిస్థితిలో వెళ్లాల్సి వస్తే గొడుగులు, తలపై క్యాప్‌లు, స్క్రాప్లు ధరించాలని తెలియజేస్తున్నారు. మార్చిలోనే ఎండలు విపరీతంగా దంచి కొడుతున్నందున ఏప్రిల్, మే నెలల్లో ఇంకా ఎండలు తీవ్రరూపం దాల్చే అవకాశమున్నందున ప్రజలు సరైన జాగ్రత్తలు పాటించాలి. గత వారం రోజులుగా ఎండ వేడిమికి ప్రజలు ఇండ్లనుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ తరుణంలో ఎండవేడిమి నుంచి తమను తాము రక్షించుకోవటం కోసం సరైన జాగ్రత్తలు పాటించటంతో పాటు శరీరానికి అవసరపడే నీటిశాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండలకు నీటిని ఎక్కువగా తాగడంతో పాటు పండ్లను తరుచుగా తింటూ ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఎండలో ఎక్కువగా తిరిగినప్పుడు కొబ్బరిబోండాం, నిమ్మరసం, చెరుకురసం, పండ్లు తీసుకోవడంతో పాటు ఓఆర్ఎస్ను వాటర్‌లో కలుపుకుని తాగితే మంచిదని చెబుతున్నారు. ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో ప్రజలు సరైన జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుందని వైద్య నిపుణులు అంటున్నారు.
చిన్నపిల్లల రక్షణ కోసం..
పిల్లలు ఎండ తీవ్రతను తట్టుకోలేదు. వేసవిలో తల్లిదండ్రులే వారికి గొడుగులా రక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.
మధ్యాహ్నం సమయంలో ఆడుకోవడానికి అనుమతించకూడదు.
మైదానాలలో క్రీడలు ఆడేందుకు సాయంత్రవ వేళ్లలో పంపాలి.
అన్ని రక్షణలు ఉన్న స్విమ్మింగ్ఫూల్కే పంపించాలి.
బయటి తిండికి అలవాటు పడకుండా చూసుకోవాలి.
పిల్లలకు ఎక్కువగా నీరు, పండ్ల రసాలు, మజ్జిగ, అంబలి తాగిసూ తుండాలి.
ఎండలో కళ్లు జరభద్రం..
ఎండలో ఎక్కువగా తిరిగితే కళ్లకు అలసట వస్తుంది. కళ్ల చుట్టూ నల్లచారలు ఏర్పడతాయి. అందుకే అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడే కళ్లజోడు తప్పక ధరించాలి. తరుచుగా చల్లని నీటితో కళ్లను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. వేడి గాలికి కూడా కళ్లజోడు కళ్లకు రక్షణగా పనిచేస్తాయి. బైక్‌పైన ఎండలో వెళ్లేటప్పుడు కళ్లజోడు లేదా, హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలి.
కేశాల రక్షణ కోసం జాగ్రత్త పడాలి..
సూర్యకిరణాలు జుట్టుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వాటివల్ల జుట్టు పేలవంగా తయారయ్యే ప్రమాదముంది. బయటకు వెళ్లేటప్పుడు స్కార్ప్ కట్టుకోవాలి. చల్లటి నీటితో సాన్నం చేయాలి. వేసవిలో జట్టుకు రోజుకు రెడుసార్లు నూనె రాయాలి. ఎండకు చెమట అధిక వచ్చే అవకాశముందున్నందున వెంట్రుకలను కాపాడుకోవడం కోసం జాగ్రత్తలు పాటించాలి.
ఎండలకు చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి..
ఎండాకాలంలో సాదారణంగా చర్మ సంబంధ వ్యాదులు ఎక్కువగా వస్తాయి. ఏమాత్రం అశ్రద్ద చేసినా తగిన మూల్యం చెల్లించుకోవల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితిలో ఎండలో బయటకి వెళ్లేటప్పుడు గొడుగు లేదా టోపీని తీసుకెల్లాలి. ముఖ్యంగా ప్రయాణాలను సాధ్యమైనంత వరకు సాయంత్రానికి వాయిదా వేసుకోవాలి. ఆభరణాలు ధరించే వారికి మెడచుట్టూ చెమట కారణంగా అలర్జీ వచ్చే అవకాశముందున్న, ఎండాకాలంలో ఆభరణాలు ధరించకపోవడం మంచిది. శరీర పరిశుభ్రత ముఖ్యం, చంకలు, తొడల మధ్య భాగంలో ఫంగస్ చేరే అవకాశమున్నందున రెండు పూటల స్నానం చేయాలి. ఉతికిన బట్టలనే ధరించాలి. కాచి, వడబోసిన నీటిని తాగాలి. వేసవిలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
వేసవిలో ఆహారంపట్ల సరైన జాగ్రత్తలు పాటించాలి..
మంచి పోషక విలువలున్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అధికంగా తీసుకోవాలి. మద్యం, కాఫీ, టీ, ధూమపానానికి దూరంగా ఉంటే మంచిది, మసాలాలను తగ్గించాలి. తద్వారా గ్యాస్ట్రబుల్ నియంత్రణలో ఉంటుంది. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి. చికెన్, మటన్ వంటి వాటిని వేసవిలో తినకపోవడమే మంచిది.