వర్షాకాలం వచ్చిందంటే చాలు.. కొంతమంది శుభ్రత పేరుతో పదే పదే హ్యాండ్‌వాష్ లిక్విడ్‌తో చేతులు కడుక్కుంటూ ఉంటారు. ఇంట్లో దుర్వాసనను పోగొట్టేందుకు ఎయిర్ ఫ్రెషనర్లు వాడుతూ ఉంటారు. అంతేకాదు, ఫ్లోర్ కీనర్స్తో ఇల్లు తెగ శుభ్రం చేస్తుంటారు. ఇలా శుభ్రత పేరుతో వాడే క్లీనర్స్ ఇంటినీ, ఒంటినీ కాలుష్య కాసారంగా మారుస్తాయంటున్నారు నిపుణులు. ఈ క్లీనర్స్ తరచుగా వాడటం వల్ల ముఖ్యంగా మహిళలు, పిల్లల్లో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
Floor Cleaners | ఘాటైన వాసనతో కూడిన రసాయనాలతో తయారు చేసే క్లీనర్స్ వాడకం వల్ల ఇంట్లో ఎక్కువ సమయం గడిపే మహిళలే ఎక్కువ అనారోగ్యం పాలవుతున్నారని తాజా పరిశోధనలో తేలింది. వీరిలో ముఖ్యంగా గుండె, గర్భధారణ సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెల్లడైంది. అంతేకాదు ఈ క్లీనర్స్ వాడకం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 40 లక్షల మంది మహిళలు, చిన్నారులు ఇండోర్ కాలుష్యం బారిన పడుతున్నారు.
ఫ్లోర్ క్లీనర్లు, గ్యాస్ స్టవ్, ఫర్నిచర్, షాంపూలు, క్రీములు, డ్రయ్యర్లు, ఏసీ, ఫ్రిజ్, పెయింట్లు, దుప్పట్లు, కార్పెట్లు, కర్టెన్లు, పెంపుడు జంతువులు, వంటగదిలో వెలువడే వాయువులు, వాడుకునే ఉపకరణాలు, తేమ, ఆఖరికి కొన్ని రకాల మొక్కలు అన్నీ కాలుష్యాన్ని విడుదల చేసేవే! వీటి వల్ల వాయు కాలుష్య కారకాలైన టోలీన్, జైలీన్, బెంజీన్ లాంటివి ఆరుబయట కన్నా ఇంట్లోనే రెండు నుంచి ఐదు రెట్లు ఎక్కువగా విడుదల అవుతున్నాయని పలు పరిశోధనల్లో తేలింది. అమెరికాకు చెందిన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీతో పాటు ‘హైదరాబాద్ ఎమిషన్స్’,‘ఐఐటీ రూర్కీ’, మహారాష్ట్రలోని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ’లు చేసిన సంయుక్త అధ్యయనంలోనూ ఇదే స్పష్టమైంది.
దుమ్ము వస్తుందనో, భద్రత కోసమనో, ఎండ పడుతుందనో కొందరు ఎప్పుడూ ఇంటి తలుపులు, కిటికీలూ మూసే ఉంచుతుంటారు. దాంతో గోడలూ, బాత్రూముల్లో తేమ చేరి హానికారక సూక్ష్మజీవులకు ఆవాసాలుగా మారతాయి. వీటివల్ల అలర్జీ సమస్యలు వస్తాయి. చెడు వాసనను తరిమికొట్టడానికి కృత్రిమ పరిమళ ద్రవ్యాలు కాకుండా సహజంగా పూలు, నూనెలతో సుగంధాలు వెదజల్లేలా చేయాలని సూచిస్తున్నారు. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలి. చల్లదనం కోసం ఏసీలు వాడకుండా సహజంగా ఇంటిని చల్లబరిచే మొక్కలు, షేడ్ నెట్లు ఉపయోగించాలి. ఇంట్లోనే సహజంగా గాలిని శుద్ధి చేసేందుకు నాసా ధ్రువీకరించిన ఇంగ్లిష్ ఐవీ, మనీప్లాంట్, ఫిలడెండ్రాన్, ఆంథూరియం, పీస్ లిల్లీ వంటి వాటిని పెంచుకోవడం మంచిది.
ఇంటి శుభ్రత కోసం వాడే బాత్రూమ్ క్లీనర్లు, డిటర్జెంట్లు అన్నింట్లోనూ రసాయనాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి దీర్ఘకాలంలో మూత్రపిండాలు, కాలేయం, నాడీ వ్యవస్థలపైనా ప్రభావాన్ని చూపుతాయి. వీటికి బదులుగా మరిగించి వడకట్టిన కుంకుడుకాయ రసంలో కాస్త వెనిగర్, బేకింగ్ సోడా కలిపి డిష్ వాషర్గా వాడుకోవచ్చు. ఈ మిశ్రమానికి లెమన్, లావెండర్ లాంటి ఎసెన్షియల్ ఆయిల్స్ రెండు చుక్కలు, కాస్త రాళ్ల ఉప్పుని చేర్చి ఫ్లోర్ క్లీనర్, డిటర్జెంట్‌గా ఉపయోగించవచ్చు.
ఇంటిలో తిరిగే చీమలు, బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు సహజంగానే కాలుష్య వాహకాలు. ఇక దోమల వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ కీటకాలను అరికట్టడానికి వాడే రెపల్లెంట్లూ శ్వాసకోశ సమస్యలకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బొద్దింకల్ని అరికట్టేందుకు బయోక్లీనర్గా పనిచేసే వెనిగర్‌ని వాడటం మంచిదని సూచిస్తున్నారు. దోమలను అరికట్టడానికి నీటిలో సిట్రనెల్లా, యూకలిప్టస్, లెమన్ గ్రాస్ ఆయిల్స్ కలిపి కిటికీల దగ్గర, ఇల్లంతా స్ప్రే చేయడం వల్ల ఫలితం ఉంటుంది.
ఇంట్లో నీరు, ఆహార వ్యర్థ పదార్థాలు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.