రోజువారీ ప్రయాణానికి చాలామంది మోటర్ సైకిళ్లను వాడుతుంటారు. ఈ ద్విచక్ర వాహన చోదకులు గుంతలు, గతుకుల రోడ్ల కారణంగా గాయాల పాలయ్యే ప్రమాదంతోపాటు దీర్ఘకాలంలో వెన్నునొప్పి బారినపడే ముప్పు పొంచి ఉంది. రోడ్లపై గుంతల కారణంగా 20 55 ఏండ్ల వయసు వారిలో వెన్ను కిందిభాగంలో నొప్పి తలెత్తడానికి ఆస్కారం ఉంది.
మోటర్ సైకిల్ నడుపుతున్నప్పుడు గుంతలు, స్పీడ్ బ్రేకర్ల దగ్గర బ్రేకులు వేసినప్పుడు శరీరం కుదుపునకు లోనవుతుంది. వెన్ను మీద ఒత్తిడి పడుతుంది. కుదుపుల వల్ల వెన్ను దిగువభాగంలో బెణుకులకు దారితీస్తాయి. దీంతో వాహనం నడిపేవాళ్ల శరీర కదలికలు, నడవడంపై దుష్ప్రభావం చూపుతుంది. అందువల్ల 20 55 ఏండ్ల వయసు వాహన చోదకులు దీర్ఘకాలంలో వెన్నునొప్పి, మెడనొప్పి, డిస్కులు జరగడం లాంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుందటున్నారు వైద్యులు.
ఒక్కోసారి ఎముకల్లో పగుళ్లు కూడా ఏర్పడతాయి. ఇక మోటార్ సైకిళ్లపై వెళ్లే గర్భిణుల్లో గుంతలు, గతుకుల వల్ల తీవ్రమైన ఆరోగ్య దుష్ప్రభావాలు పడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ తరహా సమస్యలను నిర్ధారించడానికి ఎక్స్ రే, ఎంఆర్ఐ స్కానింగ్ అవసరపడతాయి. ఒకవేళ వెన్నునొప్పి ఉంటే రోజూ ఓ మోస్తరు వ్యాయామం చేయాలి. సమతులాహారం తీసుకోవాలి. యోగా చేయాలి. ఫిజియోథెరపీ చేయించుకోవాలి. నిపుణుల సలహా మేరకు నడుచుకోవాలని డాక్టర్ల సలహా.