క్షయ… అనుక్షణం భయపెట్టించే అంటువ్యాధి. నాలుగు వేల సంవత్సరాలుగా మానవ మనుగడను శాసిస్తున్న మహమ్మారి. భూమ్మీద క్షయ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నది భారతదేశంలోనే. ప్రపంచవ్యాప్తంగా సుమారు కోటి ఎనభై లక్షల మంది టీబీతో బాధపడుతుండగా, అందులో నాలుగో వంతు మనదేశంలోనే ఉండటం ఆందోళనకరం. ప్రతి మూడు నిమిషాలకు ఒక రోగి క్షయతో మరణిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ దుస్థితికి కారణం ఈ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన లేకపోవడం. నిర్లక్ష్యం. క్షయ ప్రధానంగా ఊపిరితిత్తులకు సోకినప్పటికీ, ఇతర అవయవాలకు కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి, రోగులను దీర్ఘకాలం పాటు పీడించే ఈ ప్రాణాంతకమైన వ్యాధి పూర్వాపరాలను తెలుసుకోవడం తప్పనిసరి.
మనదేశంలో రోజుకు ఎంతోమంది క్షయతో మరణిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లెక్కలు వెల్లడిస్తున్నాయి. అందులోనూ ముఖ్యంగా హెచ్ఐవీ, క్యాన్సర్ రోగులు, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే రోగులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఇలా ఉంటే 1882 మార్చి 24న క్షయవ్యాధికి కారణమయ్యే సూక్ష్మజీవిని జర్మనీ శాస్త్రజ్ఞుడు రాబర్ట్ కోచ్ కనుక్కొన్నాడు. వ్యాధి నివారణకు శ్రీకారం చుట్టాడు. దీనికి గుర్తుగా వందేండ్ల తర్వాత నుంచి ఏటా మార్చి 24ను ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినంగా జరుపుకొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి గురించి అవగాహన చేసుకుందాం.
ఈ వ్యాధి ‘మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్’ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దీన్ని ట్యూబర్క్యులోసిస్ (టీబీ) అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధిగ్రస్తులు మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ఉమ్మివేసిన సందర్భాల్లో గాలిలోకి విడుదల అయ్యే తుంపర్ల వల్ల చుట్టుపక్కల వారికి క్షయ సోకుతుంది. ఈ వ్యాధి రెండు రకాలు. మొదటిది ఊపిరితిత్తుల క్షయ, రెండోది ఇతర అవయవాల క్షయ. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించేది ఊపిరితిత్తుల క్షయ.
తెమడ పరీక్ష ద్వారా వ్యాధిని గుర్తిస్తారు. ప్రత్యేక సందర్భాల్లో డీఎన్ఏ పరీక్ష ద్వారా కూడా బ్యాక్టీరియాను గుర్తిస్తారు.
క్షయను వందశాతం నివారించవచ్చు. అయితే, వ్యాధిని సకాలంలో గుర్తిస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఈ దిశగా ముందుగా క్షయ వ్యాధిపై ప్రజల్లో పూర్తి అవగాహన ఉండాలి. వ్యాధి లక్షణాలు కనిపించగానే, లేదంటే రెండు వారాల కంటే ఎక్కువ కాలం దగ్గు ఉంటే వెంటనే వైద్యులను సంప్రందించి క్షయ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి ఉన్నట్టు తేలితే వెంటనే మందులు వాడటం మొదలుపెట్టాలి. వైద్యులు సూచించిన మందులను రోగి తు.చ. తప్పకుండా ఆరు నెలలు వాడితే వ్యాధి పూర్తిగా నయమవుతుంది. కానీ, కొంతమంది దగ్గు, జ్వరం తగ్గగానే నెల రోజుల్లోనే మందులు మానేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. దీనివల్ల రెండో రకం క్షయ, అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఎండీఆర్ టీబీ వస్తుంది. దీని చికిత్స కాలం 9 నెలల నుంచి ఏడాది కాలం దాక ఉంటుంది. ఈ రకం క్షయకు చికిత్స వ్యయం కూడా ఎక్కువే. పైగా దుష్ప్రభావాలూ అధికంగా ఉంటాయి.
ఈ దశలో కూడా మందులు వాడటం నిర్లక్ష్యం చేస్తే వ్యాధి మరింత ముదురుతుంది. ఎక్స్టెన్సివ్లీ డ్రగ్ రెసిస్టెంట్ ఎక్స్డీఆర్ టీబీగా రూపాంతరం చెందుతుంది. ఈ దశలో చికిత్స అందించినా పెద్దగా ప్రయోజనం ఉండదు! ఈ మధ్యకాలంలో ఎండీఆర్, ఎక్స్డీఆర్ కేసుల సంఖ్య పెరుగుతుండటం బాధాకరం. కాబట్టి, క్షయ గురించి అవగాహన కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత ప్రచారం, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రజలు కూడా క్షయ పట్ల అప్రమత్తంగా ఉండాలి. దేశంలో 40 శాతం కన్నా ఎక్కువ మంది వరకు టీబీ ఇన్ఫెక్షన్కు లోనైన వాళ్లు ఉంటారు. అయితే, ఇన్ఫెక్షన్కు గురైన వాళ్లందరికీ క్షయ రాదు. వాళ్లలో రోగ నిరోధక శక్తి తగ్గడం, తగిన పోషకాహారం తీసుకోని సందర్భంలో ఇన్ఫెక్షన్ వ్యాధిగా మారే ప్రమాదం ఉంది. హ్యూమన్ ఇమ్యూనో వైరస్ (హెచ్ఐవీ), క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధి బాధితుల్లో టీబీ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. సకాలంలో వ్యాధిని నిర్ధారించి, కచ్చితమైన మోతాదులో, పూర్తికాలం మందులు వాడితే టీబీని 6 నెలల్లో వంద శాతం నివారించవచ్చు.
డ్రగ్ రెసిస్టెంట్ కేసులకు అంటే మందులు వాడిన తర్వాత, వివిధ కారణాల వల్ల రెండోసారి టీబీ బారినపడిన రోగులకు ప్రస్తుతం మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. గతంలో డ్రగ్ రెసిస్టెంట్ కేసుల్లో కేవలం 30 శాతం మాత్రమే ఫలితాలు ఉండేవి. ఇప్పుడు 60 నుంచి 65 శాతం వరకు ఫలితాలు
కనిపిస్తున్నాయి.