Type 2 Diabetes | టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారు రోజురోజుకీ పెరుగుతున్నారు. జీవనశైలిలో, ఆహారపు అలవాట్లల్లో వచ్చిన మార్పులే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణాలు అని చెప్పవచ్చు. డయాబెటిస్ కారణంగా మొత్తం శరీర ఆరోగ్యం దెబ్బతింటుంది. కనుక డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. సరైన జీవన శైలితో పాటు డయాబెటిస్ ను అదుపులో ఉంచే ఆహారాలను తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ను మనం అదుపులో ఉంచుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. మనం తీసుకునే ఆహారాలే డయాబెటిస్ నిర్వహణలో ముఖ్య పాత్ర పోషిస్తాయని వారు తెలియజేస్తున్నారు. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారు తమ అల్పాహారంలో భాగంగా అవకాడోను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారు అల్పాహారంలో భాగంగా అవకాడోను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వైద్యులు వివరిస్తున్నారు.
అవకాడోలో మన ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. కార్బొహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. 150 గ్రాముల అవకాడోలో 22 గ్రాముల కొవ్వులు, 10.1 గ్రాముల ఫైబర్ ఉంటుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. అవకాడోను తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సమయం ఆకలి అవ్వకుండా ఉంటుంది. అలాగే అవకాడోలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అదే విధంగా అవకాడోలో పొటాషియం అధికంగా ఉంటుంది. డయాబెటిస్ మాత్రమే కాకుండా అధిక రక్తపోటుతో బాధపడే వారు దీనిని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అవకాడోను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ విధంగా డయాబెటిస్ తో బాధపడే వారికి అవకాడో ఎంతో మేలు చేస్తుంది.
ఇక అవకాడోలు మాత్రమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే ఇతర ఆహారాలను కూడా డయాబెటిస్ తో బాధపడే వారు తీసుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారు తక్కువ కార్బొహైడ్రేట్స్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను తీసుకోవాలి. బ్రౌన్ రైస్, తృణ ధాన్యాలు, ఓట్ మీల్స్, తాజా పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, గింజలు వంటి ఆహారాలను తీసుకోవాలి. అలాగే డయాబెటిస్ తో బాధపడే వారు కొన్ని ఆహారాలను ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. చక్కెర పానీయాలు, మద్యం, వేయించిన ఆహారాలు, కార్బొనేటెడ్ పానీయాలు, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్, ప్యాక్ చేసిన ఆహారాలు, తీపి పదార్థాలు, మైదాతో చేసిన ఆహారాలు వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. ఈ విధంగా తగిన ఆహారాలు తీసుకుంటూ చక్కటి జీవనశైలిని పాటించడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవచ్చు. తద్వారా శరీర మొత్తం ఆరోగ్యం దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు.