కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ కిడ్నీ సమస్యలు రావడానికి గల ప్రధాన కారణాలలో అధిక రక్తపోటు ఒకటి. సాధారణంగా మూత్రపిండాలు, రక్తపోటు అనేది ఒకదానితో ఒకటి పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. ఈ క్రమంలోనే క్రానిక్ కిడ్నీ డిసీజస్ (సీకేడీ)కి ప్రధాన కారణాలలో అధిక రక్తపోటు ఒకటి అని చెబుతున్నారు వైద్యనిపుణులు. అధిక రక్తపోటు ఉన్న ప్రతి ఆరుగురిలో ఒకరికి సీకేడీ సమస్య ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. డయాబెటిస్, హైపర్ టెన్షన్ రెండూ ఉన్నప్పుడు, సుమారు 40 శాతం నుంచి 60 శాతం సీకేడీ కేసులు వస్తాయని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో హైపర్ టెన్షన్ కేసులు పెరుగుతుండటంతో, మూత్రపిండాల వ్యాధులు కూడా అధికంగా నమోదవుతున్నాయి. అయితే, చాలామంది రోగులు ఈ సమస్యను ఆలస్యంగా గుర్తిస్తున్నారు. దీంతో సమస్య జఠిలంగా మారి కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీస్తుంది. అసలు ఈ రక్తపోటుకు, కిడ్నీలకు సంబంధం ఏంటి? కిడ్నీలపై రక్తపోటు ఏవిధంగా ప్రభావం చూపుతుంది? అధిక రక్తపోటు కారణంగా వచ్చే కిడ్నీ సమస్యలు, వాటి నివారణ, అందుబాటులో ఉన్న చికిత్స వివరాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
అధిక రక్తపోటు కిడ్నీలకు చేటు. రక్తపోటు పెరుగుతున్నా కొద్దీ కిడ్నీ క్షీణిస్తూ ఉంటుంది. రక్త శుద్ధి సన్నగిల్లే సరికి శరీరం రోగాల దిబ్బవుతుంది. చెడు రక్తం రక్తపోటుని రెట్టిస్తుంది. ఆ అధిక పోటు కిడ్నీలపై మరింతగా పోటెత్తుతుంది. శరీరం విషమయమవుతూ ఆరోగ్యం విషమిస్తుంది. గుండె కిడ్నీపై, కిడ్నీ గుండెపై దాడిచేసుకునే ఈ విషవలయం నుంచి బయటపడాలంటే ముందే మేల్కొనాలి. కిడ్నీ సమస్యలకు ప్రధాన కారణాలలో అధిక రక్తపోటు (హైబీపీ) ఒకటి. అధిక రక్తపోటు మెత్తని కత్తి లాంటింది. నొప్పి లేకుండా దేహాన్ని ధ్వంసం చేస్తుంది.
పట్టణాల్లో అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్) బాధితులు పెరుగుతున్నారు. మూత్రపిండాలు, రక్తపోటు పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. రక్తపోటు పెరిగితే కిడ్నీ పనితీరు క్షీణిస్తుంది. అది దీర్ఘకాలంలో క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ) సమస్యకు దారితీస్తుంది. వైద్య పరిశోధకుల అధ్యయనాల ప్రకారం… అధిక రక్తపోటు ఉన్న ప్రతి ఆరుగురిలో ఒకరు సీకేడీతో బాధపడుతున్నారు. అలాగే ఈ అధిక రక్తపోటుతోపాటు డయాబెటిస్ కూడా ఉన్న బాధితుల్లో 40 శాతం మంది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులతోనూ బాధపడుతున్నారు. అధిక రక్తపోటు ఉన్నవాళ్లలో ఎక్కుమంది ఆ సమస్యను ఆలస్యంగా గుర్తిస్తున్నారు. అప్పటికే సమస్య తీవ్రంగా ఉండడం, కిడ్నీపై సుదీర్ఘకాలం ప్రతికూల ప్రభావం చూపడంతో సమస్య జఠిలమవుతున్నది.
అధిక రక్తపోటు అనేది క్రానిక్ కిడ్నీ డిసీజ్(సీకేడీ)కి ప్రధాన కారణాలలో ఒకటి. కిడ్నీల్లోకి అధిక ఒత్తిడితో రక్తం ప్రసరించడం వల్ల మూత్రపిండాలలోని చిన్న రక్తనాళాలు దెబ్బతింటాయి. దాంతో మూత్రపిండాల్లో చిన్న రక్త నాళాలు, రక్తాన్ని వడపోసే నెఫ్రాన్లు సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఫలితంగా మూత్రపిండాలు రక్తాన్ని సరిగ్గా వడపోయలేవు. శుద్ధికాని రక్తం శరీరానికి సరఫరా జరిగితే.. ఆ రక్తంలోని సోడియం లవణం, నీరు శరీరంలో నిలిచిపోతాయి. రక్తంలో సోడియం లవణం స్థాయులు పెరగడంతో రక్తపోటు మరింత పెరుగుతుంది. ఇలా ఒక చెడు చక్రబంధం ఏర్పడుతుంది. రక్తపోటు, కిడ్నీలు పరస్పర ప్రతికూల ప్రభావాలతో ఓ విషవలయం ఏర్పడుతుంది. చివరికి కిడ్నీ విఫలమవుతుంది.
హైపర్ టెన్షన్ మూత్రపిండాల రక్తనాళాలను దెబ్బతీస్తుంది.
దీనివల్ల శరీరంలో ఉప్పు, నీటి నిల్వలు పెరిగిపోతాయి.
ఉప్పు, నీటి నిల్వ కారణంగా రక్తపోటు మరింత పెరుగుతుంది.
తీవ్ర రక్తపోటుతో కిడ్నీలు విఫలమవుతాయి.
అదుపులోకి తెచ్చుకుంటే కిడ్నీలకు జరిగిన నష్టాన్ని పూరించకున్నా, రేపటి ప్రమాదాన్ని నివారించవచ్చు. కిడ్నీల పనితీరుని సాధారణ రక్త పరీక్షలు లేదా మూత్ర పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. అంతేకాకుండా మూత్రంలో ప్రొటీన్ లీకేజీ నిర్ధారణ పరీక్షల ద్వారా కూడా కిడ్నీ వ్యాధులు బయటపడతాయి. రక్తంలో క్రియాటినిన్, ఈజీఎఫ్ఆర్ ఆధారంగా కిడ్నీ పనితీరును అంచనా వేయవచ్చు. ఈ క్రమంలో రక్తపోటును పర్యవేక్షిస్తూ మూత్రపిండాలపై ఆ ప్రభావం చూపకుండా బీపీని నియంత్రించవచ్చు. ప్రారంభ దశలో గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు
అధిక రక్తపోటు, కిడ్నీ వ్యాధిని గుర్తించిన తర్వాత నియంత్రించకపోతే, మూత్రపిండాల పనితీరు వేగంగా క్షీణిస్తుంది. కొన్ని సందర్భాల్లో డయాలిసిస్ చేయాల్సిన అవసరం రావొచ్చు. ప్రాణాంతకంగా ఉంటే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అవసరమవుతుంది. కిడ్నీ వ్యాధిగ్రస్థులకు గుండెపోటు ప్రమాదం ఎకువగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చకెర, కొలెస్ట్రాల్ నియంత్రణ మరింత కష్టమవుతుంది. కాబట్టి తరచుగా రక్తపోటును పరీక్షించుకోవడం, అవసరమైన చికిత్స చేయించుకోవడం చాలా ముఖ్యం.
దేశంలో జరిపిన తాజా సర్వే ప్రకారం వయసు పైబడిన వారిలో 28 శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు.
అధిక రక్తపోటు బాధితుల్లో మూడో వంతు రోగులు మాత్రమే నిర్ధారణ పరీక్షలు చేయించుకుని, చికిత్స పొందుతున్నారు.
అధికరక్తపోటు బాధితుల్లో 8-9 శాతం మందిలోనే రక్తపోటు నియంత్రణలో ఉంది.
వయసు పైబడిన వాళ్లలో 13-16 శాతం మందిలో సీకేడీ సమస్యలు ఉన్నాయి.
ప్రతి ఎనిమిది మందిలో ఒకరిలో కిడ్నీ సమస్య తలెత్తుతున్నది.
దీర్ఘకాల కిడ్నీ సంబంధ వ్యాధిగ్రస్థుల్లో 30 శాతం మంది అధిక రక్తపోటు బాధితులే.