సాంకేతికత పెరిగిపోవడంతో శస్త్ర చికిత్సలు సులభతరం అయ్యాయి. అందులోనూ రోబోటిక్ టెక్నాలజీ వచ్చాక.. కచ్చితత్వం, విజయాల రేటు మరింత అధికమైంది.
విజువలైజేషన్
రోబోలను రంగంలో దించడం వల్ల.. సర్జరీ చేయాల్సిన ప్రదేశాన్ని వైద్యుడు మరింత స్పష్టంగా చూడ గలుగుతాడు. త్రీ డైమెన్షన్లో.. పరిశీలించగలడు. దీంతో పని సులభం అవుతుంది. కణుతుల తొలగింపులో అవరోధాలు ఉండవు.
రోబోటిక్ చేతులు
రోబోటిక్ సర్జికల్ సిస్టమ్స్‌కు అమర్చిన కృత్రిమ చేతులు.. వైద్యుల శ్రమను తగ్గిస్తాయి. దీనివల్ల మానవ తప్పిదాలకు,
నిర్లక్ష్యానికి ఆస్కారం ఉండదు.
తక్కువ కోతలతో
సాధారణ శస్త్ర చికిత్సతో పోలిస్తే.. రోబోటిక్ సర్జరీలో కోతలు తక్కువగా ఉంటాయి. దీంతో రోగి త్వరగా కోలుకుంటాడు. ఆసుపత్రిలో ఎక్కువ రోజులు గడపాల్సిన పరిస్థితి ఉండదు. గాటు గుర్తులు పెద్దగా ఏర్పడవు కాబట్టి, కాస్మటిక్ సర్జరీల అవసరమూ ఉండదు.
వైద్యులకూ సులభమే
రోబోల సహకారం వల్ల సర్జన్ మీద ఒత్తిడి తగ్గుతుంది. దీంతో ప్రధాన లక్ష్యం మీద దృష్టి సారిస్తారు. గంటల తరబడి శస్త్ర చికిత్స చేయాల్సిన పరిస్థితుల్లోనూ అలసటకు గురికారు.
.. నిజమే, సాధారణ సర్జరీతో పోలిస్తే ఇది కొంత ఖరీదైన వ్యవహారమే. కాకపోతే రానురాను ఆ వ్యయాలు నియంత్రణలోకి
వచ్చే అవకాశం ఉంది. రోబోటిక్ ఎక్విప్మెంట్ ధరలు కూడా గతంతో పోలిస్తే కొంతమేర తగ్గాయి. ఇంకొంత తగ్గితే.. సాధారణ రోగులకు ఎంతో మంచి జరుగుతుంది. కార్పొరేట్ దవాఖానల మధ్య పోటీ వల్ల కూడా ధరలు నేలచూపులు చూడవచ్చు.