మా బాబు వయసు ఏడేండ్లు. మామూలుగా బాగానే ఉంటాడు. అయితే మూడు, నాలుగు వారాలకు ఒకసారి జలుబు, దగ్గుతో బాధపడుతుంటాడు. కొన్నిసార్లు గొంతు నొప్పి ఉందంటున్నాడు. స్కూల్కు చక్కగా వెళ్తాడు. చక్కగా ఆడుకుంటాడు. బాగా చదువుతాడు కూడా! అడపాదడపా జలుబుతో ఇబ్బందిపడుతున్నాడు. పైగా బాబు మెడ భాగంలో కొన్ని గ్రంథులు వాచినట్టు కనిపిస్తున్నాయి. డాక్టర్ను సంప్రదిస్తే అవేం ప్రమాదకరం కాదన్నారు. ఇలా గ్రంథులు వాచడం ప్రమాదకరమా? మా బంధువుల్లో 30 ఏండ్ల వ్యక్తికి మెడపై గ్రంథులు ఉబ్బాయి. వైద్యులు అతనికి టీబీ ఉందన్నారు. ఆ మాట విన్నప్పటి నుంచి మాకు కంగారుగా ఉంది. మా అబ్బాయికి అలాంటి ఇబ్బంది ఏదైనా ఉందా? ఆందోళనగా ఉంది. పరిష్కారం ఏమిటి?
మెడ భాగంలో ఉండే గ్రంథులను లింప్నోడ్స్ అంటారు. అవి వాచడం అనేది అత్యంత సహజం. నొప్పి లేకుండా, గ్రంథుల వాపులు తక్కువ సైజులో ఉంటే కంగారుపడాల్సిన పనిలేదు. చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు తలెత్తినప్పుడు ఇలా గ్రంథులు ఉబ్బుతుంటాయి. ఇక మీ బాబు మూడు, నాలుగు వారాలకు ఒకసారి జలుబు, దగ్గుతో బాధపడుతున్నాడని తెలియజేశారు. పదేండ్ల వయసు వచ్చే వరకు పిల్లలకు ఇలాంటి ఇన్ఫెక్షన్లు ఏడాదికి పదిసార్ల వరకూ వస్తుంటాయి. ముఖ్యంగా వర్షకాలం, చలికాలం పిల్లలకు రెగ్యులర్గా ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఇది కూడా సాధారణమే! ఇలా గ్రంథులు ఉబ్బితే టీబీకి దారితీసే ప్రమాదం ఉందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. కొంతమందిలో మెడ దగ్గర కణుతులు ఉబ్బితే టీబీగా పరిణమించవచ్చు. కానీ, మీ బాబు విషయంలో టీబీలా అనిపించడం లేదు. ఎందుకంటే మీరు చెప్పిన అంశాలను బట్టి బాబు యాక్టివ్గా ఉన్నాడనిపిస్తుంది. అయితే, అబ్బాయి ఎత్తు, బరువు విషయం ప్రస్తావించలేదు. మీ అనుమానం నివృత్తి చేసుకోవడానికి పీడియాట్రీషియన్ను సంప్రదించండి. బిడ్డను పరీక్షిస్తే గానీ కచ్చితంగా నిర్ధారణకు రాలేం. దీనికి అవసరమైన పరీక్షలు నిర్వహించి, టీబీ లక్షణాలు ఉన్నట్లయితే వైద్యులు సరైన చికిత్స అందిస్తారు. మీరు బెంబేలెత్తాల్సిన అవసరం లేదు.