మనదేశంలో అత్యంత ప్రబలంగా ఉన్న వ్యాధుల్లో హృద్రోగాలు ముందువరుసలో ఉంటాయి. వీటి కారణంగా అన్ని వయోవర్గాల వారూ అకాల మరణాన్ని పొందుతుండటం బాధాకరం. అయితే హృద్రోగులే కాకుండా మామూలు మనుషులలోనూ గుండె రోగాలకు సంబంధించి ఎన్నో అనుమానాలు పేరుకొనిపోయాయి. కాబట్టి, శరీరంలో అత్యంత కీలక అవయవమైన గుండెకు సంబంధించిన వ్యాధుల గురించి కొన్ని వాస్తవాలనైనా తెలుసుకుని ఉంటే మంచిది.
గుండెపోటు పెద్దలకు మాత్రమే వస్తుందా? అందుబాటులో ఉన్న సమాచారం మేరకు భారతీయ పురుషులలో 50 శాతం మందికి 50 ఏండ్లలోపు, 25 శాతం మందికి 40 ఏండ్లలోపు గుండెపోటు వస్తున్నది.
గుండె సంబంధ వ్యాధులు మగవాళ్లకే ఎక్కువగా వస్తాయా? నిజమే! స్త్రీలకు వారిలో విడుదల అయ్యే కొన్ని హార్మోన్ల కారణంగా రక్షణ సహజంగానే లభిస్తుంది. అయితే, ఆధునిక కాలంలో జీవనశైలి మార్పులు, ధూమపానం, ఒత్తిళ్ల ఫలితంగా యుక్తవయసు స్త్రీలలో కూడా గుండెపోటు ముప్పు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ రెండూ ఒకటేనా? రెండూ విభిన్నమైనవి. రెండిటికీ వేర్వేరు చికిత్సలు అవసరమవుతాయి. గుండె విద్యుదావేశంలో లోపాల కారణంగా గుండె లయ క్రమం తప్పుతుంది. దీనిని ‘అరిథ్మియ’ అంటారు. అలా గుండె రక్తం సరఫరా చేసే పనికి ఆటంకం ఏర్పడటంతో అది మెదడు, ఊపిరితిత్తులు, ఇతర శరీర అవయవాలకు రక్తాన్ని సవ్యంగా పంపించలేని పరిస్థితి ఏర్పడుతుంది. హృదయ ధమనుల్లో ఒకదానిలో ఆటంకాలు ఏర్పడటం వల్ల గుండెపోటు వస్తుంది. అలా గుండె చేసే కీలకమైన పని అయిన రక్త సరఫరా నుంచి గుండె కండరాలు దూరమైపోతాయి. దానికి తగిన చికిత్స తీసుకోకపోతే ఆక్సిజన్ సరిగ్గా అందక రోగి మరణిస్తాడు.
కుటుంబంలో హృద్రోగాల చరిత్ర ఉంటే, మనల్ని మనం కాపాడుకోగలమా? సరైన జీవనశైలి, కొలెస్ట్రాల్‌ను, రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడం మొదలైన చర్యల వల్ల కుటుంబ చరిత్ర ఉన్నప్పటికీ గుండె వ్యాధులను రాకుండా నివారించుకునే అవకాశం ఉంది.
గుండెపోటు వచ్చిన తర్వాత వ్యాయామం చేయవచ్చా? తగిన జాగ్రత్తలతో తప్పకుండా వ్యాయామం చేయవచ్చు. గుండె సంపూర్ణ ఆరోగ్యం కోసం అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా వారంలో కనీసం రెండున్నర గంటల మితమైన శారీరక వ్యాయామం మంచిదని సిఫారసు చేసింది.
గుండెపోటు తర్వాత శృంగారంలో పాల్గొనవచ్చా? గుండెపోటు చికిత్స తర్వాత కొన్ని వారాల్లో మామూలుగానే శృంగారంలో పాల్గొనవచ్చు. అయితే చికిత్స చేసిన వైద్యుణ్ని సంప్రదించి, ఆయన సలహా పాటించాలి.
ఏ గుండెపోటుకైనా యాంజియోప్లాస్టీ అవసరమవుతుందా? దీనిని ఈసీజీ, ట్రెడ్మిల్ టెస్ట్, ట్రోపోనిన్, ఎకోకార్డియోగ్రఫీ లాంటి పరీక్షలతో తేల్చాల్సి ఉంటుంది. చివరగా వచ్చేదే యాంజియోగ్రఫీ.
మందులు వాడుతున్నా మళ్లీ గుండెపోటు వస్తుందా? మందులు తీసుకుంటున్నప్పటికీ, ఎక్కువ కొలెస్ట్రాల్, సంతృప్త కొవ్వులు (శాచురేటెడ్ ఫ్యాట్స్) ఉన్న ఆహార పదార్థాలను తినడం ఆపకపోతే, ఔషధాలు అంత ప్రభావవంతంగా పనిచేయకపోవచ్చు. కాబట్టి, మళ్లీ గుండెపోటుకు తలుపులు తెరిచి ఉన్నట్లే.