కాలేయం మనిషి శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. ఇది నిత్యం 500కు పైగా విధులు నిర్వర్తిస్తూ మన జీవనశైలిని ప్రభావితం చేస్తుంది. కానీ కాలం కొద్దీ మారిపోతున్న ఆహారపు అలవాట్లు, మద్యపానం కాలేయానికి ముప్పు కలిగిస్తున్నాయి. అయితే, కాలేయ సమస్యలను చాలామంది తొలిదశల్లోనే గుర్తించలేకపోతున్నారు. దీంతో ప్రమాదకర దశలకు చేరుకుంటున్నారు. కాలేయ ఆరోగ్యం గురించి ప్రజల్లో అవగాహన కలిగించడానికి 2010 నుంచి ఏటా ఏప్రిల్ 19న ‘ప్రపంచ కాలేయ దినోత్సవం’గా జరుపుకొంటున్నారు. ఈ నేపథ్యంలో కాలేయ సమస్యలను ముందు జాగ్రత్తలతో నియంత్రించడం ఎలాగో నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
కాలేయం శరీరంలో ఊపిరితిత్తుల కింద కుడివైపు ఉంటుంది. శరీరంలో కొవ్వులు కరిగించడంలో కీలకపాత్ర పోషించే పైత్యరసం ఉత్పత్తి, రక్తం గడ్డకట్టేందుకు అవసరమైన ప్రొటీన్స్ ఉత్పత్తి, తిన్న ఆహారంలో పోషకాలను దాచిపెట్టి శరీరానికి కావాల్సిన సమయంలో వాటిని విడుదల చేయడం, శరీరంలో పేరుకున్న టాక్సిన్లను కరిగించి విసర్జన రూపంలో వెళ్లిపోయేలా కాలేయం పనిచేస్తుంది. బీపీ, షుగర్, ఇమ్యూనిటీని సైతం ఇది పర్యవేక్షిస్తుంది. నాళాల ద్వారా రక్తం కాలేయానికి చేరిన తర్వాతే గుండెకు చేరుతుంది. ఆ ప్రక్రియలో పేగులనుంచి వచ్చే ప్రొటీన్లను నిల్వ ఉంచుకుంటుంది. శరీరానికి అవసరమైన సందర్భాల్లో ఆయా అవయవాలకు అందిస్తుంది.
ఇక కాలేయం ప్రధానంగా రెండు రకాలుగా దెబ్బతింటుంది. మొదటిది ఎక్యూట్ డ్యామేజ్, రెండోది క్రానిక్ డ్యామేజ్. హెపటైటిస్ ఎ, హెపటైటిస్ బి లాంటి కాలేయ ఇన్ఫెక్షన్లు సోకినా, విషం తాగినా ఎక్యూట్ లివర్ డ్యామేజ్ సంభవిస్తుంది. వెంటనే తగిన చికిత్స అందిస్తే ఈ సమస్య త్వరగానే నయమైపోతుంది. మద్యపానం, ఫ్యాటీ లివర్ డిసీజ్ కారణంగా కాలేయ సమస్యలతో బాధపడే వారిని గత కొన్నేళ్లుగా క్రానిక్ లివర్ డ్యామేజ్ సమస్య పీడిస్తున్నది. దాదాపు మద్యపాన దుర్వ్యసనం ఉన్న 70శాతం మందిలో ఈ తరహా సమస్య ఉంటుంది. క్రానిక్ లివర్ డ్యామేజ్ బారినపడితే కాలేయ మార్పిడి (లివర్ ట్రాన్స్ప్లాంటేషన్) కూడా అవసరపడొచ్చు.
కాలేయం పాడైపోవడం నాలుగు ప్రధాన దశల్లో జరుగుతుంది. మొదటి దశ మద్యం సేవించడం ద్వారా వాపు ఏర్పడుతుంది. ఇందులో ఎక్కువ లక్షణాలు కనిపించవు. వాపు తగ్గకపోతే రెండోదశలో ఫైబ్రోసిస్కు దారితీస్తుంది. ఇక మూడోదైన లివర్ సిరోసిస్ దశ తీవ్రమైనది. ఈ దశలో కాలేయం చేయాల్సిన పనులన్నీ నిలిచిపోతాయి. లివర్ గట్టిపడిపోతుంది. నాలుగో దశ కాలేయ వైఫల్యం (లివర్ ఫెయిల్యూర్). కాలేయం దెబ్బతినడంలో చివరి దశ కూడా ఇదే. ఈ స్థితికి చేరుకున్న రోగికి కాలేయం మార్పిడి చేయడం ఒక్కటే పరిష్కార మార్గం. ఈ దశలోనే కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది.
15 ఏళ్ల కింద 30 నుంచి 40 శాతం వరకు హెపటైటిస్ సి కేసులు ఉండేవి. ఇప్పుడు అవి కేవలం పది శాతం మాత్రమే వస్తుండగా, 50 శాతం కేసులు ఫ్యాటీ లివర్, 30 నుంచి 40 శాతం కేసులు మద్యపానం కారణంగా వస్తున్నాయి. కొన్నేళ్లుగా ఆల్కహాల్ తీసుకుంటున్న వారికి 30 ఏళ్ల వయసు వచ్చేసరికి కాలేయం పాడైపోవడం ఎక్కువగా ఉంటున్నది. ఇక స్త్రీలలో అయితే శరీరం చుట్టూ కొవ్వు ఏర్పడుతుంది. పురుషులకు మాత్రం గుండె భాగంలో కొవ్వు ఏర్పడుతుంది. కాగా, ఫ్యాటీ లివర్ డిసీజ్ లక్షణాలు పురుషులు, స్త్రీలలో వేర్వేరుగా కనిపించవచ్చు. అయితే, మహిళలు మాత్రం ఆటో ఇమ్యూన్ వ్యాధి వల్ల బాధపడుతున్నారు.
కాలేయం పాడైపోవడం వల్ల శరీరంలో మిగతా అవయవాలపై ప్రభావం పడుతుంది. అది విడుదల చేసే టాక్సిన్ల వల్ల శరీరంలోని కిడ్నీలు, గుండె, ఊపిరితిత్తులు, మెదడు పాడైపోయి మనిషి కోమాలోకి వెళ్తాడు. అయితే, 70 శాతం వరకు కాలేయం పాడైపోయే వరకు దాని లక్షణాలు బయటపడవు. దీంతో చికిత్సకు వచ్చేసరికి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. కాకపోతే ప్రారంభంలో కొన్ని సంకేతాలు మాత్రం శరీరంలో వస్తుంటాయి. పసరికలు, కాళ్లలో వాపు, కడుపులో నీరు జారడం, రక్తం గడ్డకట్టకపోవడం, కిడ్నీలు దెబ్బతినడం, మతిమరుపు, మాట నెమ్మదించడం, బరువు తగ్గడం వంటి ప్రాథమిక లక్షణాలు సంభవిస్తుంటాయి. వీటిని గమనించగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
పుట్టబోయే చిన్నారుల పట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది పిల్లలు పుట్టుకతోనే కాలేయ వ్యాధితో జన్మిస్తారు. కొంతమందికి పచ్చకామెర్లు వస్తాయి. రెండు వారాలైనా ఆ లక్షణాలు తగ్గకపోయినా, మలం తెల్లరంగులో వస్తున్నా వెంటనే పిల్లల వైద్యుణ్ని సంప్రదించాలి. కాలేయ వ్యాధి అని తేలితే రెండు నెలల్లోగా శస్త్రచికిత్స చేయించాలి. లేదంటే తర్వాత చికిత్స కష్టతరంగా మారుతుంది.
ఇరవై ఏళ్ల క్రితం హెపటైటిస్ బి, హెపటైటిస్ సి లాంటి కాలేయ వ్యాధులు నిర్ధారణ కాగానే ఎయిడ్స్ వచ్చినంతగా భయపడేవాళ్లు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మంచి చికిత్స విధానాల వల్ల కాలేయ రోగుల్లో 90 శాతం మంది కోలుకుంటున్నారు. ఒకప్పుడు ఎక్యూట్ లివర్ డ్యామేజ్ వల్ల మెదడులో వాపు వచ్చి చాలామంది చనిపోయేవాళ్లు. యునైటెడ్ కింగ్డం (యూకే)లో 20 ఏళ్ల కింద ప్యారాసెటమాల్ మాత్రలు ఎక్కువగా తీసుకోవడం మూలంగా ఎక్యూట్ లివర్ డ్యామేజ్ బారినపడేవాళ్లు. దీంతో ఆ దేశంలో ఎన్నో పరిశోధనలు చేసి సమస్యకు పరిష్కారం కనుక్కొన్నారు. కాలేయ మార్పిడి చికిత్సను అందుబాటులోకి తెచ్చారు. గతంలో 20 శాతం అనుకూల ఫలితాలు ఉండేవి. ఇప్పుడు దాన్ని 80 శాతం వరకు తీసుకురాగలిగారు. మనదేశంలో కూడా కాలేయ మార్పిడి చికిత్సలు విజయవంతంగానే జరుగుతుండటం గమనించాల్సిన విషయం.
ఇప్పుడు అన్ని రంగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) శాసిస్తున్నది. అయితే, ఏఐ అనేది రోగితో నేరుగా మాట్లాడే సాధనం కాదు. రోగి భావోద్వేగాలను అది అర్థం చేసుకోలేదు. వైద్యునికి సహాయంగా మాత్రమే ఉంటుంది. వేగం, కచ్చితత్వాన్ని అమలు చేస్తుంది. అయితే, కాలేయ చికిత్సలో వైద్యుడి ప్రమేయం ఎంతో ముఖ్యమైంది. అన్ని రంగాల్లో లాగే కాలేయ వ్యాధుల చికిత్సలోనూ ఏఐ ఉపయోగకరంగా ఉంటుంది.
– రాజు పిల్లనగోయిన
– డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి
కాలేయ శస్త్రచికిత్స నిపుణుడు,
స్టార్ ఆసుపత్రి, హైదరాబాద్