Pollution | పిల్లలు తమ బాల్యం తొలి సంవత్సరాల్లో ఎక్కువ మోతాదులో కాలుష్యానికి గురవుతే మెదడులో ఆలోచన, శరీర నియంత్రణకు సంబంధించిన భాగాలపై తీవ్రమైన ప్రభావం పడుతుందట. ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ అనే జర్నల్లో ప్రచురితమైన ఓ పరిశోధన ఈ విషయం వెల్లడించింది. వాయు కాలుష్యం పిల్లల మెదడు అభివృద్ధికి ముప్పుగా పరిణమిస్తుందని హెచ్చరించింది. స్పెయిన్ దేశానికి చెందిన బార్సెలోనా ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరిగింది.
పరిశోధన కోసం 3,626 మంది పిల్లల నుంచి సమాచారం సేకరించారు. వీళ్లంతా పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5, పార్టిక్యులేట్ మ్యాటర్ 10, నైట్రోజన్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ల కాలుష్యం బారినపడిన ప్రాంతాల్లో నివసించేవాళ్లే. పుట్టినప్పటి నుంచి మూడేండ్ల వరకు వాయు కాలుష్యం బారినపడితే శరీర కదలికలు, వినికిడికి సంబంధించిన మెదడు భాగాల్లో నాడుల మధ్య అనుసంధానం తక్కువగా ఉంటుందని ఈ పరిశోధన ఫలితాలు వెల్లడించాయి. అయితే, ఈ ఫలితాలను కచ్చితంగా నిర్ధారించడానికి మరింత అధ్యయనం అవసరమని పరిశోధకులు తెలిపారు.