హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసుశాఖల్లో ఎన్నో కీలక కేసులను పరిష్కరించేందుకు, నేరస్తులకు సరైన శిక్ష పడేందుకు ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో నిర్వహించే సైంటిఫిక్ పరీక్షలే కీలకం. ఆ పరీక్షల ఫలితాలను పోలీసులు కోర్టుకు సమర్పిస్తుంటారు. ఎఫ్ఎస్ఎల్కు బాధ్యత వహిస్తున్న ఓ ఉన్నతాధికారికి ఉదయం ‘నమస్తే తెలంగాణ’ సహా పలు మీడియా సంస్థలు ఫోన్లు చేసినా ఆమె కనీసం స్పందించలేదు.
ఆమె వ్యక్తిగత కార్యదర్శి కూడా ఫోన్లు కట్ చేశారు తప్ప.. సమాధానం ఇవ్వలేదు. ఈ ప్రమాదంపై తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం, ప్రమాదం జరిగిన తర్వాత అగ్నిమాపకశాఖ అధికారులు విడుదల చేయాల్సిన ప్రకటన రాకపోవడం, ఎఫ్ఎస్ఎల్ బాధ్యతలు చూస్తున్న ఉన్నతాధికారులెవ్వరూ ఫోన్లకు ఆన్సర్ చేయకపోవడం మరింత అనుమానాలకు తావిస్తున్నది.
ఈ ప్రమాదం విషయమై మీడియాతో మాట్లాడిన డీసీపీ శిల్పవల్లి సైతం.. ఓటుకు నోటు కేసు ఆధారాలు తగులబడ్డాయంటూ జరుగుతున్న ప్రచారంపై మీడియా ప్రశ్నించగా, ఆమె సమాధానం దాటవేయడం అనుమానాలకు తావిస్తున్నది. ప్రమాదం జరిగిన ప్రదేశంపైనా అధికారులు తలోమాట చెప్పుకొచ్చారు. మొదట ఈ ప్రమాదం ఎఫ్ఎస్ఎల్లోని ఇంజినీరింగ్ విభాగంలో జరిగిందని చెప్పగా, తర్వాత సీజర్ రూమ్‌లో జరిగిందని తెలిపారు. ప్రమాదంపై ఉన్నతాధికారులు రాత్రి ఒక ప్రకటన మాత్రమే విడుదల చేశారు.
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఉదయం 10.08 గంటలకు జరిగిన అగ్ని ప్రమాదంపై ఎఫ్ఎస్ఎస్ డైరెక్టర్ శిఖాగోయెల్ శనివారం రాత్రి 10.25కి ప్రకటన విడుదల చేశారు. ఎఫ్ఎస్ఎల్లో పని చేస్తున్న ఒక ఉద్యోగి భవనం మొదటి అంతస్తులోని ఒక గదిలో నుంచి పొగ రావడం గమనించి వెంటనే అకడి సిబ్బందిని అప్రమత్తం చేశాడని చెప్పారు. ఉన్నతాధికారులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో మధ్యాహ్నం 1:30 గంటలకు మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారని చెప్పారు.
ఈ అగ్ని ప్రమాదం వల్ల ఫోరెన్సిక్ కంప్యూటర్ ల్యాబ్, ట్రైనింగ్ హాల్‌తోపాటు భవనం మొదటి అంతస్తులో ఉన్న కొన్ని ఇతర సదుపాయాలకు మాత్రమే నష్టం వాటిల్లిందని చెప్పారు. ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. నష్టాన్ని అంచనా వేస్తున్నామని తెలిపారు. ప్రమాదంపై కొన్ని మీడియాల్లో నిర్ధారణ లేని ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించినట్టు చెప్పారు.