చంపాపేట, ఫిబ్రవరి 7: ఇండ్లు నిర్మించుకున్న ముప్పై ఐదు ఏండ్లకు ఆ ఇండ్ల స్థలం దేవాదాయ శాఖదని అ శాఖ అధికారులకు గుర్తు రావడం సిగ్గుచేటని అడ్వకేట్ ఆంజనేయచారి అన్నారు. చంపాపేట డివిజన్ పరిధి కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయ అనుబంధంలోని శ్రీబన్సురీవాలా కృష్ణ మందిరం స్థలంలోని ఇండ్ల బాధితులను దేవాదాయ శాఖ అధికారులు ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్‌ను అనుసరించి, పోలీసుల బందోబస్తుతో ఖాళీ చేయించిన విషయం విదితమే.
ఈ విషయమై శనివారం అ ఇండ్ల బాధితులు ఇండ్లుకు వేసిన తాళాలు తీసి తమ ఇండ్లలోకి తమను పంపించాలని దేవాదాయ శాఖ అధికారులకు వారి ఆవేదనను వినిపిస్తూ వారి ఇండ్లముందు ఆందోళన చేపట్టారు. అనంతరం వారు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బాధితుల తరఫున అడ్వకేట్ ఆంజనేయచారి పాల్గొని మాట్లాడుతూ, ఇండ్లు ఖాళీ చేయించే ఈ చర్య కోర్టు ధిక్కరణే అని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాధితుల పక్షాన తాను న్యాయ పోరాటం చేస్తానని ఆంజనేయచారి అన్నారు.