శామీర్ పేట, ఫిబ్రవరి 7: అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన బీఆర్ఎస్ ర్యాలీ, కార్నర్ మీటింగ్లో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం ర్యాలీ కార్నర్ మీటింగ్ లో భాగంగా 1వ వార్డు అభ్యర్థి హఫవతి వెంకటేష్, 2వ వార్డు అభ్యర్థి చీర్ల లావణ్య, 3వ వార్డు అభ్యర్థి దాసరి రవి, 4వ వార్డు అభ్యర్థి జీడిపల్లి కవిత, 13వ వార్డు అభ్యర్థి ఎం.డి. యూసుఫ్ బాబాలతో పాటు అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి, మలాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలతో కలిసి కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల లాల్ గాడి మలక్ పేటలో బీఆర్ఎస్ నాయకులపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ, దౌర్జన్యాలకు పాల్పడుతున్న కాంగ్రెస్కు ఓటు ద్వారానే ప్రజలు బదులివ్వాలని పిలుపునిచ్చారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం పదేళ్లు వెనకి వెళ్లిందని ఆరోపించిన ఆయన, పలు సంక్షేమ పథకాలు అమలు కాలేదని విమర్శించారు. కంపెనీలు మూతపడుతున్నాయనీ, నిరుద్యోగం పెరిగిందని, కొత్త నియామకాలు నిలిచిపోయాయన్నారు.
కారు గుర్తుకు ఓటేస్తేనే మళ్లీ బీఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పడి, కేసీఆర్ సారథ్యంలో బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఉద్యమకారుడు జాంగీర్, తురపల్లి మాజీ సర్పంచ్ మల్లేశ్ మాట్లాడుతూ.. టీఆర్ ఎస్ పాలనలోనే తురపల్లి అభివృద్ధి సాధ్యమైందని పేరొన్నారు. కౌన్సిలర్ అభ్యర్థి యూసుఫ్ బాబా మాట్లాడుతూ తాగునీరు, విద్యుత్, మౌలిక వసతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి సహకారంతో ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది మహిళా కార్యకర్తలు, బి ఆర్ ఎస్ నాయకులు జేఏసీ వెంకన్న, ఉస్మాన్, నర్సింగ్, బాలకృష్ణ, సురేశ్, హేమంత్, సాయి, వంగవెంకట్ రెడ్డి, పెద్ద ఎత్తున కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.