సిటీబ్యూరో, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ): అమాయక ప్రజల అత్యాశను ఆయుధంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా ట్రేడింగ్ పేరుతో పెట్టుబడిదారులను, వ్యాపారులను, పార్ట్‌టైమ్ జాబ్స్, ఉపాధి కల్పన పేరుతో నిరుద్యోగులను, మ్యాట్రీమోని ముసుగులో అవివాహితులను బురిడీ కొట్టిస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు. దీంతో రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పోలీసులు దేశంలోని వివిధ రాష్ర్టాల్లో తిష్టవేసి, నగరవాసులను దోచుకుంటున్న మోసగాళ్లపై ఉక్కుపాదం మోపేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
ఇందులో భాగంగా జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నమోదైన 9 కేసులను ఛేదించి, 12 మంది సైబర్ మోసగాళ్లను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ టి.సాయి మనోహర్ తెలిపారు. అరెస్టు అయిన వారిలో ఏడుగురు నిందితులు ట్రేడింగ్ మోసాలకు పాల్పడినవారు ఉన్నట్లు డీసీపీ తెలిపారు. ఛేదించిన మొత్తం కేసుల్లో 5 ట్రేడింగ్ మోసాలకు సంబంధించినవని,ఈ కేసుల్లో ఏడుగురిని అరెస్టు చేయగా.. ఉద్యోగాల పేరుతో జాబ్ ఫ్రాడ్‌కు పాల్పడిన రెండు కేసుల్లో ముగ్గురు నిందితులను, పార్ట్‌టైమ్ జాబ్ ఫ్రాడ్ కేసులో ఒకరిని, మ్యాట్రీమోని కేసులో ఒకరిని చొప్పున మొత్తం 9 కేసుల్లో 12 మందిని అరెస్టు చేసినట్లు వివరించారు.
58 కేసుల్లో రూ.1.04 కోట్లు చెల్లింపు
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నమోదైన 58 కేసుల్లో న్యాయస్థానం నుంచి 406 రీఫండ్ ఆర్డర్లను పొందడం జరిగిందని డీసీపీ తెలిపారు. వీటి ద్వారా మొత్తం రూ.1,04,17,082ను బాధితులకు తిరిగి చెల్లించనున్నట్లు వెల్లడించారు.
మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో…
మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈనెల 1 నుంచి 7వ తేదీ వరకు నమోదైన 7సైబర్ నేరాలకు సంబంధించిన కేసులను ఛేదించి, 11 మందిని అరెస్టు చేసినట్లు మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులు తెలిపారు. పెట్టుబడుల పేరుతో మోసగించిన 4 కేసుల్లో నలుగురు సైబర్ నేరగాళ్లను అరెస్టు చేయగా, డిజిటల్ అరెస్ట్ కేసులో ఇద్దరిని, ఆన్లైన్ గేమింగ్ కేసులో ముగ్గురిని, పార్ట్‌టైమ్ జాబ్ కేసులో ఇద్దరు చొప్పున మొత్తం 7 కేసుల్లో 11 మందిని అరెస్టు చేసినట్లు మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు వివరించారు.
రూ.43.21 లక్షల రీఫండ్‌కు చర్యలు
సైబర్ నేరగాళ్ల బారినపడి నిలువు దోపిడీకి గురైన పలువురు బాధితులకు పోగొట్టుకున్న సొమ్మును తిరిగి ఇప్పించేందుకు మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో బాధితులకు రూ.43.21లక్షలను తిరిగి చెల్లించేందుకు న్యాయస్థానం నుంచి అనుమతి పొందినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే ఈ డబ్బును బాధితులకు చెల్లించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
మోసగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి
ఉద్యోగాలు, పెట్టుబడుల పేరుతో సోషల్ మీడియా/జాబ్ పోర్టల్స్ ద్వారా వచ్చే ఆఫర్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ దరఖాస్తులు, ఇంటర్వ్యూలు/అపాయింట్మెంట్ల కోసం ఏ కంపెనీ కూడా డబ్బులు వసూలు చేయదు. ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు చెల్లించవద్దు. వ్యక్తిగత వివరాలు/చెల్లింపులు చేసే ముందు అధికారిక వెబ్సైట్లు/సంబంధిత హెచ్ఆర్ విభాగాల ద్వారా ధ్రువీకరణ చేసుకోవాలి. పొరపాటున సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930నంబర్‌కు/www.cyber crime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలి.
– డీసీపీ, సాయి మనోహర్