బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని గాలి కాలుష్యం పెంచుతున్నది. ఏటా లక్షల మంది ప్రాణాలను తీస్తున్నదని 2024 బయోమెడ్ సెంట్రల్ (బీఎంసీ) పబ్లిక్ హెల్త్ అధ్యయనం వెల్లడించింది. వాయు కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఇరవై లక్షల మంది స్ట్రోక్ బారిన పడుతున్నట్లు ఈ సర్వే తేల్చింది. భారతదేశంతో సహా తక్కువ, మధ్య ఆదాయ దేశాలలో సంభవించే నాలుగు బ్రెయిన్ స్ట్రోక్ మరణాలలో.. ఒకటి గాలి కాలుష్యం వల్లేనని కనుగొన్నది. ముఖ్యంగా.. నగరాలు, పట్టణ ప్రాంత యువకులు ఎక్కువగా దీని బారిన పడుతున్నట్లు వెల్లడైంది. పీఎం 2.5 వంటి సూక్ష్మ కణాలు.. ఊపిరితిత్తుల రక్షణ వ్యవస్థను దాటుకొని రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తున్నాయట. రక్త నాళాల్లో అడ్డంకులు సృష్టించి.. బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణం అవుతున్నాయని అధ్యయనకారులు చెబుతున్నారు.
మన దేశంలో మూడు దశాబ్దాలుగా బ్రెయిన్ స్ట్రోక్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గాలి కాలుష్యం వల్ల స్ట్రోక్ బారిన పడుతున్నవారిలో యువతే ఎక్కువగా ఉంటున్నదట. దాదాపు 20-30 శాతం స్ట్రోక్‌లు 50 ఏళ్లలోపు వారిలోనే సంభవిస్తున్నాయట. వీరిలో ప్రాణాలతో బయటపడిన వారిలో 50 శాతం మంది శాశ్వత వైకల్యాలతో మిగిలిపోతున్నారట.
ఈ పరిస్థితిని తప్పించుకోవాలంటే.. ఆకస్మికంగా బలహీనమవ్వడం, మాటలు తడబడటం, ముఖం వాలిపోవడం, శరీరం సమతుల్యత కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. ఇక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవడంతోపాటు ధూమపానం మానేయడం, చురుకైన జీవనశైలి, గాలి కాలుష్యానికి దూరంగా ఉండటం, ఎయిర్ ప్యూరిఫైయర్లను ఉపయోగించడం వల్ల స్ట్రోక్ ప్రమాదం నుంచి బయట పడొచ్చని చెబుతున్నారు.