Acidity Home Remedies | జీర్ణ సమస్యలు అనేవి మనకు సహజంగానే తరచూ వస్తుంటాయి. వీటిల్లో ప్రధానమైంది అసిడిటీ సమస్య. ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. కారం, మసాలాలు ఉండే ఆహారాలను ఎక్కువగా తింటుంటాం కనుక అసిడిటీ వస్తుంటుంది. అలాగే వేళకు భోజనం చేయకపోయినా, అసలు ఆహారం తినకపోయినా, అతిగా ఆహారం తీసుకున్నా, కాఫీ, టీలను, కూల్ డ్రింక్స్‌ను అతిగా తాగినా, మద్యం సేవించినా, పొగ తాగినా.. అసిడిటీ సమస్య ఇబ్బందులకు గురి చేస్తుంది. అయితే అసిడిటీ వస్తే చాలా మంది మెడికల్ షాపుకు వెళ్లి మందులను కొనుగోలు చేసి వాడుతుంటారు. కానీ అసిడిటీ సమస్యకు మందులను వాడడం దీర్ఘకాలంలో చేటు చేస్తుంది. కనుక సహజసిద్ధమైన చిట్కాలతో దీన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అందుకు గాను మన వంట ఇంట్లో ఉండే పలు పదార్థాలే ఎంతో దోహదం చేస్తాయి.
అల్లం మన వంట ఇంట్లో కచ్చితంగా ఉంటుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది. అసిడిటీ సమస్య ఉన్నవారు భోజనానికి ముందు ఒక టీస్పూన్ మోతాదులో అల్లం రసం సేవిస్తుండాలి. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. అసిడిటీ, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. అల్లం రసం సేవించకపోయినా నేరుగా చిన్న అల్లం ముక్కను అయినా తినవచ్చు. దీంతో అసిడిటీ తగ్గిపోతుంది. అలాగే కలబంద గుజ్జు కూడా కడుపులో మంట నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. కలబంద జీర్ణాశయం గోడలను ప్రశాంత పరుస్తుంది. దీంతో పొట్టల్లో ఉత్పత్తి అయ్యే ఆమ్లాల శాతం తగ్గుతుంది. ఫలితంగా అసిడిటీ నుంచి బయట పడవచ్చు. భోజనానికి 30 నిమిషాల ముందు కలబంద రసం తాగితే ఫలితం ఉంటుంది.
కమోమిల్ టీని తాగుతున్నా కూడా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థపై చల్లని ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక రాత్రి నిద్రకు ముందు ఈ టీని సేవించాలి. ఇది జీర్ణ వ్యవస్థను చల్లగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో కడుపులో మంట నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ టీని సేవించడం వల్ల నిద్ర కూడా చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. మైండ్ రిలాక్స్ అవుతుంది. కడుపులో మంట నుంచి ఉపశమనాన్ని అందించేందుకు బేకింగ్ సోడా కూడా పనిచేస్తుంది. ఇది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. కనుక పొట్టలోని ఆమ్లత్వాన్ని తగ్గిస్తుంది. అసిడిటీ ఉన్నవారు ఒక గ్లాస్ నీటిలో అర టీస్పూన్ బేకింగ్ సోడాను కలిపి తాగుతుంటే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
యాపిల్ సైడర్ వెనిగర్ కూడా కడుపులో మంటను తగ్గిస్తుంది. ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో పావు టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలిపి తాగుతుంటే అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఇది కొందరిలో మాత్రం వ్యతిరేకంగా పనిచేస్తుంది. అంటే దీన్ని తాగితే కడుపులో మంట ఇంకా పెరిగే చాన్స్ ఉంటుంది. కనుక ఇలాంటి సమస్య ఉన్నవారు యాపిల్ సైడర్ వెనిగర్‌ను తాగకూడదు. అవసరం అయితే డాక్టర్‌ను కలిసి సలహా తీసుకోవడం మంచిది. అలాగే అసిడిటీ నుంచి ఉపశమనాన్ని అందించడంలో సోంపు గింజలు కూడా ఎంతో పనిచేస్తాయి. సోంపు గింజలను భోజనం చేసిన అనంతరం నమిలి తినవచ్చు. లేదా సోంపు గింజలను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగవచ్చు. ఈ విధంగా పలు చిట్కాలను పాటిస్తే కడుపులో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.