Avocado Fruit | నీళ్లాడిన మహిళ.. అదేనండి గర్భిణి మహిళ. పెళ్లాయ్యాక ఓ మహిళ గర్భం దాల్చితే.. ఆమెను నీళ్లాడిన మహిళగా గ్రామాల్లో పిలుస్తుంటారు. అయితే ఈ నీళ్లాడిన మహిళ ప్రతి రోజు సమపాళ్లల్లో ఆహారం తీసుకోవడం ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవించే వరకు.. ఆమె శరీరానికి తగిన పోషకాహారం అందించాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పోషకాహారంలో అవకాడోను భాగం చేసుకోవాలని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మరి అవకాడో వల్ల ఏయే లాభాలు కలుగుతాయో ఈ కథనం తెలుసుకుందాం.
అవకాడోనో తెలుగులో ‘వెన్నపండు’ అని పిలుస్తారు. కానీ అందరూ ఆంగ్ల పదమైన అవకాడోనే ఉపయోగిస్తుంటారు. ఈ అవకాడోను గర్భిణులకు ఔషద ఫలంగా సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ పండులో ఎన్నో రకాల పోషకాలు సమృద్ధిగా లభిస్తాయని, తద్వారా గర్భిణి ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెబుతున్నారు.
గర్భధారణ సమయంలో అవకాడో తినడంతో.. పిండం అభివృద్ధి మెరుగ్గా ఉంటుందట. సుఖ ప్రసవానికి ఆస్కారం ఉంటుందట. అవకాడోలో ఫోలిక్ ఆమ్లం పుష్కలంగా లభిస్తుండడంతో.. గర్భస్థ శిశువు మెదడు, నాడీ వ్యవస్థలో లోపాలు తలెత్తకుండా ఉంటాయట. ప్రసవించిన వెంటనే పాలు సమృద్ధిగా లభించడంతో.. చంటి బిడ్డకు పుష్కలంగా పాలు పట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తల్లి పాల నాణ్యత కూడా పెరుగుతందని చెబుతున్నారు. అవకాడో తిన్న తల్లులకి పుట్టిన పిల్లల్లో ఫుడ్ అలర్జీలు తక్కువగా ఉన్నట్లు పలు పరిశోధనల్లో కూడా తేలినట్లు ఆరోగ్య నిపుణులు స్పష్టం చేశారు.
లేత ఆకుపచ్చ రంగులో ఉండే అవకాడో గుజ్జులో మోనోశాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్, ఎ, బి2, బి3, బి5, బి6, సి, బి, కె విటమిన్లతో పాటు పొటాషియం, ఫోలిక్ ఆమ్లం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ హార్మోన్ల సమతౌల్యానికి పీసీఓడీ, మెనోపాజ్ సమస్యల నివారణకీ, సంతానోత్పత్తికీ, గర్భిణుల ఆరోగ్యానికి దోహదపడుతాయని హెల్త్ ఎక్స్పర్ట్ పేర్కొంటున్నారు. సో గర్భిణి స్త్రీలు రోజుకు ఒక అవకాడో తింటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.