న్యూఢిల్లీ : ఐర్లాండ్‌కు చెందిన 93 ఏండ్ల రిచర్డ్ మోర్గాన్ అసాధారణ ఫిట్నెస్తో పరిశోధకులను సైతం అబ్బురపరుస్తున్నాడు. నాలుగు సార్లు ఇండోర్ రోయింగ్ ఛాంపియన్‌గా నిలిచిన మోర్గాన్ గుండె, శరీర సౌష్టవం 40 ఏండ్ల వ్యక్తిలా ఉందని వైద్యులు చెబుతున్నారు. మోర్గాన్ తన 70ల్లో ఫిట్నెస్ ట్రైనింగ్ చేపట్టినా తిరుగులేని ఫిట్నెస్ సొంతం చేసుకున్నారు. 165 పౌండ్ల బరువుతో 80 శాతం మజిల్ మాస్‌తో ఆరోగ్యకరంగా వయసు మీరడంపై నిర్వహించిన అధ్యయనంలో మోర్గాన్ పాలుపంచుకున్నారు. మోర్గాన్ గుండె, కండరాలు, ఊపిరితిత్తులు 40 ఏండ్ల వయసు వ్యక్తి తరహాలో పనిచేస్తున్నాయని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది.
యూనివర్సిటీ ఆఫ్ లైమెరిక్ పరిశోధకుల దృష్టినీ మోర్గాన్ ఆకర్షించారు. 2000 మీటర్ల రోయింగ్ ఛాలెంజ్‌లో పాల్గొన్న మోర్గాన్ హార్ట్ రేట్ ఆయన వయసులో అసాధారణ ఫీట్ నమోదు చేస్తూ నిమిషానికి 153 సార్లు కొట్టుకుందని జర్నల్ ఆఫ్ అప్లైడ్ ఫిజియాలజీలో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. ఫిట్నెస్ ట్రైనింగ్‌లో మోర్గాన్ వినూత్న వైఖరితో ముందుకెళతారని అధ్యయన రచయిత ఫిలిప్ జేక్మన్ చెప్పుకొచ్చారు. మోర్గాన్ ప్రతిరోజూ 40 నిమిషాల పాటు రోయింగ్ మెషీన్‌పై గడుపుతారు. ఈ సమయంలో 70 శాతం సమయం అలసట లేని రీతిలో స్లో పేస్‌లో ఆపై 20 మీడియం వేగంతో చివరి 10 శాతం సమయంలో హై ఇంటెన్స్‌తో రోయింగ్ మెషీన్‌పై వర్కవుట్ చేస్తారు.
ఈ వ్యాయామం నిలకడగా కొనసాగిస్తారు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌లో భాగంగా వారానికి మూడు సార్లు డంబెల్స్‌తో మూడు సెట్ల స్క్వాట్స్, ఆర్మ్ కర్ల్స్ను తన కండరాలు అలిసిపోయే వరకూ కొనసాగిస్తారు. ఇక ఆహారంలో హై ప్రొటీన్ డైట్ అధికంగా ఉండేలా చూసుకుంటారు. మోర్గాన్ తన మనవళ్లలో ఒకరితో రోయింగ్ ప్రాక్టీస్ సెషన్‌కు హాజరైన క్రమంలో 73 ఏండ్ల వయసులో ఫిట్నెస్ కోసం వర్కవుట్లను ప్రారంభించారని ఆయన మనవడు, ఐర్లండ్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో ఎక్సర్సైజ్ సైన్స్ లెక్చరర్ లార్కన్ డాలీ చెప్పారు. ఇక అప్పటినుంచి మోర్గాన్ వెనుతిరిగి చూడలేదని ఏ వయసులోనైనా ఫిట్‌నెస్‌పై దృష్టిసారించవచ్చని అందుకు తన తాతే సరైన ఉదాహరణ అని చెప్పారు.
Read More :
Florida Man | మెదడుకు సర్జరీ చేస్తుంటే గిటార్ వాయించాడు..!