నాటి అమ్మలు చందమామను చూపించి బుజ్జాయికి అన్నం తినిపించేవాళ్లు. లేదంటే, కథలు చెప్పో.. ‘బూచి వస్తుందని’ భయపెట్టో.. నోట్లో ముద్ద పెట్టేవాళ్లు. కానీ, నేటితరం తల్లులు మాత్రం.. స్మార్ట్‌ఫోన్‌ను చేతికిచ్చి, తాపీగా తినిపిస్తున్నారు. క్రమంగా పిల్లలు కూడా దానికే అలవాటుపడుతున్నారు. ఫోన్, టీవీ చూడనిదే.. ముద్దు ముట్టమని మారాం చేస్తున్నారు. అయితే, ఇలాంటి అలవాటు వల్ల దుష్ప్రభావాలు ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక అధ్యయనం ప్రకారం.. రెండేళ్లలోపు చిన్నారుల్లో 90 శాతం మంది మొబైల్ ఫోన్లను చూస్తూ ఆహారం తింటున్నారని తేలింది.
ఫోన్ చూస్తూ ఆహారం తీసుకునేవాళ్లు.. ఎంత తింటున్నామన్నది గుర్తించలేరు. అయితే.. తక్కువైనా తింటారు. లేకుంటే, ఎక్కువైనా లాగించేస్తారు. తక్కువైతే పౌష్టికాహార లోపంతో బాధపడుతారు. ఎక్కువగా తింటే.. ఊబకాయం బారినపడతారు. నిర్ణీత మోతాదు కన్నా ఎక్కువ తిన్నా.. తక్కువ తిన్నా.. అజీర్ణం, గ్యాస్ సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఇది వారి జీర్ణవ్యవస్థకూ చేటు కలిగిస్తుంది. ఇలాంటి పిల్లల ధ్యాసంతా ఫోన్‌పైనే ఉంటుంది. అసలు ఏం తింటున్నారనేది కూడా పట్టించుకోరు.
ఆహారం రుచిగా ఉన్నదా లేదా? అనేది కూడా వారికి అర్థం కాదు. కొన్నిరోజులు ఇలాగే కొనసాగితే.. ఆహారం రుచిని కూడా గుర్తించలేరు. పిల్లల నోట్లో ముద్ద పెట్టినా.. దాన్ని నమలకుండానే మింగేస్తారు. ఇలాంటి అలవాటు దీర్ఘకాలంలో జీర్ణక్రియను బలహీనపరుస్తుంది. వివిధ రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.