ఎండలు మండిపోతున్నాయి. భారీ మండుటెండలకు శరీరం డీహైడ్రేట్‌కు గురవుతూనే ఉంటుంది. ఇటువంటి సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలనేదే ప్రధానం. ఘన పదార్థాలు కాకుండా ద్రవ పదార్థాలను తీసుకోవడం వల్ల డీహైడ్రేట్ నుంచి ఉపశమనం పొందొచ్చు. రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందించుకోవచ్చు.
సమ్మర్లో ప్రత్యేకంగా మసాలా ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఫ్రై వంటకాలను తీసుకోవడం మంచిది కాదు. ఈ ఆహారం తీసుకోవడం వల్ల వాంతులు, విరేచనాలు సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ఎండాకాలం పరిశుభ్రమైన, కలుషితం లేని ఆహారాన్ని తీసుకోవాలి. సమ్మర్లో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ప్రధానంగా ఈ నాలుగింటిని అధికంగా తీసుకుంటే మంచిది.
వాటర్ మెలన్ తీసుకోవడం వల్ల డీహైడ్రేట్ బారి నుంచి ఉపశమనం పొందొచ్చు. ఈ పండులో విటమిన్ ఏ, సీ, యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. హృదయంలో పుట్టే మంటలను వాటర్ మెలన్ నివారిస్తోంది.
సమ్మర్లో మొక్క జొన్న కూడా మంచి ఆహారం. ఇందులో పొటాషియం, ఫైబర్, యాంటి ఆక్సిడెంట్స్ విరివిగా ఉంటాయి. కంటి సమస్యలను కార్న్ దూరం చేస్తోంది. రక్త ప్రసరణను క్రమబద్దీకరిస్తోంది. సమ్మర్లో అజీర్ణ సమస్యలతో బాధపడేవారు మొక్క జొన్నను తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. ఎందుకంటే కార్న్‌లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.
వేడి వాతావరణంలో ఉన్నప్పుడు దోసకాయ మంచి ఆహారం. సలాడ్‌గా దీన్ని తీసుకోవచ్చు. పెరుగుతో కలిపి రైతాగా చేసి భుజించొచ్చు. మలబద్ధకంతో బాధపడే వారు కీర దోసకాయను తినడం వల్ల ఆ సమస్య నుంచి విముక్తి పొందొచ్చు.
భారతీయుల మెనూ పెరుగు అనే పదం లేకుండా ఉండనే ఉండదు. భోజనానికి తోడుగా పెరుగు ఉండాల్సిందే. పెరుగులో క్యాల్షియం ఉంటుంది. ఇది ఎముకల పెరుగుదలకు బాగా సహకరిస్తుంది. దాహాంతో ఉన్న వారు పెరుగును కొంచెం పలుచగా చేసుకొని తాగడం వల్ల దాహార్తి నుంచి ఉపశమనం పొందొచ్చు. కడుపులో మంటను కూడా పెరుగు నివారిస్తోంది.