Health | హైదరాబాద్, ఫిబ్రవరి 15(నమస్తే తెలంగాణ) : దేశంలోని వయోధికులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ, శరీరానికి సరిపడా పోషకాలు అందడం లేదని జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. దేశంలోని వయోధికుల్లో ముఖ్యంగా 60-70 ఏండ్ల మధ్యనున్న వారు 31 శాతం మేర పోషకాహార లోపంతో బాధ పడుతున్నారు. ఏటా వృద్ధులు పెరుగుతున్నట్టుగానే ఈ సమస్య కూడా పెరుగుతున్నదని, దీంతో రోగనిరోధకత దెబ్బతిని దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని ఎన్ఐఎన్ చేసిన పరిశోధనలో తేలింది. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రిసెర్చీలో ఈ పరిశోధన ఫలితాలను ప్రచురించారు.
డబ్ల్యూహెచ్వో ప్రకారం 60-65 ఏండ్ల వయసు వారిని వయోధికులుగా గుర్తిస్తున్నారు. వీరిలో పోషకాహారలోపం విపరీతంగా పెరిగినట్టు తేలింది. దేశవ్యాప్తంగా 1500 మంది వయోధికులపై ఆరోగ్య లక్షణాలు, ఆహారపు అలవాట్లను పరిశీలించగా, ఇందులో 31 శాతం మేర పోషకాలు అందనివారే ఉన్నట్టుగా తేలింది. దీంతో శారీరకంగా, మానసికంగా ఆరోగ్యం క్షీణించి గుండె, కంటి సమస్యలు, అల్జీమర్స్, ఓబేసిటీ, డిప్రెషన్, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారని వెల్లడైంది. ముఖ్యంగా ఆహారంలో విటమిన్ డీ, సీ, జింక్, బీ6, బీ12, క్యాల్షియం, ఫోలేట్, సెలీనియం వంటి సూక్ష్మ పోషకాల ప్రభావమే ఆరోగ్యంపై ఎక్కువగా ఉంటున్నదని గుర్తించారు.
దేశంలో 60పై బడిన వారు 1,700 కిలో క్యాలరీ ల శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. కానీ తక్కువ క్యాలరీలు అందుతున్నాయి. ప్రోటీన్లు, విటమి న్లు ప్రామాణికం కంటే 25-35%తక్కువగా చేరుతున్నాయని తేలింది.