మీరు ఆఫీసుకు ఓ రోజు ఓ పావుగంట ముందే చేరుకున్నారు. మీరు పనిచేసే స్థలం పై అంతస్తులో ఉంటే… అలా లిఫ్ట్ దగ్గరికి వెళ్లిపోతారు. కానీ మెట్లెకి వెళ్లాలనే ఆలోచనే చేయరు. కానీ, మెట్లెక్కడం అనే ఎంపిక మన ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. ఇలా చేయడం వల్ల శరీరానికి కొంత వ్యాయామం జరుగుతుంది. ఇంటి దగ్గర ఉండేవాళ్లయినా సరే రోజూ మెట్లెక్కడం ఆరోగ్యానికి మంచిది.
మెట్లు ఎక్కుతున్నప్పుడు గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. శ్వాసక్రియలో మరింత ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలుచేస్తుంది. గుండె కండరాలను పటిష్ఠం చేస్తుంది.
మెట్లు ఎక్కడం వల్ల కాలి కండరాలు గట్టిపడతాయి. ఇది మన నడకను, పరిగెత్తే వేగాన్ని మెరుగుపరుస్తుంది. కాళ్లకు తీరైన రూపాన్ని తీసుకువస్తుంది. సైక్లింగ్ లేదా ఈతకు అదనంగా మెట్లెక్కితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
రోజూ మెట్లు ఎక్కడంతో కీళ్లు కూడా బలోపేతం అవుతాయి. మెట్లెక్కితే కీళ్లు, వాటి చుట్టూ ఉన్న కండరాల్లో ఫ్లూయిడిటీ, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఇది ఎముకలు దృఢమవడానికి కూడా సహకరిస్తుంది.
ప్రతిరోజూ… స్థిరంగా మెట్లెక్కుతూ ఉంటే గనుక మన శరీర బరువు కూడా తగ్గుతుంది. జిమ్‌కు వెళ్లని వాళ్లు బరువు తగ్గడానికి రోజులో కొన్నిసార్లు మెట్లెక్కడం మంచి పరిష్కారంగా నిలుస్తుంది. కాబట్టి… చేతనైనవాళ్లు మెట్లెక్కేయండి మరి!