ఫాస్ట్ ఫుడ్ తింటూ డబ్బులు వృధా చేయడంతో పాటు ఆరోగ్యం పాడుచేసుకుంటున్నాడని భర్తకు లంచ్ ప్యాక్ ఇస్తే అతగాడు వాటిని అమ్ముతున్నాడని తెలియడంతో భార్య విస్తుపోయింది. భర్త ప్రేమగా తన కోసం ఇచ్చిన లంచ్ ప్యాక్‌లను అమ్మి అతడు దర్జాగా ఫాస్ట్ ఫుడ్ లాగిస్తున్న విషయం వెల్లడైంది. తాము ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు పొదుపులో భాగంగా ఖర్చులకు కత్తెర వేయాలని నిర్ణయించుకున్నామని, భర్త ఫాస్ట్‌ఫుడ్‌పై నెలకు రూ 20,484 ఖర్చవుతుందని తేలిందని మహిళ చెప్పుకొచ్చారు. ఈ ఖర్చును ఆదా చేయడంతో పాటు ఆరోగ్యం మెరుగుపడుతుందని తాను భర్తకు రోజూ లంచ్ ప్యాక్ ఇస్తున్నానని తీరా ఆయన ఫాస్ట్‌ఫుడ్ తినేందుకు వాటిని విక్రయిస్తున్నాడని తెలిసిందని ఆమె వాపోయింది. ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు ఖర్చులు తగ్గించేందుకు ఆమె శాండ్విచ్లు చేసి ఇచ్చేందుకు సిద్ధపడగా ఆమె భర్త అంగీకరించాడు.
ఆమె చేసే శాండ్విచ్లు చాలడం లేదని మరికొన్ని కావాలని అడిగి లంచ్ ప్యాక్‌లు రెడీ చేయిస్తూ వాటిని అతడు ఆఫీస్‌లో కొలీగ్స్‌కు అమ్మి తాను ఫాస్ట్‌ఫుడ్ లాగించేవాడు. ఓసారి వారి ఇంటికి కొలీగ్స్ డిన్నర్‌కు రాగా మీరు చేసే శాండ్విచ్లు బాగున్నాయని కానీ ధరే అధికమని ఓ కొలీగ్ ఆమెతో అనడంతో మహిళ అవాక్కైంది, వారు వెళ్లిన తర్వాత భర్తను నిలదీయడంతో లంచ్ ప్యాక్‌లు అమ్మేసి ఆ డబ్బుతో ఫాస్ట్‌ఫుడ్ తింటున్నానని అసలు విషయం చెప్పేశాడు. తాను దుబారా ఏమీ చేయడం లేదని లంచ్ ప్యాక్‌లు అమ్మగా వచ్చిన డబ్బుతోనే ఫాస్ట్‌ఫుడ్‌కు ఆర్డర్ ఇస్తున్నానని సమర్ధించుకున్నాడు. ఇక ఈ ఘటనపై నెటిజన్లు తలో రకంగా స్పందించారు. భార్య ప్రేమతో లంచ్ ప్యాక్స్ ఇస్తే వాటిని అమ్మడం ఏంటని కొందరు ప్రశ్నించగా మరికొందరు మీరు అసలు శాండ్విచ్లు ఎలా తయారు చేస్తారు అంత ధర ఎలా పలుకుతున్నాయని మరికొందరు మహిళను ఉద్దేశించి కామెంట్ చేశారు.