ఆదివారం 07 మార్చి 2021
Gadwal - Aug 14, 2020 , 04:06:44

పంద్రాగస్టుకు పూర్తయ్యేనా?

పంద్రాగస్టుకు పూర్తయ్యేనా?

  • l  మున్సిపాలిటీ పరిధిలో 
  •    సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం
  • l  ఆరు చోట్ల స్థలాల గుర్తింపు
  • l   రెండు చోట్ల కొనసాగుతున్న నిర్మాణాలు

గద్వాలటౌన్‌: పట్టణాల్లో సామూహిక మరుగుదొడ్ల అవసరం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ గద్వాల మున్సిపాలిటీ జిల్లా కేంద్రం కావడంతో నిత్యం వివిధ పనుల నిమిత్తం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో వారందరూ ఒంటికి రెంటికి ఎక్కడి వెళ్లాలన్నా ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పట్టణ ప్రగతి కార్యక్రమంలో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి వెయ్యిమంది జనాభాకు ఒక సామూహిక మరుగుదొడ్డి నిర్మించాలని మున్సిపాలిటీలకు సీడీఎంఏ ఆదేశాలు జారీ చేసింది. స్థానిక స్వచ్ఛంద సంస్థల సహకారంతో డీవోటీ విధానంతో పంద్రాగస్టులోపు నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే నిర్మాణాలు జరుగుతున్న తంతును చూస్తే పంద్రాగస్టుకు పూర్తయ్యేనా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. 

ముందుకు రాని స్వచ్ఛంద సంస్థలు

గద్వాల మున్సిపాలిటీ పరిధిలో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలకు ఆరు ప్రత్యేక స్థలాలను గుర్తించారు. మొదటి విడుతలో పాతబస్టాండ్‌, కృష్ణవేణి చౌరస్తా, తాసిల్దార్‌ కార్యాలయం, జిల్లా దవాఖాన, కలెక్టరేట్‌ వద్ద నిర్మించాలని నిర్ణయించారు. అయితే జిల్లా దవాఖాన వద్ద, కలెక్టరేట్‌ ప్రాంగణంలో మాత్రమే నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మరో మూడు చోట్ల నిర్మాణాలు చేపట్టేందుకు ఏ స్వచ్ఛంద సంస్థ కూడా ముందుకు రావడం లేదు. దీంతో ఇతర ప్రాంతాల్లో నిర్మాణాలు ప్రశ్నార్థకంగా మారాయి. 

స్థలాల కేటాయింపునకు అడ్డంకులు

సామూహిక మరుగుదొడ్లు నిర్మించేందుకు అనేక ప్రాం తాల్లో ప్రభుత్వ స్థలాలు ఉన్నా అధికారులు దృష్టి సారించడంలేదు. కృష్ణవేణి చౌరస్తాలో డ్రైనేజీపై నిర్మాణం చేపట్టేందుకు అధికారులు నిర్ణయించగా అక్కడ సరైన స్థలం లేకపోవడంతో అందుకు స్వచ్ఛంద సంస్థ ఒప్పుకోలేదు. అలాగే పాతబస్టాండ్‌లో ఐడీఎస్‌ఎంటీ దుకాణాల పక్కన నిర్మాణం చేపట్టేందుకు స్థలం ఎంపిక చేశారు. అయితే ఎంపిక చేసిన స్థలం గుండా కోటలోని ఆలయ ద్వారం ఏర్పాటు చేయనున్నారని కొందరు నాయకులు అడ్డుచెప్పడంతో అధికారులు విరమించుకున్నారు. ఆ పక్కనే ఖాళీ స్థలాలు ఉన్నా అధికారులు దృష్టి సారించడం లేదు. 

పట్టించుకోని పాలకవర్గం

మరుగుదొడ్ల నిర్మాణాలపై పాలకవర్గం దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. స్థలాలను గుర్తించడంలో అధికారులకు ఏ మాత్రం సహకరించడం లేదన్న విమర్శలు అధికారుల వైపు నుంచి వినిపిస్తున్నాయి. అధికారులు, పాలకపక్షం మధ్య సమన్వయ లోపం కారణంగా రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం చేరుకోవడం కష్టతరమే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

లక్ష్యాన్ని పూర్తి చేస్తాం

రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని కచ్చితంగా పూర్తి చేస్తాం. ప్రస్తుతానికి రెండు ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తికావచ్చాయి. మిగతా నిర్మాణాలు చేపట్టేందుకు స్థలాలు గుర్తింపు ఇబ్బందిగా మారింది. అలాగే స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం లేదు. దీంతో నిర్మాణాలు పూర్తి చేయడంలో ఆలస్యం అవుతున్నది.

- నర్సింహ, మున్సిపల్‌ కమిషనర్‌, గద్వాల

VIDEOS

logo