నిరుడు యాసంగి వరకు నిండుకుండల్లెక్క కనబడ్డ జలాశయాలు, వాగులు, చెరువులు నేడు ఎండిపోయి ఎండమావులయ్యాయి. నాడు ఎర్రటి ఎండల్లో చెరువులు మత్తళ్లు దుంకినయి. వరి పొలాల్లో చివరి మడి నిండిపోయి ఒడ్ల మీది నుంచి నీళ్లు ఒలికిపోయిన దృశ్యాలు కనిపించాయి. కానీ, నేడు పంట పొట్టకొచ్చిన దశలో నెర్రెలు వారిన నేల నోరు తెరిచి హృదయవిదారకంగా కనిపిస్తున్నది.
కాలం లేక కరువొచ్చిందంటే కర్షకులు కన్నీళ్లు దిగమింగుకునేటోళ్లు. కానీ కాలం కరుణించింది. పుష్కలంగా వానలు పడితే రైతులు సంబురపడ్డరు. పులకించిపోయి పంటలు వేసుకున్నరు. పుట్లకొద్దీ దిగుబడి వస్తదని ఆశపడ్డరు. కానీ, కాంగ్రెస్ సర్కార్ రూపంలో కష్టం పొంచి ఉన్నదని గుర్తించలేదు. పుట్టెడు కాలమున్నా పట్టెడన్నం పెట్టే రైతన్నకు కష్టం తప్పడం లేదు. కండ్లు తెరిచి చూసేవరకు కరువు కరాళనృత్యం చేస్తున్నది.
జోరువానలు పడ్డా.. బోరుమంటున్న రైతన్న: గత వానకాలం వానలు బాగా పడ్డా పదేండ్లుగా ఎన్నడూ లేని కరువు ఎట్ల వచ్చింది? జలాశయాలు ఎట్ల ఎండిపోయినయి? చేప పిల్లలు చెంగు చెంగున ఎగిరిదుంకిన చెరువులు ఎండమావులు ఎట్లయినయి? భూగర్భజలాలు ఎందుకు అడుగంటిపోయిన యి? ‘ఎండకు పంటలు ఎండిపోతే నాదా తప్పు? నన్నెందుకు తిడుతున్నారు?’ అంటున్నరు సీఎం రేవంత్. ఎండకాలం ఎండలే కొడుతయి. నీళ్లు లేకపోతే ఎండకు పంటలు ఎండుతయి. అందులో, సీఎం తప్పేమీ ఉండదు. కానీ, నీళ్లెందుకు లేవన్నది కదా అసలు ప్రశ్న.
‘చేపా చేపా ఎందుకు ఎండలేదంటే? గడ్డి మోపు అడ్డమొచ్చింది’ అన్నట్టు. పంటా పంటా ఎందుకు ఎండిపోయినవంటే ‘రేవంత్ నీళ్లు ఇవ్వలేదంటున్నయి’ నెర్రెలు వారిన నేలలు. వానలు పడ్డా నీళ్లివ్వకపోవడం రేవంత్ చేసిన తప్పు కాదా ? రైతుల అవసరాలు ముందే తెలుసుకోకపోవడం తప్పు కాదా? ఇందుకోసం ప్రణాళికలు వేయకపోవడం తప్పు కాదా? నీటిని ఒడిసి పట్టకుండా ఇప్పుడు నాదేం తప్పంటూ వైనాలు పోవడమెందుకు? ఏడ్చే రైతును ఎగతాళి చేసేటందుకా?
గుంపుమేస్త్రి పని గిట్లనే ఉంటదా?: ఎన్నికలకు ముందు అప్పటి పీసీసీ అధ్యక్షునిగా సీఎం రేవంత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటను ప్రజ లు నేటికీ గుర్తుచేస్తున్నారు.‘మీరు సీఎం అయితా అంటున్నరు. మీకు పాలనలో అనుభవం లేదు కదా! ఎట్ల పాలన చేస్తరు?’ అని విలేకరి అడిగారు. అందుకు రేవంత్ స్పందిస్తూ… ‘సీఎం పదవి అనేది ఓ గుంపుమేస్త్రి పాత్ర వం టిది. ఎవరి పని వాళ్లు చేస్తర’న్నారు. ఇలా మాట్లాడటం గుంపుమేస్త్రి పనిని కూడా హేళన చేసినట్టే!
అనుభవం లేదు, ఆలోచన అసలే లేదు: సీఎం పదవి అంటే కుర్చీలో కూర్చొని ఎవరెలా చేస్తున్నారో చూడటం కాదు. ఎవరెవరు, ఏయే పనులు చేయాలో నిర్ణయించడం. నేడు, మరుసటి రోజు, వారం, నెల, ఏడాది, ఆ తర్వాత.. ప్రజల స్థితిగతులు, అవసరాలు, సమస్యలు, పరిష్కారాలపై నిరంతరం అధ్యయనం చేయ డం.
ఉదాహరణకు కేసీఆర్ హయాంలో ప్రాజెక్టులు, విద్యుత్తు, పంటల స్థితిగతులపై సమీక్షలు నిర్వహించేవారు. ఎక్కడ ఎంత వాన పడింది? ఏ ప్రాజెక్టులో నీటిమట్టాలు ఎంతున్నయి? ఏయే ఆయకట్టులో ఏయే పంటలు వేశారు? ఇంకా ఎన్ని తడుల నీళ్లు ఇవ్వాల్సి ఉన్నది? పంట చేతికి అందివచ్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అంటూ సమీక్షలు నిర్వహించిన తీరును చూశాం. దీన్నే నీటి నిర్వహణ పద్ధతి అంటారు. కానీ దీంట్లో రేవంత్ రెడ్డికి అనుభవం లేదు. ఈ దిశగా ఆలోచన అసలే లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చీ రాగానే, సీఎం రేవంత్ కుట్రలకు తెరతీశారు. కేసీఆర్ హయాంలో కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయడానికి.. అందులో నీళ్లు ఒడిసిపట్టలేదు.
ఆ ఫలితం పల్లె పల్లెనా కనిపిస్తున్నది. తనను పట్టపగలు పట్టుకొని, తన దొంగతనాన్ని బయటపెట్టిన కేసీఆర్ మీద రగిలిపోవడమే రేవంత్ రెడ్డి ఏకైక ఎజెండాగా పెట్టుకున్నారు. అసలు పని పక్కన పెట్టి, కొసరు పని వెంట పడ్డారు. ఆ ఫలితమే ఇప్పుడు కనబడుతున్నది. నాడు ఎండకాలం కూడా మత్తళ్లు దుంకిన చెరువులకు ఏమైందో అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. అర్థం చేసుకున్నరు. చెరువులకు వచ్చిన రోగమేందో, అది ఏ రూపంలో వచ్చిందో కూడా అర్థం చేసుకున్నరు. కారణం, కారకులను గుర్తించారు. కాళేశ్వరం సంగతి అలా ఉంటే.. నాగార్జునసాగర్ నుంచి నీళ్లన్నీ ఏపీ కిందికి తీసుకుపోయిన తర్వాత, సీఎం రేవంత్ మేల్కొన్నట్టు కనిపించేందుకు ప్రయత్నించారు. నీళ్లు ఎటూ పోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇంకెక్కడున్నయి నీళ్లు? పోవడానికి.. పోకుండా చూడటానికి!
కాంగ్రెస్ తెచ్చిన కరువు: నీటి నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యంతోనే చేతులారా తెచ్చుకున్న కరువు ఇదని ప్రజలు కన్నీటి పర్యంతమవుతున్నరు. సాగునీళ్లు రాక పంటలు ఎండితే, తాగునీళ్లు లేక జనం గొంతులు ఎండుతున్నాయి. చుక్కనీరు కోసం ప్రజలు అరిగోస పడుతున్నరు. చెలిమెల్లో నీళ్ల కోసం వెతుకులాడే దుస్థితి దాపురించింది. ప్రజల కన్నీటి కష్టాలపై పత్రికల్లో కథనాలు వస్తుంటే ప్రభుత్వం ఆలస్యంగా మేల్కొని, అవునా.. నిజమా? అంటూ ఆశ్చర్యానికి గురవుతున్నది.
తాగునీటి సమస్యలపై గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించిన తీరు ఆద్యంతం ఇలాగే సాగింది. గ్రామాల్లో తాగునీటి సమస్యలున్నట్టు వార్తా పత్రికల్లో వస్తున్న కథనాలు తప్పా? సమస్య లేదని మీరిస్తున్న నివేదికలు తప్పా? అంటూ ఆమె అధికారులను ప్రశ్నించారు. పత్రికల కథనాలపై స్పందిస్తూ ప్రజలకు నిజాలు తెలియజేయాలని ఆదేశించారు. తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రతీ జిల్లా కలెక్టర్ వద్ద రూ.2 కోట్ల నిధులను అందుబాటులో పెట్టామని, అధికారులకు తెలిపారు. ఏజెన్సీ గ్రామాల్లో బోర్లు వేసి తాగునీరు అందిస్తున్నట్టు తెలిపారు. మిషన్ భగీరథ కొత్త పనుల కోసం వేయి కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. ఇదంతా ఎండకాలం చేయాల్సిన పనులా? ముందే చేయాల్సిన పనులా? ఏలినవారికే తెలియాలి.
రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల్లోని నీటి నిల్వలు ఒడిసిపట్టకపోవడం, ఉన్న కొద్దిపాటి నీళ్లను కూడా వదలకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయి. శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులు తమ నియోజకవర్గాలకు నీళ్లివ్వాలంటూ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. పంటలు ఎండిపోతూ రైతులు గోసపడుతున్నారని తెలిపారు. ‘పంటలు ఎండిపోతే తనను అనవసరంగా తప్పు పడుతున్నార’ని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలూ రేవంత్ రెడ్డిని అనవసరంగా బద్నాం చేస్తున్నారా? రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను గుర్తించకుండా కేవలం ప్రచార ఆర్భాటలతో ప్రజల హృదయాలను గెలుచుకోవడం అసాధ్యం. ఇప్పటికైనా ఈ విషయం గుర్తించి సీఎం రేవంత్ రెడ్డి మేల్కోవాలి. లేకపోతే, రైతుల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. జనం గెలిపించిన పాపానికి ఇంకో మూడేండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండకతప్పదు.
-ఇనుగుర్తి సత్యనారాయణ ,97046 17343