తెలంగాణ విద్యాశాఖ కమిషన్ రూపొందించిన తెలంగాణ విద్యా విధానం- 2026 నివేదిక విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఎన్నో సందేహాలను మిగిల్చింది. కమిషన్ రిపోర్టు కన్ఫ్యూజన్గా ఉన్నది. త్రిభాషా అమలు ప్రతిపాదనలో మాతృభాష కంటే ఆంగ్ల భాషకే ప్రాధాన్యత నిచ్చే విధంగా కమిషన్ సూచనలు చేయడం, ప్రీప్రైమరీ విద్య నుంచి తప్పనిసరిగా ఆంగ్ల భాషలోనే బోధించాలని కమిషన్ ప్రతిపాదించడం విడ్డూరంగా ఉన్నది. మాతృభాష పరిరక్షణకు కమిషన్ ఎటువంటి ప్రతిపాదన చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా అందరిలో సందేహాలను మిగిల్చింది.
తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక విమర్శలకు గురవుతున్నది. స్కూల్ ఎడ్యుకేషన్ ప్రతిపాదనలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుతో మాత్రమే మెరుగైన ఫలితాలు సాధించగలమని, ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలలను రద్దు చేయడమే ప్రత్యామ్నాయమని ప్రతిపాదించింది. కానీ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పించి అభివృద్ధి చేయడం ప్రభుత్వ బాధ్యత అని కమిషన్ సూచించలేదు. కొత్తగా రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ఏర్పాటు చేయకూడదని, గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న మినీ గురుకులాలను రద్దు చేయాలని, అన్ని సొసైటీల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలను కూడా తీసేయాలని ప్రతిపాదించడం చాలా దారుణం.
ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ బోర్డులను కలపాలన్న ప్రతిపాదన అర్థరహితం. కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాసే విధంగా, గ్రామీణ ప్రాంత విద్యాసంస్థలు, విద్యార్థులకు ప్రతికూలం. 12వ తరగతికి మాత్రమే బోర్డు పరీక్ష నిర్వహించాలని, ఎప్సెట్ పరీక్షను రద్దుచేసి 12వ తరగతి మార్కుల ఆధారంగానే ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ సీట్లను కేటాయించాలని కమిషన్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనతో జాతీయస్థాయిలో నిర్వహించే నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షల్లో రాష్ట్రం నుంచి ఉత్తీర్ణత సాధించే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గే ప్రమాదం ఉన్నది.
12వ తరగతి వరకు ఉత్తీర్ణత మార్కులు 45 శాతం యూజీ/పీజీ ఉత్తీర్ణత మార్కులు 50 శాతానికి పెంచడంతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతారు. ఈ ప్రతిపాదన గ్రామీణ ప్రాంత విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పాలిటెక్నిక్ విద్యను ఇంజినీరింగ్ లేటరల్ ఎంట్రీలో బంద్ చేయడం, ఇంటర్మీడియట్తో సమానంగా విద్యార్హతను కల్పించాలని చెప్పడం వింతగా ఉన్నది.
15 వందల మంది విద్యార్థులతో కూడిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు అనుబంధంగా 200 మంది విద్యార్థులకు సంక్షేమ వసతి గృహాలు ఏర్పాటు చేయాలని కమిషన్ నివేదికలో సూచించింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో చదివే పేద విద్యార్థులు 200 మంది మాత్రమే ఉంటారా? డీఎడ్ను టీచర్ ఉద్యోగార్హతగా భావించవద్దని పేర్కొన్నది. ఈ విధంగా ఆచరణ యోగ్యం, అర్థంపర్థంలేని, సంక్లిష్టమైన ప్రతిపాదనలతో విద్యా కమిషన్ రూపొందించిన తెలంగాణ విద్యా విధానం- 2026 నివేదికను విలువ లేని నివేదికగానే విద్యార్థి లోకం చూస్తున్నది.
-శ్రీను నాయక్ దోన్వాన్, 8522018001