దాదాపు పదిహేనేండ్ల కిందట పత్రికల్లో ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది. కొంపల్లి నుంచి మేడ్చల్ రహదారికి ఆనుకొని ఓ కుటుంబానికి పదెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. అవసరం వచ్చి అందులో నాలుగెకరాలు అమ్ముకున్నారు. ఒకప్పుడు కొంపల్లి నుంచి మేడ్చల్ రోడ్ వరకు ద్రాక్ష తోటలున్న వ్యవసాయ భూమి, కాలక్రమంలో ఆ ప్రాంతం మహానగరంలో భాగంగా మారింది. దీంతో వ్యవసాయ భూములు కాస్తా కోట్ల రూపాయల విలువైన భూములుగా మారాయి.
నాలుగెకరాలు కొన్న వ్యక్తి ఆ భూమిలో విల్లాలు కట్టాడు. విల్లాల పక్కనే ఉన్న ఆరెకరాల్లో రైతు ఇంకా వ్యవసాయం చేస్తూనే ఉన్నాడు. ‘నువ్వు అడిగిన ధర ఇస్తాను మిగిలిన ఆరెకరాలు కూడా నాకే అమ్ము’ అంటూ ఆ వ్యక్తి రైతుపై అనేక రకాలుగా ఒత్తిడి తెచ్చాడు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనుసరించే బెదిరింపు టెక్నిక్లన్నీ ఉపయోగించాడు. అయినా, రైతు లొంగలేదు. ఆ బెదిరింపుల ఫలితంగా పోలీసు కేసులూ అయ్యాయి. ‘పక్కన వ్యవసాయ భూమి ఉండటం వల్ల విల్లాలకు సరైన విలువ రావడం లేదు, నేనేమీ ఉచితంగా ఇవ్వమని అడగడం లేదు. అతను చెప్పిన ధర ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను’ అని నాలుగెకరాలు కొన్న వ్యాపారి వాదన. భూ యజమాని అయిన రైతు వాదన ఇంకా ఆశ్చర్యం కలిగించింది.
‘అప్పుడు డబ్బులు అవసరం ఉండటం వల్ల గత్యంతరం లేక నాలుగెకరాలు అమ్ముకున్నాను. ఇప్పుడు నాకు భూమి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. అతను ఎంత డబ్బు ఇస్తే నాకెందుకు? ఈ భూమిలో మా తల్లిదండ్రులు, మా తాతల సమాధులున్నాయి. వాళ్లు తమ జీవితకాలం అంతా ఇక్కడే గడిపారు. మరణించిన తర్వాత కూడా వారిని ఇక్కడే సమాధి చేశాం. అతను నా పొలానికి ఇచ్చే కోట్ల రూపాయలతో నేను పెద్ద పెద్ద భవంతులు కొనవచ్చు.. మరోచోట వ్యవసాయ భూములు కొంటానేమో కానీ, ఆ భవంతుల్లో, ఆ భూముల్లో మా తల్లిదండ్రులు, మా పూర్వీకుల అనుబంధం ఉండదు కదా?’ అని భూమితో ఉండే అనుబంధాన్ని ఆ రైతు కళ్లకు కట్టాడు. అంతేకాదు, భూమిని అమ్మేదే లేదని తేల్చిచెప్పాడు.
ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి భూమి అంటే ఎంతకు కొన్నాం, ఎంతకు అమ్ముడుపోతుంది, ఎంత లాభం అనే లెక్కలు మాత్రమే ఉంటాయి. కానీ, రైతుకు వ్యవసాయభూమి అంటే తమ జీవితంలో ఒక భాగం. తన జీవితమే కాదు, తన తల్లిదండ్రులు, తమ పూర్వీకుల జీవితాలతో ముడిపడి ఉంటుంది. పెండ్లిళ్లు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు గత్యంతరంలేని పరిస్థితుల్లో రైతు వ్యవసాయ భూములు
అమ్ముకుంటాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారికి రైతుల ఆలోచన అర్థం కాదు కూడా.
నిర్మల్, వికారాబాద్ జిల్లాల్లో జరిగిన రెండు సంఘటనలను చూస్తే తమ భూములను కాపాడుకోవడానికి రైతులు ఎలాంటి తెగింపుకైనా సిద్ధమవుతారని పాలకులకు తెలిసివచ్చింది. నిర్మల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో తమ జీవితాలు ప్రమాదంలో పడతాయని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ ఉద్యమానికి సంబంధించి ఒక ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. మహిళల ధైర్యం, తెగింపు ఆసక్తి కలిగించింది. తమ భూముల కోసం తమ ఉనికి కోసం ఎంతటి నియంతలనైనా ఎదిరించే సత్తా తెలంగాణలో సామాన్యులకు ఉన్నదనే నమ్మకం కలిగింది.
ఒక సాధారణ మధ్య వయస్సు మహిళ తన ముఖం కెమెరాల్లో పడకుండా ముఖం కప్పుకొని చేతిలో పురుగుల మందు బాటిల్ పట్టుకొని పోలీసులపైకి ‘రండిరా రండి’ అంటూ దూసుకువెళ్తూ పోలీసులను పరుగెత్తించింది. ఆ ఫొటో బాగా వైరలైంది. తన భూమిని దొర లాక్కోవడానికి ప్రయత్నిస్తే చాకలి ఐలమ్మ తిరుగుబాటు చేసింది. ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక ఉద్యమంలోని ఆ సాహస మహిళ చాకలి ఐలమ్మ విగ్రహం ఈ రెండు ఫోటోలు కలిపి సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలైంది. ఆ మహిళ కట్టు బొట్టు, చాకలి ఐలమ్మ విగ్రహంలోని కట్టు బొట్టు ఒకే రీతిలో ఉన్నాయి. పాలకులు ఎంత బలవంతులైనా తిరగబడే తత్త్వం తెలంగాణలో ఎప్పుడూ ఉంటుందని, అది నిజాం కాలంలోనైనా, ఈ కాలంలోనైనా సజీవంగా ఉంటుందనిపించింది.
అదేవిధంగా వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా పరిశ్రమ కోసం గిరిజనుల భూమి బలవంతంగా సేకరించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై స్థానిక గిరిజనులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. పచ్చని పొలాలను తొండలు గుడ్లు కూడా పెట్టని భూములు అంటూ స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడంతో మీడియాను తమ పొలాల్లోకి తీసుకువెళ్లి ఇవి తొండలు గుడ్లు పెట్టని భూములా? మీకు తిండి పెడుతున్న భూములా? అని గ్రామంలోని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఫార్మా పరిశ్రమ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి ఆ భూసేకరణ ఫార్మా కంపెనీ కోసం కాదు, పారిశ్రామిక వాడ కోసం అని మాట మార్చారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మహబూబ్నగర్ జిల్లాలో ఫార్మా సిటీ కోసం వందల ఎకరాలు సేకరించి అన్నీ సిద్ధం చేశాక కేవలం ఇగోతో ఆ భూమిని పక్కనపెట్టి మళ్లీ భూసేకరణను ప్రభుత్వం ఏ విధంగా సమర్థించుకుంటుంది. ప్రజల ఉద్యమం, తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చిన తర్వాత ఫార్మా పరిశ్రమ, భూసేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దుచేసి పారిశ్రామిక వాడ పేరుతో నోటిఫికేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి అల్లుడికి సంబంధించి ఫార్మా కంపెనీ కోసం భూ సేకరణ జరుపుతున్నారనే ఆరోపణ జనంలోకి బాగా వెళ్లింది. ఎవరు అడ్డు వచ్చినా ఫార్మా పరిశ్రమ కోసం భూ సేకరణ జరుగుతుంది అని సీఎం సోదరుడు కెమెరాల ముందు ప్రకటించడం విశేషం.
పారిశ్రామిక వాడ అయినా, ప్రాజెక్టులు నిర్మించాలన్నా, ఫార్మా కంపెనీ అయినా భూములు సేకరించడం కొత్త కాదు. సేకరించాలి, కానీ ఒక ప్రజా ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా నిబంధనల మేరకు చట్టబద్ధంగా వ్యవహరించి తగు నష్ట పరిహారం ఇచ్చి బాధితులకు నచ్చజెప్పి భూములు సేకరించాలి. ‘ఎవడు అడ్డు వచ్చినా తొక్కుకుంటూ వెళ్తాను, బుల్డోజర్తో తొక్కి భూములు సేకరిస్తాం’ అని అహంకారంగా వ్యవహరిస్తే అది ప్రభుత్వం అనిపించుకోదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతుల నుంచి భూములు కొట్టేసే విధానం వేరు, రైతుల నుంచి ప్రభుత్వం భూములు సేకరించడం వేరు అనే విషయాన్ని పాలకులు గ్రహించాలి.
రైతులు తమ భూములను వదులుకోవడం అంటే తమ అస్తిత్వం కోల్పోవడంగా భావిస్తారు. తమ శరీరంలో ఒక భాగాన్ని వదులుకోవడంగా భావిస్తారు. రైతులకు వ్యవసాయ భూములతో అనుబంధాన్ని కేవలం డబ్బుతో లెక్కగట్టలేం. అయినా, ఎంతోమందికి ప్రయోజనం కలిగించే ప్రాజెక్టుల కోసం భూములు సేకరించాల్సి వస్తే దాన్ని రైతులకు వివరించాలి, వారిని ఒప్పించాలి కానీ, అధికారం చేతిలో ఉంది కదా అని తొక్కుకుంటూ వెళ్తామంటే.. అంతిమ అధికారం ప్రజల చేతుల్లోనే ఉంటుంది. వారికి అవకాశం వచ్చినప్పుడు వాళ్లూ తొక్కుతారు.
లగచర్ల, నిర్మల్ ఈ రెండింటిలో ప్రభుత్వం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరించింది. కానీ, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలా వ్యవహరించలేదనేది ముమ్మాటికీ సత్యం. తెలంగాణలోని సామాన్యుల్లో ఉద్యమ స్ఫూర్తి కొరవడలేదని నిరూపించే విధంగా లగచర్ల, నిర్మల్లోని సామాన్యులు, ముఖ్యంగా మహిళలు ఉద్యమించారు.
– బుద్దా మురళి