స్త్రీ అంటే ఆదిశక్తి. స్త్రీ అంటే ప్రకృతి. సృష్టికే ప్రతిసృష్టి నిచ్చి సమాజానికి మార్గ నిర్దేశనం చేసే మహిళ తనకు తానే సాటి. అమ్మగా, అక్కగా, చెల్లిగా ఆత్మీయతను అనురాగాన్ని పంచె అమృతమూర్తి మహిళ. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత’ ఎక్కడైతే స్త్రీలు గౌరవింప బడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారనే స్ఫూర్తిని నిజం చేస్తూ అవని నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో అతివల విజయాలకు హద్దులు లేవు. కానీ లింగ సమానత్వం, వేతన సమానత్వం విషయంలో ఇంకా వెనకబడే ఉన్నారని చెప్పాలి.
మొదట మహిళా దినోత్సవం శ్రామిక మహిళా దినోత్సవంగా పిలువబడేది. కాలక్రమంలో స్త్రీలకు గౌరవం, గుర్తింపు, ఆర్థిక రాజకీయ సామాజిక సమానత్వ సాధనా ఉత్సవంగా జరుపుకొంటున్నాం. పని గంటలు, వేతనంలో వ్యత్యాసం, ఒక బట్టల మిల్లులో ప్రారంభమైన సమ్మె 1857లో మార్చి 8న విజయవంతమైన సందర్భంగా మహిళా దినోత్సవంగా జరుపుకొంటున్నాం. 1975 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది.
‘స్త్రీల జీవన ప్రమాణాలు దేశ అభ్యున్నతికి కొలమానాలు’ అన్నారు నెహ్రూ. క్రియాశీలకంగా తనంతట తాను నిర్ణయాలను తీసుకునే శక్తిని మహిళా సాధికారత అంటాం. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక స్థిరత్వానికి విద్య తోడైతే మహిళా విజయానికి అవదులు ఉండవు. కానీ ఎక్కడ చూసినా స్త్రీ శక్తి వంచనకు గురవుతూనే ఉంది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చి నా స్త్రీల పట్ల సహృదయత, సమానత్వ భావం, గౌరవం దక్కటం లేదు.
మహిళలను అంధకారానికి దూరం చేసి సమాజం ముందుకు నడవాలనుకోవడం వృథా ప్రయాస. మహిళల స్థితిగతులు బాగుపడందే సమాజం అభివృద్ధి చెంద దు. మానవ వనరుల సంపూర్ణ వినియోగంలో వీరి పాత్ర కీలకం. రంగం ఏదైనా పురుష శక్తికి తామేమీ తక్కువ కాదని నిరూపించగలరు స్త్రీలు. ‘కలకంటి కంట కన్నీరొలికిన సిరి ఇంట నుండ నొల్లరు సుమతి..’ ఏ ఇంట్లో నైతే స్త్రీ కంట నీరు పెడుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుండదట. అంటే ఆడవారిని లక్ష్మీ సమానులుగా దేవతగా కొలిచే సంస్కృతి మనదని వేమన ఆనాడే ‘సుమతి శతకం’లో చెప్పారు. మహిళలకు ఆర్థిక స్వావలంబనతోనే సమాజం ముందుకు పోతుంది.
– కొమ్మాల సంధ్య
9154068272