గత లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బలహీనపడిన బీజేపీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ర్టాలు చేజారిపోకూడదని కొన్ని నష్ట నివారణ చర్యలను చేపట్టింది. ‘అగ్నివీర్’ పథకం నిబంధనల సడలింపు ప్రక్రియ ఇందులో భాగమే. బడ్జెట్‌పై కూడా దీని ప్రభావం కనబడుతున్నది. ఈ నెల ఒకటిన సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీల వర్గీకరణపై ఇచ్చిన అనుకూల తీర్పును కూడా ఈ లెక్కలో వేయవచ్చు.
కోర్టుల్లో సుదీర్ఘకాలం వాయిదాలు పడే కీలక కేసులన్నీ ప్రభుత్వ కనుసన్నల్లోనే దాగుడుమూతలు ఆడుతుంటాయి. బీజేపీతో మందకృష్ణ చేయి కలిపినందుకు తెలంగాణలో 8 లోక్‌సభ స్థానాలు దక్కాయని ఆ పార్టీ నమ్ముతున్నది. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో బీజేపీకి మాదిగల మద్దతును ఈ తీర్పు పెంచుతుంది. జనాభా దృష్ట్యా తెలంగాణలో మాదిగ, మాలల నిష్పత్తి 2:1గా ఉన్నది. ఏపీలో ఇక్కడి కన్నా మాలల జనాభా కాస్త ఎక్కువే. మొత్తంగా ఎస్సీ కులాల జాబితాలో 61 ఉపకులాలున్నాయి. ఇప్పటికీ రిజర్వేషన్ ప్రయోజనాలను ఒక్క తరం కూడా అందుకోని ఉపకులాలు ఆ జాబితాలో ఎన్నో ఉన్నాయి. వీటిలో చాలా ఉపకులాల జనాభా వందలు, వేలల్లో ఉండగా లక్షల సంఖ్యలో ఉన్నవారు మాదిగలు, మాలలు మాత్రమే. వీరి తర్వాత లక్ష లోపు జనాభా గల ఉపకులాలుగా తెలంగాణలో నేతకాని, బుడగ జంగాలు వస్తాయి. బైండ్ల, డక్కలి, చిందు కులాలు కూడా మాదిగల్లోకే వస్తాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం.. దేశ జనాభాలో ఎస్సీలు 7 శాతం ఉండగా, తెలంగాణలో 19 శాతం, ఏపీలో 23 శాతం ఉన్నారు. ఆ లెక్కల ప్రకారం తెలంగాణలో మాదిగలు 32.33 లక్షలు ఉండగా, మాలలు 15.27 లక్షలు ఉన్నారు. 2014లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో ఎస్సీల జనాభా 63,60,158 అని తేలింది. నిష్పత్తి ప్రకారం చూస్తే మాదిగలు 42 లక్షల మంది ఉండే అవకాశం ఉన్నది.
ఉమ్మడి ఏపీలో ఆంధ్రా ప్రాంతంలో మాలలు చదువు, వ్యవసాయంలో మాదిగల కన్నా ముందున్నారని తెలిపే అధ్యయనాలున్నాయి. మాదిగలు తమ కుల, చేతివృత్తులను పట్టుకొనే ఉండగా మాలలు చదువు, వ్యాపారాల్లోకి వెళ్లారని, తద్వారా రిజర్వేషన్ల ఫలాలు వారికే ముందుగా, ఎక్కువగా దక్కుతున్నాయని మాదిగల వేదన, వాదన.
చదువుల్లో, ఉద్యోగాల్లో, పదవుల్లో న్యాయమైన వాటా దక్కాలంటే తమలో కూడా బీసీల మాదిరి కుల వర్గీకరణ తప్పనిసరి అని నష్టపోతున్నవారు చాలాకాలంగా కోరుకుంటున్నారు. ఎస్సీల వర్గీకరణ కోసం మాదిగల నేతృత్వంలో 1990 నుంచి ఆం దోళన కొనసాగుతున్నది. మాలలు ఈ డి మాండ్‌ను వ్యతిరేకించడంతో రెండు కులాల మధ్య కొంత ఎడబాటు కూడా ఏర్పడింది.
20 ఏండ్లుగా సుప్రీంకోర్టులో నానుతున్న కేసులో తమ అభీష్టం మేరకు తీర్పు రావడంతో మాదిగల్లో ఆనందం వెల్లివిరిసింది. ఎన్నికల సమయంలో మందకృష్ణ మాదిగ ప్రధాని మోదీతో కలిసిపోవడాన్ని విమర్శించిన వారున్నారు. పార్టీ విధానాలపరంగా బీజేపీని వ్యతిరేకిస్తున్న మాదిగ కులస్థుల వర్గం మంద కృష్ణ నిర్ణయాన్ని బహిరంగంగా తప్పుపట్టింది. సొంత భావజాలపరంగా చూస్తే వ్యక్తిగా మంద కృష్ణ కూడా ప్రధాని మోదీ శరణులోకి వెళ్లడం విచిత్రమే. కోర్టులో కేసు కదలడానికి, అనుకూల తీర్పునకు ఇదే అదనుగా భావించిన మంద కృష్ణ ప్రధాని ముందు బహిరంగంగా కన్నీళ్లు పెట్టుకొని సెంటిమెంట్‌తో లొంగదీసుకున్నాడు. అది బహిరంగ ఎన్నిక ప్రచార వేదిక కాబట్టి వర్గీకరణపై కమిటీ వేస్తామని మోదీ సభాముఖంగా ప్రకటించారు. రెండు రాష్ర్టాల్లో ఎన్నికల ఫలితాలు బీజేపీకి శుభకరంగా ఉండటంతో ఈ వర్గీకరణకు కాలం కలిసివచ్చినట్లయింది.
మాల, మాదిగ.. రెండు కులాలు దళిత జాతివే అయినా రెండింటి మధ్య సంస్కృతి, సంప్రదాయాలపరంగా చాలా భేదాలున్నాయి. ఒకరి పిల్లను ఒకరు చేసుకోరు. ఎవరి అయ్యవార్లు వారికున్నారు. మాదిగల కన్నా మేము గొప్ప అనే భావన మాలల్లో అన్ని విషయాల్లోనూ కనబడుతుంది. రెండు భిన్న కులాల్లో ఉండే సహజ వ్యత్యాసాలుగా వీటిని చూడవచ్చు. ఇదంతా కాలమాన జీవన విధానంలో భాగమే తప్ప కోరి విభేదిస్తున్నది కాదు. అయితే, సంఖ్యాపరంగా ఎక్కువున్న ఈ రెండు ఎస్సీ కులాల మధ్య రాజ్యాంగ ప్రయోజనాలు కూడా సమతూకంగా ఉండాలని అందరు కోరుకుంటారు.
నిజానికి ఈ సమస్యను కోర్టులో, ప్రభుత్వాలో తీర్చవలసిన అవసరం లేదు. అంబేద్కర్ ఆలోచనాసారాన్ని దళితులంతా ఆచరణలో చూపవలసిన బాధ్యత వారిపై ఉన్న ది. రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీల ఉమ్మడి ఆస్తి. తండ్రి ఆస్తిని పిల్లలు పంచుకునే న్యాయపద్ధతి ఇక్కడ అవసరం. ఒకే కడుపులో పుట్టిన బిడ్డలు తాము సమానంగా ఎదగాలని, ఆర్థికంగా బలహీనంగా ఉన్న తోబుట్టువులకు ఎక్కువ పాలు ఇవ్వాలని కోరుకుంటారు. పెద్దలు చెప్పిన పంపకాన్ని ఒప్పుకుంటారు. ఆస్తి విషయంలో పిల్లలు గొడవకు దిగితే పోయేది కుటుంబ పరువేననే స్పృహ అవసరం. దాయాదులుగా కాకుండా అన్నదమ్ముల్లా ఆలోచించాలి. మాల, మాదిగలు సామరస్యంగా తమ వాటాల నిర్ణయాన్ని ప్రభుత్వం ముందుపెడితే ఇంత కాలహరణ జరిగేది కాదు. రిజర్వేషన్లు మనవి, దాని లెక్కలు మనమే తేల్చుకుందామనే ధోరణి ఇప్పటికైనా అవసరమే.
సుప్రీంకోర్టు వర్గీకరణ బాధ్యతను రాష్ర్టాలకే కట్టబెట్టింది. పాలక పార్టీ పెద్దలు స్వలాభం కోసం ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నది. మళ్లీ ఫలితాలు ఏకపక్షంగా ఉంటే తీర్పు ప్రయోజనం ఒనగూడదు. ఇప్పటికే క్రీమీలేయర్ వర్తింపుని కేంద్ర క్యాబినెట్ వ్యతిరేకించింది. కాంగ్రెస్ కూడా దానికి వత్తాసుగా ప్రకటనలు చేస్తున్నది.
మేమంటే మేము ముందు వర్గీకరణ చేపడుతామని మన రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయి కానీ, చేతికి అందేదెప్పుడో, అందేదేమిటో చెప్పలేం. రాజకీయ ప్రయోజనాలను మాత్రమే కోరుకునే పార్టీలను గుడ్డిగా నమ్మలేం. రెండు, మూడు తరాలుగా ఫలా లను అనుభవిస్తున్న రాజకీయ నేతలకు ఈ తీర్పు మింగుడు పడనిదే. కమిటీలు, రిపోర్టులు అంటూ కాలయాపన చేయవచ్చు. రిజర్వేషన్ల రక్షణ, సమపాళ్ల అమలుకోసం ఎస్సీ, ఎస్టీలు ఇప్పటికైనా విభేదాలు వదిలి ఉమ్మడిగా కృషిచేయాలి. ఒకరి కాలు ఒకరు లాగితే లాభపడేవి రాజకీయ పార్టీలే.