మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ మోదీ వద్దకు రాగానే ఆయన లేచి నిలబడి కరచాలనం చేశారు. పక్కనే ఉన్న అమిత్ షా, నడ్డా కూర్చున్నప్పటికీ మోదీ మాత్రం గౌరవపూర్వకంగా లేచి కరచాలనం చేశారు. ఈ సన్నివేశాన్ని చూశాక నాకు సరిగ్గా పదేండ్ల కిందట ఢిల్లీలో జరిగిన ఒక ఘటన గుర్తుకువచ్చింది. ఒక సమావేశంలో ముఖ్యమంత్రులందరూ వరుసగా నిలబడగా.. తొలిసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ వారికి కరచాలనం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కరచాలనం చేసేందుకు చేయి ముందుకుచాస్తే.. మోదీ ఆయనను పట్టించుకోకుండానే వెళ్లిపోయారు. అప్పట్లో ఆ ఘటన సంచలనంగా మారింది.
PM Modi | దేశమంతా బీజేపీ విజయకేతనం ఎగురవేస్తే దేశ రాజధానిలో మాత్రం ఆప్ గెలవడం మోదీకి కంటగింపుగా ఉండటం సహజమే. కానీ, ప్రధానిగా ఆయన హుందాగా ఉండాలి. పార్టీలతో సంబంధం లేకుండా అందర్నీ గౌరవించాలి. మోదీ పదేండ్ల పాలనలో ఆ గౌరవ ప్రవర్తన చూసే భాగ్యం మనకు దక్కలేదు. మోదీ పగ ఏ స్థాయిలో ఉంటుందో కేజ్రీవాల్ జైలులో ఉండటాన్ని చూస్తేనే అర్థమవుతున్నది. చివరికి ఏదో మాట తూలాడని రాహుల్‌గాంధీ పార్లమెం ట్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయించారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గడంతో మిత్రపక్షాలకు ఆదరణ పెరిగింది. నితీష్ కుమార్‌కు ఎన్డీయే ద్వారా లు మూసుకుపోయాయని ప్రకటించిన మోదీనే ఆయన కనిపించగానే అప్రయత్నంగా లేచి నిలబడి స్వాగతం పలకడమే అందుకు నిదర్శనం.
అలా అని మోదీ ఇక పూర్తిగా మారిపోయారు, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తారని ఒక నిర్ణయానికి రాలేం. చంద్రబాబు, నితీష్ల మద్దతు వల్ల మోదీ తిరిగి అధికారంలోకి వచ్చారు. అది మద్దతుకు లభించిన గౌరవమే తప్ప ప్రజాస్వామ్యంలో అందరినీ సమానంగా గౌరవించాలనే హుందాతనం అని భావించలేం. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేయడం, ప్రత్యర్థి పార్టీల నాయకులపై సీబీఐ, ఈడీ దాడులు చేయించడం, వారిని జైలుపాలు చేయడం వంటి మోదీ మార్క్ కక్ష సాధింపు రాజకీయాలకు మాత్రం బ్రేక్ పడుతుందని ఆశించవచ్చు.
ఈ సందర్భంగా ఓషో చెప్పిన ఓ కథ గుర్తుకువస్తున్నది. ఒక సంపన్నుడు మితిమీరిన కోపం తో భార్య తల నరికేస్తాడు. ఆ తర్వాత బాధ పడుతూ సన్యాసి వద్దకు వెళ్తాడు. తనకు సన్యాసం ఇప్పించాలని కోరుతాడు. ‘నువ్వు సంపన్నుడివి, నీది విలాసవంతమైన జీవితం. ఖరీదైన దుస్తులు ధరిస్తావు. సన్యాసం నీ వల్ల కాదు’ అని సన్యాసి చెప్తుండగానే ఆ సంపన్నుడు తన దుస్తులను ఫరాఫరా చింపేస్తాడు. ఇప్పుడు సన్యాసం ఇవ్వండని కోరతాడు. అందుకు సన్యాసి నవ్వి.. ‘నీలో ఎలాంటి మార్పు రాలేదు. భార్య తల నరికినప్పుడు ఎలాగైతే ఆవేశంతో ఉన్నావో, ఇప్పుడు బట్టలు చింపుకొన్నప్పుడు కూడా అంతే ఆవేశంగా ఉన్నావు’ అని చెప్పి పంపించేస్తాడు.
ఇప్పుడు మోదీ విషయానికి వస్తే.. గతంలో ఒక సీఎంతో కరచాలనం చేయకుండా అవమానించడం, ఇప్పుడు ఒక సీఎం రాగానే లేచి నిలబడి కరచాలనం చేసిన తీరు రెండింటిలోనూ సహజ లక్షణం లేదు. బీజేపీకి సొంతంగా బలం ఉన్నప్పుడు అన్నీ నడిచిపోయాయి. ఇప్పుడు ఆ పార్టీ 240 సీట్లకే పరిమితమైంది. నితీష్, చంద్రబాబుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల గతంలో మాదిరిగా తన ఇష్టానుసారం వ్యవహరించడం సాధ్యం కాదు. బీజేపీ సొంత బలంతో తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగం ఉండదు, రిజర్వేషన్లు ఉండవని చాలామంది భయాందోళనకు గురయ్యారు. 240 సీట్లకు పరిమితం కావడం వల్ల ఈ భయాలు ప్రస్తుతానికి తొలిగిపోయినట్టే.
బీబీసీ చర్చలో విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించారు. దక్షిణాదిలో దక్కిన సీట్ల వల్ల మోదీ ఈసారి అధికారంలోకి వచ్చారని చెప్తూనే.. దక్షిణాది కారణంగా అధికారంలోకి రావడం వల్ల మంచే జరిగిందని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది సీట్లను తగ్గించి ఉత్తరాది సీట్లను పెంచాలనేది బీజేపీ వ్యూహం. ఇప్పుడు చివరికి దక్షిణాదియే బీజేపీని గట్టెక్కించడం వల్ల పార్లమెంటు నియోజకవర్గాల తగ్గింపు గండం దక్షిణాదికి తప్పినట్టయింది.
సంకీర్ణ ప్రభుత్వమే అయినా మోదీ తన పంథాను మార్చుకోవడం లేదు. పేరుకు సంకీర్ణ ప్రభుత్వమే అయినప్పటికీ గతంలో బీజేపీకి సొంతంగా బలం ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో అలాంటి నిర్ణయాలే ఆయన తీసుకున్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రివర్గంలో శాఖల కోసం మిత్రుల నుంచి తీవ్రంగా ఒత్తిడి ఉంటుంది. మంత్రివర్గం ఎలా ఉంటుందోనని స్టాక్‌మార్కెట్ అనేక సందేహాలతో కొట్టుమిట్టాడింది. గతంలో మాదిరిగానే మంత్రివర్గంలో కీలక శాఖలన్నీ బీజేపీనే తీసుకోవడంతో స్టాక్‌మార్కెట్ ఊపిరి తీసుకొని దూసుకెళ్తున్నది. చంద్రబాబు, నితీష్ కుమార్ల మద్దతు మోదీకి అనివార్యం. అదేవిధంగా వీరిద్దరికి మోదీ మద్దతు అనివార్యం. పరస్పర అవసరాల వల్ల వీరి బంధం ఏర్పడింది. వీరికి ఒకరిపై ఒకరికి ఎంత అపనమ్మకం ఉన్నా అనివార్యంగా కలిసి ఉండాల్సిన పరిస్థితి. మోదీని వ్యతిరేకించి బాబు బయటకు వెళ్లి చేసేదేమీ లేదు. నితీష్ కుమార్ పరిస్థితి కూడా అంతే. మోదీతో సఖ్యతగా ఉండి తమ రాష్ర్టానికి కావలసినవి సాధించుకోవాలి తప్ప రాజకీయ ఎత్తుగడలతో సాధించేదేమీ ఉండదు. అలా భావించడం వల్లనే రెండు పార్టీలు మోదీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాయి. ఈ రెండు పార్టీల మద్దతుతో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చి ఉంటే రాజకీయాలు వేరుగా ఉండేవి. వీరిద్దరు మద్దతు ఇచ్చినా ఇండి యా కూటమికి అధికారం దక్కదు. అందుకే అటు మోదీ ఇటు బాబు, నితీష్‌లు పరస్పర ప్రయోజాలను దృష్టిలో పెట్టుకొని కలిసిపోయారు. పరిస్థితు లు వారిని కలిపాయి. ఈ బంధం వచ్చే ఎన్నికల వరకు ఉండే అవకాశాలే ఎక్కువ.
గతంలో ఒక సీఎంతో కరచాలనం చేయకుండా అవమానించడం, ఇప్పుడు ఒక సీఎం రాగానే లేచి నిలబడి కరచాలనం చేసిన తీరు రెండింటిలోనూ సహజ లక్షణం లేదు. బీజేపీకి సొంతంగా బలం ఉన్నప్పుడు అన్నీ నడిచిపోయాయి. ఇప్పుడు ఆ పార్టీ 240 సీట్లకే పరిమితమైంది. నితీష్, చంద్రబాబుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల గతంలో మాదిరిగా తన ఇష్టానుసారం వ్యవహరించడం సాధ్యం కాదు.
దేశంలోని ప్రధాన సర్వే సంస్థలు ఎన్డీయేకు 360 నుంచి 401 సీట్లు వస్తాయని ఎగ్జిట్‌పోల్స్‌లో చెప్పాయి. ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ అని మోదీ నినాదం ఇస్తే.. ఆ నినాదానికి తగ్గట్టు సర్వే సంస్థలు ఎగ్జిట్‌పోల్స్‌ను ప్రకటించాయి. కానీ, వాస్తవ ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. దేశంలో మెజారిటీ మీడియా బీజేపీ కనుసన్నల్లో ఉన్నది. ఎన్డీటీవీ లాంటి వాటిని సైతం బీజేపీ అనుకూల వ్యక్తులు కొనేశారు. 400 సీట్లు అని చెప్పడం ద్వారా దేశవ్యాప్తంగా మీడి యా తన విశ్వసనీయతను కోల్పోయింది. జూన్ 1న సాయంత్రం ఎగ్జిట్‌పోల్స్ వచ్చాయి. శని, ఆదివారం సెలవు. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల వల్ల సోమవారం స్టాక్‌మార్కెట్ రాకెట్లా దూసుకెళ్లింది. ఎగ్జిట్‌పోల్స్ వెనుక మీడియా యజమానుల స్వార్థం ఉందని తెలియని ఇన్వెస్టర్లు అవి నిజమేనని అనుకొని మార్కెట్‌ను ఆకాశానికెత్తేశా రు. మరుసటిరోజు అసలు ఫలితాలు వచ్చాయి. ఎగ్జిట్‌పోల్స్‌కు, వాస్తవ ఫలితాలకు అసలు సంబంధమే లేకపోవడంతో 4న ఒక్క రోజే స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్ల రూ.30 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఎగ్జిట్‌పోల్స్ పేరుతో మార్కెట్‌ను ఇలా రాకెట్లా దూసుకువెళ్లేట్టు చేయడం వెనుక పెద్ద కుంభకోణం ఉందనేది రాహుల్‌గాంధీ చేస్తున్న ఆరోపణ. నిజానికి పోలింగ్ మొదలైనప్పటి నుంచి మార్కెట్ పడిపోతూ వచ్చింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మార్కెట్ నుంచి పెద్దమొత్తంలో పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం మొదలుపెట్టారు. ఫలితాలు బీజేపీకి అంతగా సానుకూలంగా ఉండవనే సంకేతాలు అందడంతోనే పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారనే వార్తలు మార్కెట్‌కు చేరాయి. కానీ, ఎగ్జిట్‌పోల్స్ నిజమేనని భావించిన ఇన్వెస్టర్లు భారీగా దెబ్బతిన్నారు. ఈ కుంభకోణంపై జేపీసీ ఏర్పాటు చేసి విచారించాలని రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. నిజంగా కుంభకోణం జరిగిందా? జరిగినా నిరూపిస్తారా? జేపీసీ వేస్తారా? అంటే ఇందులో ఏ ఒక్కటి జరగదనే సమాధానమే వినిపిస్తుంది. కానీ, దేశ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా ‘4వ తేదీ నుంచి మార్కెట్ దూసుకెళ్తుంది, స్టాక్స్ కొనండి’ అని దేశ ప్రధాని చెప్పడం విచిత్రం. ప్రధాని ఒక్కరే కాదు, హోం మంత్రి అమిత్ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ విధంగానే హామీ ఇవ్వడం స్వతంత్ర భారతదేశంలో మొదటిసారి. దేశం ఆర్థికంగా దూసుకువెళ్తుందని చెప్పడం, ఏయే రంగాల్లో అభివృద్ధి ఎలా సాగనున్నదో చెప్పడం ప్రధాని బాధ్యత. అయితే, స్టాక్‌మార్కెట్ సలహాలు ఇవ్వడమంటే ప్రధాని తన స్థాయిని తగ్గించుకోవడమే.
మ్యూచువల్ ఫండ్స్ అమ్మేటప్పుడు లాభం గ్యారంటీ అని బ్యాంకులు చెప్పడం ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధం. అర్హత పరీక్షలు పాసైనవారు మాత్రమే స్టాక్స్‌కు సంబంధించి యూట్యూబ్‌లో సలహాలు ఇవ్వాలని సెబీ నిబంధనలున్నాయి. కానీ, ప్రధాని మాత్రం ఏకంగా ఏయే స్టాక్స్ కొనాలో లోక్‌సభలోనే సగర్వంగా ప్రకటించారు. పీఎస్‌యూ స్టాక్స్ కొనమని, ఎల్ఐసీ స్టాక్ కొనమని మోదీ పార్లమెంటులో చెప్పారు. ఎల్ఐసీ 915 రూపాయలకు ఐపీవోకు వస్తే దాదాపు రెండేండ్ల పాటు 600-700 మధ్య తచ్చాడింది. వెయ్యి దాటగానే ‘ఇప్పుడు చూడండి’ అంటూ మోదీ ఆనందోత్సాహాలతో సగర్వంగా ప్రకటించారు. మోదీ ప్రకటించిన తర్వాత ఎల్ఐసీ మళ్లీ 900 రూపాయలకు దిగింది. ప్రధాని మాట నమ్మి కొన్నవారు నష్టపోయారు. ‘హామీల అమలుకు నాదీ గ్యారంటీ’ అని ప్రధాని చెప్తే గౌరవప్రదంగా ఉంటుంది. అంతేకాని స్టాక్‌మార్కెట్ సలహాలు ప్రధాని స్థాయికి తగవు. ఈ నేపథ్యంలో దేశ ప్రధాని హుందాగా ఉంటారని, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తారని, దేశ పాలన అంటే వ్యాపారం కాదని, భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసేవారు దేశ ద్రోహులు కాదని ఇప్పటికైనా గ్రహిస్తారని ఆశిద్దాం.
పొరుగు రాష్ట్రమైన ఏపీ మద్దతుతో మోదీ అధికారాన్ని నిలుపుకోవడం వల్ల తమ డిమాండ్లను సాధించుకునే అవకాశం ఆ రాష్ర్టానికి లభించింది. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌లకు చేరో 8 సీట్లు రావడంతో జాతీయస్థాయిలో మనకు వాయిస్ లేకుండాపోయింది. గత పదేండ్లు తెలంగాణకు ఏమీ సాధించని బీజేపీ ఇప్పుడేదో సాధిస్తుందని అనుకోవడం అత్యాశే. తెలంగాణ ప్రాజెక్టులను గుజరాత్‌కు తరలించినా మౌనంగా ఉన్న వీరు ఇప్పుడు ఏదో సాధిస్తారని ఆశించలేం. మోదీపై ఇండియా కూటమి ఉద్యమించగలదేమో కానీ తెలంగాణకు ఏదో సాధించి పెడుతుందని అనుకోలేం. తాజా సార్వత్రిక ఎన్నికలు ఏపీకి అదృ ష్టమైతే మనకు మాత్రం దురదృష్టం.
-బుద్దా మురళి