యువత ఓట్లను లక్ష్యంగా చేసుకొని దేశంలో అవినీతిని అంతం చేస్తానని, విదేశాల్లో ఉన్న నల్ల ధనాన్ని తిరిగి తెస్తానని, ప్రతి భారతీయుని బ్యాంక్ ఖాతాల్లో రూ.15 లక్షలు జమ చేస్తానని ప్రచారం చేసిన మోదీ 2014లో అధికారంలోకి వచ్చారు. కానీ, వాగ్దానాల్లో ఏ ఒక్కటీ నేటి వరకు అమలు కాలేదు. అంతేకాదు, ఈ హామీలపై ప్రజలు నిలదీసిన ప్రతీసారి ఏదో ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ‘ఒకే దేశం- ఒకే పన్ను’ పేరిట కొన్నాళ్లు ప్రజలను మభ్యపెట్టారు. ఆ తర్వాత పెద్ద నోట్ల రద్దుతో అవినీతి అంతమవుతుందని, ఉవ్రాదం నశిస్తుందని ప్రచారం చేశారు. ఉగ్రవాదం నశించకపోగా మరింత పెరగడంతో ఆర్టికల్ 370ని రద్దు చేశారు. సమాజంలో ఉద్రిక్తతలు సృష్టించి రామమందిరం పేరిట హిందూ రాజకీయాలు చేశారు. హిందువుల చిరకాల వాంఛనెరవేరిందని గొప్పలు చెప్పారు. కానీ, మోదీ పాలనలో హిందువులు నిరుద్యోగం, పేదరికంలో మగ్గుతున్నారు.
బ్రిటీష్‌వారు తెచ్చిన పాత చట్టాలను దుమ్ముదులిపి కార్మికులకు న్యాయం చేస్తామని చెబుతూ.. 44 కార్మిక చట్టాల్లోని హక్కులను మోదీ సర్కారు హరించింది. కార్పొరేట్లకు అనుకూలమైన 4 లేబర్ కోడ్లను ప్రవేశపెట్టి కార్మికులకు తీవ్రమైన ద్రోహం చేసింది. ప్రభుత్వరంగ సంస్థలను మూసివేసి వాటి స్థానంలో కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహిస్తున్నది. దేశ భక్తులమని చెప్పుకొంటూ డిఫెన్స్ ల్యాబ్‌లను, డిఫెన్స్ పరిశ్రమలను తాకట్టుపెట్టి కార్పొరేట్ సంస్థలు రక్షణ రంగంలో వచ్చేందుకు మార్గం సుగమం చేసింది. సముద్ర గర్భంలోని ఖనిజాలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు టెండర్లు పిలుస్తున్నది. ఖనిజాల కోసం అడవులను కట్టబెట్టి ఆదివాసీలను తరిమివేసినట్టు.. సముద్ర గర్భాన్ని అప్పగించి మత్స్యకారులను సముద్ర తీరానికి దూరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు.
సమాజాన్ని విచ్ఛిన్నం చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్న ఉగ్రవాదులకు, సమాజాన్ని దోపిడీ నుంచి, అసమానతల నుంచి, అన్యాయాల నుంచి కాపాడాలని పనిచేస్తున్న నక్సలైట్లను కేంద్రం ఒకే గాటన కడుతుండటం చారిత్రక తప్పిదం. ఉగ్రవాదులకు కులం, మతం, ప్రాంత భేదాలేవీ ఉండవు. కానీ, నక్సలైట్లు అలా కాదు. వారు పేదలు, కష్టజీవుల తరఫున పోరాడుతున్నారు.
ఆపరేషన్ కగార్ పేరిట నక్సలైట్లు, ఆదివాసీలను చంపి, అడవి బిడ్డలను భయభ్రాంతులకు గురిచేసి, వారిని ఇతర ప్రాంతాలకు వెళ్లగొట్టడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులతో కేంద్రం శాంతి చర్చలు జరుపుతుంది కానీ, మన దేశ బిడ్డలైన నక్సలైట్లతో మాత్రం సంప్రదించడం లేదు. ఇది ద్రోహపూరిత చర్య.
రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధాలను ఆపాలని ప్రతిపాదించే ప్రధాని మోదీ మన దేశంలోని నక్సలైట్లతో ఎలాంటి సంప్రదింపులు లేవని చెప్పటం వెనుక ఉన్న రహస్యాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. అటవీ సంపద, ఆ ప్రాంతంలోని ఖనిజాలపై ఆదివాసీలకే హక్కు ఉన్నది. వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వారి హక్కులను గుర్తించటానికి నిరాకరిస్తున్నది. దేశ సంపదను కాపాడటం, దేశ ప్రజలకు ప్రయోజనం చేకూర్చటం కేంద్ర ఉద్దేశం కాదనేది ఆపరేషన్ కగార్ ద్వారా తెలుస్తున్నది.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తప్పుడు విధానాలను విడనాడాలి. ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలి. శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని నక్సలైట్లు ప్రకటించిన నేపథ్యంలో వారితో చర్చలు జరపాలి. లేకపోతే అవినీతిని అంతం చేస్తామని, విదేశాల నుంచి నల్ల ధనాన్ని తీసుకొస్తామని పలికిన ప్రగల్భాల మాదిరిగానే నక్సలిజాన్ని అంతం చేస్తానని హోం మంత్రి చేసి న ప్రకటన మిగిలిపోతుంది. దేశం లో నిరుద్యోగం, అసమానతలు, దోపిడీలు ఉన్నంతకాలం ఏదో ఒక రకంగా, ఏదో ఒక పేరుతో తిరుగుబాట్లు తప్పవు. ఈ విషయాన్ని పాలకులు అర్థం చేసుకోవాలి.
(వ్యాసకర్త: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు)
– వి.యస్.బోస్
93913 56527