తెలంగాణ పల్లెల్లో ఊరి పెత్తందారును ‘దొర’ అంటారు. పట్వారీ (కరణం) కావచ్చు, మోతుబరి ఆసామీ కావచ్చు ‘దొర’ అనే పిలుస్తారు. కానీ, ఇప్పుడు దళితుల్లో దొరలున్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పుణ్యమాని ఎదిగినవారు కూడా దొరల లాగానే వ్యవహరిస్తున్నారు. ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసిన కవులు, రచయితలు, మేధావులు మూలాలను మరిచి తమకంటే కింది ప్రజలను అవహేళనగా చూస్తూ అవమానపరుస్తున్నారు. ఇక దళిత ప్రజాప్రతినిధుల గురించి చెప్పనక్కర్లేదు. వాళ్లకూ, ఊరి పెత్తందారులకు తేడా లేనే లేదు.
పెత్తందారుల బాటలోనే దళిత ప్రజాప్రతినిధులు నడుస్తున్నారు. అంబేద్కర్ భావజాలం ఉన్నవాళ్లు, ప్రజా ఉద్యమాల్లో పనిచేసినవారు కూడా కింది కులాల ప్రజలను గౌరవించడం లేదు. కొంతమంది సాహితీవేత్తలు ‘మేము మహా కవులం’ అని పేట్రేగిపోతున్నారు. ఇక్కడ చెప్పేదేమంటే మీరు ఎదిగినందుకు ఎవరూ ఏడ్వడం లేదు. మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నందుకే బాధగా ఉన్నది. ఆ బాధతోనే ఈ మూడు ముక్కలు రాస్తున్నాను.
ఏ మూలాల నుంచి వచ్చామో, ఆ మూలాలను మరిచిపోతున్నాం. రాజ్యాంగ ఫలాలను దక్కకుండా చేసేవాళ్లను దొరలు, పెత్తందార్లు అన్నప్పుడు, దళితులలో ఇలాంటివి అనుసరిస్తున్న వారిని ఏమనాలి? మనం బుద్ధుని, మార్క్స్, నారాయణ గురు, పెరియార్, కబీర్, ఫూలే, అంబేద్కర్, కాన్షీరాంల గురించి మాట్లాడుతుంటాం. సమానత్వం, హక్కులు, రాజ్యాధికారం గురించి కొట్లాడుతున్నాం. ఆకలి, అవమానం, ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నాం.
అంబేద్కర్ చెప్పినట్టు విమర్శ కంటే ఆత్మవిమర్శ గొప్పది. ఆత్మవిమర్శ చేసుకోనప్పుడు నీవు రాజువైతే ఏమీ, మంత్రివైతేనేమీ, కవివి అయితేనేమీ? అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ల పుణ్యమాని చట్టసభలకు ఎన్నికైన దళిత ప్రజాప్రతినిధులు రాజ్యాంగబద్ధంగా దళితుల అభ్యున్నతికి ఎంత ఖర్చుచేశారో లెక్కలతో సహా చూపించగలరా? ఇంకా దారుణం ఏమంటే.. ఎమ్మెల్సీ, రాజ్యసభకు నామినేట్ అయిన దళిత ప్రజా ప్రతినిధులు వాళ్లకు కేటాయించిన నిధులను 99 శాతం అగ్రకుల వ్యక్తుల ప్రయోజనాల కోసం ఖర్చు చేస్తున్నారు.
ఇది నిజం కాదా? కాదంటే శ్వేతపత్రం విడుదల చేస్తారా? ఇంకా ఘోరం ఏమంటే.. ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నికైన దళిత ప్రజాప్రతినిధుల ఇండ్లల్లోకి దళితులకే ప్రవేశం ఉండదు. అదే, దొరలో, రెడ్డి బాబులకైతే సులువుగా ప్రవేశం దొరుకుతుంది. అగ్రకుల నాయకులు ఒకసారి కాకపోతే ఒకసారి ఇంటికి పోతే గౌరవం ఇస్తారు. కానీ, దళిత ప్రజా ప్రతినిధులు మాత్రం అసలుకే పట్టించుకోరు. ఇప్పటికైనా మీ పద్ధతులను మార్చుకోండి. మన జాతి పేద ప్రజలకు గౌరవం ఇచ్చి అవకాశాలు కల్పించండి. ఆదరించండి. అంబేద్కర్ లాంటి మహానీయులు మీ వలె ఆలోచించి ఉంటే మనం ఈ స్థాయికి వచ్చేవాళ్లమా?
దళిత ప్రజాప్రతినిధులై ఉండికూడా ఒక్కోసారి దళితుల మీద దాడులు జరిగితే స్పందించడం లేదు. దళిత మహిళల మీద అత్యాచారాలు జరిగితే చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దళితులపై అక్రమ కేసులు పెడితే పోనీలే మనకెందుకులే అనుకుంటున్నారు. మీ కుటుంబం మంచిగా బతికితే సమాజం మొత్తం మంచిగా బతికినట్లా? ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు మా కోసం కొట్లాడితే, మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుంటాం. ప్రజల బాగోగుల కోసం కొట్లాడినందుకే కదా? అంబేద్కర్ లాంటి మహనీయులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఓ నేతల్లారా.. అన్ని కులాల్లో ఉండే పేదల కోసం కొట్లాడండి, బలహీనుల కోసం పని చేయండి. రాజ్యాంగ హక్కులను కాపాడండి.
నిమ్న కులాల్లోని కొందరు పదవుల కోసం అగ్రకులాల వారందరికీ వ్యతిరేకంగా నిమ్నకులాల ప్రజలను రెచ్చగొడుతున్నారు. పోనీ, ఆయా కులాల అభ్యున్నతికి వీరు చిత్తశుద్ధితో ఏదైనా కృషిచేస్తున్నారా అంటే అదీ లేదు. దళిత ప్రజాప్రతినిధుల్లారా ఇప్పటికైనా మారండి. లేకపోతే, భవిష్యత్తులో జరగబోయే భయంకర పరిణామాలకు మీరే కారణమవుతారు.
– ఎదిరెపల్లి కాశన్న