తెలంగాణ శాసనసభ ఎన్నికలు ముగిసి మూడు నెలలు గడిచిపోయాయి. మరికొద్ది రోజుల్లో దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ప్రజలను ఆకట్టుకోవడానికి మళ్లీ నాటకాలు మొదలయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రజానీకం ఏ పార్టీకి ఓటెయ్యాలి? తమ సమస్యలు పార్లమెంట్‌కు చేరవేసే ప్రతినిధులుగా ఎవరిని ఎన్నుకోవాలి? ఏది సరైన నిర్ణయం? ఇప్పటికే తప్పటడుగు వేసి తిప్పలు పడుతున్న ప్రస్తుత తరుణంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. చీకటి దిశగా సాగుతున్న తెలంగాణ గమనాన్ని వెలుగుల వైపు మళ్లించాల్సిన ఆవశ్యకత ఉంది. రాష్ట్ర భవిష్యత్తు, మన భవిష్యత్తుకు ఎంతో కీలకమైన ఈ సమయంలో.. మనల్ని పాలించిన, పాలిస్తున్న పార్టీల చరిత్రను ఓసారి తిరగేద్దాం.
Telangana | శాసనసభ ఎన్నికల్లో గెలిచి మనల్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని మొట్టమొదటగా పరిశీలిద్దాం. దాదాపు 44 ఏండ్లు తెలంగాణ రాష్ర్టాన్ని పాలించి, మన ప్రాంతాన్ని వెనక్కినెట్టిన కాంగ్రెస్‌ను ప్రజలు మళ్లీ ఎందుకు ఎన్నుకున్నారు? ఈ ప్రశ్నకు కేవలం ఒకేఒక్క సమాధానం వినిపిస్తున్నది. 2014లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ తన మేధస్సును, తెలంగాణ పట్ల తనకున్న ప్రేమాభిమానాలను రంగరించి ప్రతిఒక్కరి అవసరాలను గుర్తించి, ప్రవేశపెట్టిన పథకాలతో తొమ్మిదిన్నరేండ్ల పాటు ప్రజలు ఆనందంగా జీవించారు. వ్యవసాయం, పరిశ్రమలు, పోలీసు వ్యవస్థ, స్త్రీల భద్రత, వైద్యం, విద్య, వృత్తులు, దేవాలయాలు, సాంస్కృతిక పునరుజ్జీవం, స్వచ్ఛమైన తాగునీరు.. ఇలా అన్ని రంగాలు అభివృద్ధి చెంది, సకల వసతులు సమకూరాయి. నిస్సహాయ వృద్ధులకు, దివ్యాంగులకు, బీడీ కార్మికులకు పింఛన్లు అందాయి. తెలంగాణ అభివృద్ధి పథంలో స్థిరపడిపోయింది. ఇక ప్రజలు ఏమనుకున్నారంటే.. ప్రస్తుతం అమలవుతున్న పథకాలకు కాంగ్రెస్ ఎన్నికల ముందు ఊదరగొట్టిన పథకాలన్నీ కలుస్తాయని భ్రమపడ్డారు. రైతుబంధు పెరిగి రైతుభరోసాగా మారుతుందని, మహిళలందరికీ పెన్షన్లు, ఉచిత ప్రయాణం, గృహజ్యోతి, చౌకగా గ్యాస్ సిలిండర్, రెండు లక్షల ఉద్యోగాలు.. ఇలాంటివన్నీ అదనంగా చేరితే తమ జీవితాలు ఇంకా బాగుంటాయని అనుకున్నారు. మరి జరిగిందేమిటి? రైతుబంధు రచ్చ అవుతుందని, మిషన్ భగీరథ నల్లా బంద్ అవుతుందని, కాళేశ్వరం కట్టేస్తారని, పెంచుతామన్న పెన్షన్లు తుంచుతారని ప్రజలు ఊహించలేదు. ఏదేదో ఊహించుకొని పెద్ద ఎత్తున కాంగ్రెస్‌కు ఓటేసిన రైతులు, నిరుద్యోగులు ఇప్పుడిప్పుడే ఆ పార్టీ వైఖరిని పసిగడుతున్నారు.
కాంగ్రెస్ పాలనలో అనతికాలంలోనే నిన్నమొన్నటిదాకా పచ్చగా ఉన్న పైర్లు ఎండిపోయాయి. సిరులు పండిన నేల నెర్రెలు బారింది. నీళ్లు లేక, కరెంటు లేక, పెట్టుబడి సాయం అందక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రాత్రి కరెంటుతో షాక్ తగిలి అన్నదాతలు మరణిస్తున్నారు. అకాలమరణం చెందిన రైతు కుటుంబాలను ఆదుకునే రైతుబీమాను ఎగ్గొట్టిన కాంగ్రెస్ సర్కార్.. ఆ పార్టీకి ఓట్లేసి గెలిపించిన రైతులను ఓడగొట్టింది.
ఇక నిరుద్యోగుల సంగతి సరేసరి. విద్యావంతులై కూడా కాంగ్రెస్ లాంటి పార్టీని నమ్మి మోసపోయారు. ఎంపికైన ఉద్యోగార్థుల్లో ఆంధ్రా మూలాలున్న యువతకే ఎక్కువ కొలువులు దక్కడంతో నిరుద్యోగులు విస్తుపోయారు.
గత ప్రభుత్వ పథకాలన్నీ నిలిపివేసి, తెలంగాణ ప్రజలను కష్టాలపాలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఆంధ్రాకు చెందిన కుమారి ఆంటీ క్యాంటీన్ సమస్యను గంటల్లోనే పరిష్కరించడం చూసి నిరుద్యోగులు నివ్వెరపోయారు. చిత్రమేమిటంటే.. తెలంగాణ ఉద్యమం, అప్పటి కాంగ్రెస్ పాలన గురించి పుస్తకాల్లో చదివి కూడా ఆ పార్టీ వైఖరిని యువత అర్థం చేసుకోకపోవడం. ఎంతో కష్టపడి తెచ్చుకున్న రాష్ర్టాన్ని మళ్లీ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పెట్టడం. తెలంగాణ వ్యతిరేకి అయిన చంద్రబాబు శిష్యుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం. ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ వ్యక్తిని, మోదీ మళ్లీ ప్రధాని కావాలని పబ్లిక్‌గా చెప్తూనే బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య ఒప్పందముందని అబద్ధాలు చెప్పగలిగిన వ్యక్తిని ప్రజలు నమ్మడం. ఇంతకంటే అమాయకులు ప్రపంచంలో మరెవరూ ఉండరేమో!
రాష్ర్టానికి, ప్రజలకు మంచిచేసే ఒక్క విషయం కూడా తెలంగాణ అసెంబ్లీలో చర్చకు రాదని గత సమావేశాల్లోనే తేలిపోయింది. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలు మంచివి కావని వాదించి, వాటిని నిలిపివేసి, మళ్లీ ఆంధ్రా పెత్తనం దిశగా కాంగ్రెస్ సాగుతున్నదని ప్రజలు గ్రహించాలి. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు గెలిచినా తెలంగాణకు అపార నష్టం జరుగుతుందన్న సత్యాన్ని ప్రజలు గుర్తెరగాలి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలి. తెలంగాణ ప్రగతి, క్షేమం కోసం ఆ పార్టీ ప్రతినిధులను పార్లమెంట్‌కు పంపించాలి. ఎందుకంటే, అందరూ అనుకుంటున్నట్టు.. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన బలగంతో సహా బీజేపీలో చేరితే రాష్ర్టానికి మరింత నష్టం చేకూరుతుంది.
ఇక కమలం పార్టీ మొదటినుంచి తెలంగాణను శత్రువుగానే చూస్తున్నది. 2014 నుంచి ఆ పార్టీది అదే వైఖరి. గత రెండు ఎన్నికల్లో ఎన్నికైన బీజేపీ ఎంపీలు గానీ, శాసనసభ్యులు గానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా తీసుకురాలేదు. మన ప్రాజెక్టులకు జాతీయ హోదా తేలేదు. కనీసం ధన సహాయం తెచ్చారా అంటే, అదీ లేదు. పైగా అత్యద్భుతంగా పాలించిన బీఆర్ఎస్పై నిందలు మోపడం, వ్యక్తిగత దూషణలకు దిగడం తప్ప ఆ పార్టీ నేతలు చేసిందేమీ లేదు. కనీసం తెలంగాణ రైతుల పంటను కూడా కేంద్రం కొనేటట్టు చేయలేకపోయారు. పైగా ‘గంగా యమునా తెహజీబ్’లాగా ఉన్న హిందూ, ముస్లిం సోదరులను విడదీయటానికి పడరాని పాట్లు పడుతున్నారు. ఈ మత మౌఢ్య పార్టీకి ఓటేస్తే తెలంగాణ మరో మణిపూర్ కాష్టంలాగా కాలడం ఖాయం. జాతీయ నాయకులకు బానిసలైన స్థానిక బీజేపీ నేతలు తెలంగాణకు ఏం సాయం చేయగలరని వారికి ఓటెయ్యాలి?
తమ అక్రమ సంపాదనకు తోడు నెహ్రూ కుటుంబానికి రాష్ట్ర సంపదను దోచిపెట్టే కాంగ్రెస్, గుజరాతీ వ్యాపారులకు దేశ సంపదను దోచిపెట్టే బీజేపీల అవసరం ఈ రాష్ర్టానికి లేనేలేదు. వారికి ఒక్క ఓటు కూడా పడకూడదు. ఏనాటికైనా తెలంగాణ సాధించిన ఉద్యమ పార్టీ బీఆర్ఎస్సే ఈ రాష్ర్టానికి శ్రీరామరక్ష. కేసీఆర్ మాత్రమే రాష్ర్టాన్ని ప్రగతిపథంలో నడిపే అసలైన నాయకుడు.