తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాల కోసం. సకల జనుల సంక్షేమం స్వరాష్ట్రంలోనే సాధ్యమని నమ్మి బరిలోకి దిగి గిరిగీసి కొట్లాడినం. అందుకే స్వరాష్ట్ర సాధన తర్వాత ప్రథమ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అన్నివర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేశారు. కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకురావాలన్న సమున్నత లక్ష్యంతో బహుముఖ వ్యూహాలను ఆలోచించి అమలు చేశారు. ముఖ్యంగా అస్తిత్వమే ప్రశ్నార్థకమై, ప్రాణాలు తీసుకోవడమే శరణ్యమని అనుకుంటున్న నేతన్నల బాగోగులపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు.
‘నేతన్నకు చేయూత’ వంటి పథకాలతో బడుగుపేకల బడుగు బతుకులను వెలుగుదారి పట్టించారు. చేనేత కార్మికుల బతుకు గోస తెలిసిన నేతగా వారికి ఎన్నో రకాలుగా అండదండలు అందించారు. మగ్గంపై పనిచేసే ప్రతి కార్మికుని ఖాతాలోకి నేరుగా రూ.3,000 వేసేందుకు ‘చేనేత మిత్ర’ పథకం తెచ్చారు. చేనేత కార్మికుడు మరణిస్తే ఆ కుటుంబం వీధిన పడకుండా ఉండేందుకు రూ.5 లక్షల చేనేత బీమా ప్రవేశపెట్టారు. ఇంకా బతుకమ్మ చీరలు, బడిపిల్లల యూనిఫారాల ఆర్డర్లతో చేతినిండా పని ఉండేలా చేశారు. ముడిసరుకులు, రసాయనాలపై సబ్సిడీలు, పావలా వడ్డీకే రుణాలు సమకూర్చి అన్నివిధాలా ఆదుకున్నారు. అలా సుమారు తొమ్మిదిన్నరేండ్ల పాటు నేతన్నలు బతుకుదెరువుపై భరోసా పొందారు.
అడ్డగోలు హామీలతో, అలవిమాలిన గ్యారెంటీలతో అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నేతన్నల పరిస్థితి తారుమారైంది. సర్కార్ తీరు చూస్తుంటే అసలు నేతన్నల గురించి ఆలోచిస్తున్నదా? అనే సందేహం కలుగక మానదు. మొన్నటికి మొన్న బడ్జెట్లో చేనేత రంగానికి కేటాయింపులను చూస్తే ప్రభుత్వ చిత్తశుద్ధి తెలిసిపోతుంది. గత ఏడాది రూ.368 కోట్లు కేటాయించిన సర్కార్ ఈ ఏడాది రూ.110 కోట్లు కోత పెట్టి రూ.258 కోట్లకు కుదించడం ఏమిటి? ఏటేటా బడ్జెట్ పెరుగుతుందా? తరుగుతుందా? అనేది ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ గొప్పగా ఊరించిన అభయహస్తం పథకం అతీగతీ లేదు. ‘వర్కర్ టు ఓనర్’ పథకం ఊసే లేదు. ‘చేనేత మిత్ర’ను అటకెక్కించారు. కోటి మంది మహిళలకు కోటి చీరలు అని బాకాలూదుకున్న సర్కార్ ఇప్పటివరకు ఎన్ని పంచిందో చెప్పలేక నీళ్లు నములుతున్నది.
టెస్కోకు ఇచ్చిన రూ.105 కోట్ల యూనిఫాం ఆర్డర్‌ను రద్దు చేయడం నేతన్నల బతుకుపై శరాఘాతమని చెప్పాలి. మరోవైపు సంక్షేమ శాఖల కోసం రూ.200 కోట్ల విలువైన దుస్తులు, దుప్పట్ల తయారీకి ఇప్పటివరకూ ఆర్డర్లు ఇవ్వకపోవడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో నేతన్నల ఉపాధి ప్రశ్నార్థకమైపోయింది. టెస్కో ద్వారా అమలు చేస్తున్న టెండర్ల విధానం వల్ల దళారులు లాభపడి, నేతన్నల కూలీ తగ్గిపోయే ప్రమాదం ఏర్పడుతున్నది.
ఇకపోతే రూ.లక్ష వరకు రుణమాఫీ అనే హామీ ఆచరణలోకే రాలేదు. చేతినిండా పని కల్పించి ఉత్పత్తులకు మార్కెటింగ్ చేకూర్చి నేతన్నలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించిన బీఆర్ఎస్ సర్కార్ ఆదరణ గత చరిత్రగా మిగిలిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం నీడలో బితుకుబితుకుమంటూ గడిపే రోజులు వచ్చాయి. కొత్తవాటి సంగతి దేవుడెరుగు..పాతవి కూడా ఊడగొట్టింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నేతన్నలు ఆకలిబాధలకు గురయ్యే రోజులు దాపురించాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే వలస దోపిడీ పాలన కాలం నాటి సంక్షోభ పరిస్థితులు మళ్లీ పునరావృతం కావడం ఖాయం.