కల్లుగీత వృత్తి ప్రమాదాలతో కూడుకున్నది. అయినప్పటికీ బతుకుదెరువు కోసం చాలామంది గీతకార్మికులు ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. తెలంగాణలో సుమారు 5 లక్షల కుటుంబాలు దీనిపై ఆధారపడి జీవిస్తున్నాయి. వృత్తిలో భాగంగా అనేకమంది ప్రమాదాలకు గురవుతున్నారు. అయితే, గతేడాది ఎన్నికల వేళ గీతకార్మికులకు కాంగ్రెస్ అనేక హామీలిచ్చింది. కానీ, వాటిలో కాటమయ్య రక్షణ కవచం పంపిణీ మినహా ఏ హామీ అమలుకు నోచుకోలేదు. అయితే ఇది కూడా అరకొరగానే అని చెప్పుకోవాలి. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో సుమారు 2.50 లక్షల మంది గీతకార్మికులుండగా, 10 వేల మందికే ఈ సేఫ్టీ కిట్‌ను అందజేశారు. ఈ ఏడాది జూన్‌లో వీటి పంపిణీ చేపట్టగా.. అప్పటినుంచి సుమారు 16 మంది గీతకార్మికులు ప్రమాదవశాత్తూ చనిపోయారు. జనవరి నుంచి మళ్లీ సీజన్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో అందరికీ కిట్లు అందేలా చూడాలి.
అంతేకాదు, ఏడాదికాలంలో చనిపోయిన, అవయవాలు కోల్పోయిన వారికి రావాల్సిన రూ.7.90 కోట్ల ఎక్స్‌గ్రేషియాను వెంటనే ఇవ్వాలి. హామీ ఇచ్చినట్టుగా ఎక్స్‌గ్రేషియాను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలి. ఏజెన్సీ ఏరియాలోని గీత కార్మికులకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వాలి. సొసైటీలను పునరుద్ధరించాలి. యాదాద్రి భువనగిరి జిల్లాలో గత ప్రభుత్వం నిర్మించిన నీరా కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి ఉపాధి కల్పించాలి.
హైదరాబాద్‌లోని నీరా కేఫ్‌ను టాడి కార్పొరేషన్‌కు అప్పగించాలి. దాని ద్వారా వచ్చే లాభాలను గీత కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలి. టాడి కార్పొరేషన్ ద్వారా ఇచ్చే ఆర్థికసాయాన్ని కొనసాగించాలి. ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేసి, జనగామ జిల్లాకు ఆయన పేరు పెట్టాలి. గీత కార్మికుల పింఛన్‌ను రూ.4 వేలకు పెంచాలి.
మద్యం షాపుల్లో గౌడ్లకు ఇస్తున్న 15 శాతం రిజర్వేషన్లను 25 శాతానికి పెంచాలి. గీతకార్మిక సొసైటీల భూములకు రక్షణ కల్పించాలి. ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి ఇవ్వాలనే జీవో నం.560ని అమలు చేయాలి. హైబ్రీడ్ తాటి, జీలు, ఖర్జూర, ఈత చెట్లను అభివృద్ధి చేసి సొసైటీలకు అప్పగిస్తే యువత ఈ వృత్తి వైపు ఆకర్షితులవుతారు. లేకపోతే వృత్తి అంతరించిపోతుంది. ఇప్పటికైనా గీతకార్మికులకు ఇచ్చిన వాగ్దానాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి.
– మేకపోతుల వెంకటరమణ
(రాష్ట్ర అధ్యక్షులు, కల్లుగీత కార్మిక సంఘం)