A Story Should have a begin ning, middle and an end, but not necessarily in that order అని Jean Luc Godard ఒకచోట అన్నాడు. అది ఆత్మకథలకు, జ్ఞాపకాలకు కూడా వర్తిస్తుంది.
డైరీ రాయడం వేరు, జ్ఞాపకాలు రాయడం వేరు. ఎందుకంటే డైరీ ఏ రోజుకారోజు తేదీల వారీగా రాస్తాం. ఆయా సమయాల వారీగా జరిగిన విషయాలను రాస్తూ పోవాలి. అందులో సందర్భాలు, సంఘటనలుంటాయి. వరుసగా క్యాలెండర్ల లాగా రాస్తూ పోవాలి. కానీ, జ్ఞాపకాలు అట్లా కాదు. జ్ఞాపకాలను రాయడం మొదలుపెట్టగానే ఆయా కాలాల నాటి అనుభవాలు, అనుభూతులు జ్ఞాపకాలై మనల్ని ముప్పిరిగొంటాయి, మేమున్నామంటూ మన ముందు వాలతాయి. నేనంటే నేనని మనల్ని చుట్టేసుకుంటాయి. తేదీల వారీగా కాదు కాని తన్నుకొస్తున్న జ్ఞాపకాలు నేనంటే నేనేనని మన లోపలి నుంచి తోసుకొస్తాయి. అప్పుడు వాటిని మనం స్థిరంగా ఒకచోట నిలబడి సంయమనంతో రాయాల్సి ఉంటుంది. అక్కడ ఉద్వేగం, ఉద్రేకం కూడదు. అట్లా రాసినప్పుడే ఆ జ్ఞాపకాలు సజీవంగా ఉండి సాధికారికతను సంతరించుకుంటాయి.
నిజానికి జ్ఞాపకాల్లో ‘కాలం’ ఒకింత సంక్లిష్టమైన పాత్రను పోషిస్తుంది. అది ముందుకు, వెనక్కూ సాగుతుంది. అంతేకాదు, అప్పుడప్పుడు గుండ్రంగా కూడా తిరుగుతుంది. అంతేకాదు, ఆ ‘కాలం’ పొరలు పొరలుగా మన ముందు ఆవిష్కృతమవుతుంది. అట్లా ఆయా కాలాల్లో సాగిన మన జీవన ప్రవాహంలో అనేక గెలుపులు, ఓటములు, అభినందనలు, అవమానాలూ అన్నీ ఎదురవుతాయి. వాటి ప్రభావాలూ స్పష్టంగా కళ్లముందు కదలాడతాయి. కొన్ని మనలను సంబురపెడతాయి, మరికొన్ని కొండకచో బాధపెడతాయి. జ్ఞాపకాలు రాసేటప్పుడు వాటన్నింటినీ నిర్ద్వంద్వంగా నిష్పక్షపాతంగా రాయాలి. ఎప్పుడైనా ఆబ్జెక్టివ్‌గా రాయడం వల్లనే ఆ జ్ఞాపకాలకు, ఆ రచనకు సాధికారికత ఏర్పడుతుంది.
జ్ఞాపకాలు, ఆత్మకథలు ఎప్పుడైతే భేషజాలు లేకుండా నిజాయితీగా శ్వేతపత్రాలుగా రాస్తామో అవి గొప్ప ప్రేరణనిస్తాయి, ఆనందాన్నిస్తాయి. ఆ విశ్వాసంతోనే నేను నా ఈ ‘యాదోంకీ బారాత్’ (జ్ఞాపకాల ఊరేగింపు)ని రాయడం మొదలుపెట్టాను.
***
‘లోపల జ్ఞాపకాల జాతర/ నేనేమో వర్తమాన జెండా పట్టుకుని ముందు నడుస్తున్నా’ అనుకుంటూ రాయడం మొదలుపెట్టాను. తేదీల వారీగా రాయడం కాదు కానీ, మొత్తమ్మీద ఏదో ఒక క్రమంలో రాయాలనుకున్నాను. ఎప్పటికప్పుడు నన్ను నేను సమన్వయించుకుంటూ, పుటం బెట్టుకుంటూ రాయడం మొదలుపెట్టాను.
మూడేండ్ల కిందట మా కరీంనగర్ ఇంట్లో నేను జరిపిన పాత పుస్తకాల తవ్వకాల్లో బయటపడ్డ ఒక చిన్న ఫొటో అప్పుడు ఓ నాలుగు జ్ఞాపకాలను రాసేందుకు కారణమైంది. చారిత్రకంగా రికార్డ్ చేయాల్సిన విషయమనిపించి ఈ జ్ఞాపకాలను రాసి పంచుకున్నాను. అది చదివిన నా సహచరి ఇందిర ‘జ్ఞాపకాలు చాలా బాగున్నాయి… అప్పటి అన్ని విషయాలను రాయకూడదా’ అంది. అంతే కాదు, ఒకరకంగా ఒత్తిడి తెచ్చింది. చిన్నప్పటి నుంచీ అన్ని విషయాలను రాస్తే అది ఆత్మకథ అవుతుంది, మనం ఆత్మకథ రాసేంత పెద్దవాళ్లం కాదులే అన్నాను. కానీ, తను ఊరుకోలేదు. ‘అన్ని వివరాలను రాయండి… చదివేవాళ్లు చదువుతారు… ఏముంది’ అన్నది తను. ఇంకేముంది నాలో కూడా రాయాలనే కోరిక పెరిగింది. ఎప్పుడో ఇంటర్లో ఉన్నప్పుడు చూసిన హిందీ సినిమా పేరు ‘యాదోంకీ బారాత్’ గుర్తొచ్చింది. ఆ పేరు మీదే వారం వారం రాయడం మొదలుపెట్టాను. సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, వాట్సాప్, నా word press పేజీల్లో రాయడం మొదలుపెట్టాను. ‘మిత్రులు బాగుంది, కొనసాగించ’మన్నారు. అది అట్లా సాగుతూ వచ్చింది.
నా ఈ ‘యాదోంకీ బారాత్’లో విజయాలే కాదు, నా ఓటములు, నేను ఎదుర్కొన్న అవమానాలు, నాకు జరిగిన నష్టాలూ అన్నీ రాశాను. చీకటి, వెలుతురు అన్నింటినీ చిత్రించాను. మన జీవితంలో ఎన్నెన్ని తీరాలని దాటుతామో, ఎంతెంత దూరం ప్రయాణిస్తామో.. ఎన్నో గుర్తుంటాయి, మరెన్నో మరుపు అరల్లో మిగిలిపోతాయి. దాదాపుగా అన్నింటినీ రాసినప్పుడు దగ్గరి వాళ్లనుంచే రెండు వాదాలు వివాదాలు ఎదురవుతాయి. ‘నీకు నేను ఇంత దగ్గరివాడిని కదా నా గురించి చాలా తక్కువ రాశావు’ అని ఒకటి, ఇక రెండవది ‘కొన్ని విషయాలను రాయాల్సింది కాదు, ఎడిట్ చేస్తే బాగుండేది’ అని. ఇవన్నీ ఎట్లా ఉన్నా నేను నా జ్ఞాపకాలను నా శక్తి మేరకు నిజాయితీగా, వాస్తవికంగా రాశాను. నా ఈ ‘యాదోంకీ బారాత్’ రాస్తున్నంత కాలమూ నాలో నేను నవ్వుకున్నాను, ఏడ్చాను, కాలరెగరేసుకున్నాను, కొన్నిసార్లు తల దించుకున్నాను.
ఇదంతా కేవలం నా గడిచిన జీవితాన్ని గుర్తుచేసుకోవడమే కాదు, అది కచ్చితంగా తిరిగి జీవించడమే. ఇందులో నా జీవితానుభవాలతో పాటు ఆయా కాలాలనాటి రాజకీయ, సామాజిక అంశాలూ, వాతావరణమూ ప్రతిబింబించాయి. తారీఖులు, దస్తావేజులూ కాదు గానీ నా జ్ఞాపకాల నేపథ్యంలో ఇది ఒకరకంగా సాహిత్య, సామాజిక, సాంస్కృతిక చరిత్రే అని అనుకుంటాను.