మారకం విద్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిభ అన్నప్పుడు, భారతదేశపు కరెన్సీ అయిన రూపాయి మారకం అనే అభిప్రాయం కలగవచ్చు. కానీ, ఉద్దేశం అది కాదు. ఎందుకంటే, రూపాయి మారకం విలువను నిలబెట్టడంలో, పెంచటంలో ఆయన తన ప్రతిభనేమీ చూపలేదు. తను అధికారానికి వచ్చిన 2014లో అమెరికన్ డాలర్‌కు ప్రతిగా రూపాయి విలువ 60.95 కాగా, ఈ రోజున 85.37. అనగా 11 ఏండ్లలో రూ.24.42 తగ్గుదల. విశేషమేమంటే, భారత ఆర్థికవ్యవస్థ ర్యాంకింగ్ ప్రపంచంలో ఇదే కాలంలో 10 నుంచి 5కు పెరిగింది. ఇటీవల 4 అయిందని, త్వరలో 3 కానున్నదని నీతి ఆయోగ్ వారు చెప్తున్నారు. ప్రజల జీవితానికి సంబంధించి మాత్రం రూపాయి విలువ ఏడాదికి 2.22 శాతం చొప్పున పడిపోతున్నది.
అందువల్ల మారకం ప్రతిభ ఆర్థికవ్యవస్థకు సంబంధించి కాదు. రాజకీయాలకు సంబంధించింది. ప్రజల జీవితాలతో నిమిత్తం గల రూపాయి మారకం, పలు విధాలైన ప్రపంచ ర్యాంకులు ఎట్లున్నా, మోదీ రాజకీయ జీవితానికి సంబంధించి మాత్రం అంతా సజావుగా సాగుతున్నది. పరిస్థితులను తనకు అనుకూలంగా మారకం చేసుకొనే రాజకీయ ప్రతిభను ఆయన గొప్పగా ప్రదర్శిస్తున్నారు. ఆ విధమైన మారకపు ప్రతిభ తను మొదటిసారి ఎన్నికైన 2014 నుంచి, ప్రస్తుతం పహల్గాం టెర్రరిస్టు దారుణం, పాకిస్థాన్‌పై దాడి వరకు అడుగడుగునా కనిపిస్తుంది. అదెట్లాగో ఒక్కొక్కటిగా చూద్దాం.
2014 లోక్‌సభ ఎన్నికల సమయానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ కూడా చాలా అప్రతిష్ఠ పాలై ఉన్నాయి. అవినీతి, ధరలు, నిరుద్యోగం, అసమర్థ పాలన, వ్యవసాయరంగ సమస్యలు అప్రతిష్ఠకు కారణమయ్యాయి. పదేండ్ల పాలన (2004-14)లో మన్మోహన్ ప్రభుత్వం కొన్ని మంచి పనులు చేసినా, ఎన్నికలు వచ్చేసరికి అవి మరుగున పడి, ఈ వైఫల్యాల వల్ల కాంగ్రెస్ ఓడిపోయింది. అనగా, అప్పటి పరిస్థితుల్లో ఆ పార్టీ పరాజయం ఒక అనివార్య స్థితి. ఆ పరిస్థితుల మధ్య మోదీ నాయకత్వాన బీజేపీ గెలిచింది. అదే సమయంలో, అందుకు సమాంతరంగా, మోదీ బృందపు మారకం చాతుర్యాలు ముందుకువచ్చాయి. ఆ ప్రకారం, ఒక పార్టీగా బీజేపీ కన్న ఒక వ్యక్తి మాత్రపు నాయకునిగా, అంతా తన వ్యక్తిగత ప్రతిభా సామర్థ్యాలు మాత్రమే అన్నట్టుగా మోదీ తనను తాను దేశం ఎదుట నిలబెట్టుకున్నారు. రకరకాల సరికొత్త ప్రచార వ్యూహాలతో ఆయన బృందం కూడా అదే పనిచేసింది.
గుజరాత్ ముఖ్యమంత్రిగా తను ఎన్నెన్నో అద్భుతాలు సాధించి ఎంతో గొప్ప పాలనను అందించానని, ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లుతుండగా రాష్ట్రం అపూర్వమైన అభివృద్ధిని సాధించిందని, అవినీతి, నిరుద్యోగం మచ్చుకైనా లేకుండా పోయాయని, అది గుజరాత్ మోడల్ అని, అది దేశానికి వర్తింపజేస్తామని హోరెత్తించారు. ఆ విధంగా రాజకీయ మారకం అంతా బీజేపీ కేంద్రంగా కాక, మోదీ కేంద్రీకృతంగా సాగింది. ఆ ధోరణి గత రాజకీయాల కంటె భిన్నమైనదిగా బీజేపీకి, సంఘ్ పరివార్‌కు అర్థమైనప్పటికీ, కాం గ్రెస్‌ను ఓడించి అధికారానికి రావటం ప్రధానం గనుక అదే పద్ధతిలో ముందుకు నడిచారు.
ఎన్నికల అనంతరం జాగ్రత్త పడజూశారు గానీ, మోదీ మారకం విలువ అప్పటికే బాగా పెరిగిపోయింది. వాస్తవానికి మోదీకి తన గుజరాత్ హయాంలోనే తన ప్రయోజనాల కోసం అవసరమైతే పార్టీ సీనియర్లను, చివరికి సంఘ్ పరివార్‌ను సైతం ధిక్కరించగలడనే పేరున్నది. అధికారం కోసమని, పరివార్ వైపు నుంచి మోదీతో రాజీలు పడిన రికార్డు కూడా ఉన్నది. సరిగా ఈ స్థితి 2014 తర్వాత జాతీయస్థాయికి బదిలీ అయింది. ఆయనను గుజరాత్లో అడ్డుకోలేకపోయిన పార్టీ పెద్దలు, పరివార్ పెద్దలు జాతీయస్థాయిలోనూ ఆ పని చేయలేకపోయారు.
వ్యక్తికన్న సంస్థలు, సిద్ధాంతాలు ముఖ్యం గనుక, ముఖ్యమని భావించే సంస్కృతీ సంప్రదాయాలు ఉన్నవారు అయినందున, మోదీ కొత్త ధోరణులను నియంత్రించాలని, సంస్థదే పైచేయిగా కొనసాగించాలని కొన్ని ఆలోచనలైతే సాగాయి గాని విఫలమయ్యాయి. అందుకు ఒక కారణం మోదీ బలిమి, పార్టీని అధికారంలోకి తేగల శక్తి, మారకం విలువ ప్రతిభ కాగా, మరొక కారణం పైన పేర్కొన్న సంస్థల బలహీనతలు, ఏదో విధంగా గెలిస్తే అధికారాన్ని ఉపయోగించి హిందూత్వ పథకాన్ని ముందుకు తీసుకుపోవచ్చుననే ఆశాభావాలు.
ఈ స్థితి కొంత వాజపేయి-అద్వానీ దశలోనూ ఉండేది. వాజపేయిది ఒక మేర స్వతంత్ర ధోరణి అయినా, తనకు మోదీకి ఎంతో తేడా ఉంది. వాజపేయికి సంబంధించి, పరిపాలన సజావుగా సాగాలన్నా, దేశ వైవిధ్యతను కాపాడుకోవాలన్నా సంఘ్ పరివార్ నుంచి కొంత స్వతంత్ర ప్రతిపత్తి అవసరమని, అట్లాగే హిందూత్వ అజెండాను వేగంగా ముందుకు తోయటం వల్ల సమస్యలు ఎదురవుతాయన్నది ఆయన వైఖరి. ఆ కారణంగా పరివార్‌కు తన పట్ల కొంత అసంతృప్తి కూడా ఉండేది. అయినప్పటికీ ఆయనకు ఆ వెసులుబాటు కల్పించారు. ప్రస్తుత చర్చకు సంబంధించి ముఖ్యంగా గమనించవలసింది ఏమంటే, మోదీ వలె వాజపేయి ఎప్పుడు కూడా పరిస్థితులను, సంస్థను తన కోసం ఉపయోగించుకునే మారకపు విద్యను ప్రదర్శించలేదు.
మోదీ మారకపు విలువ 2019లో రెండవసారి మరింత ఘనంగా గెలవటంతో ఆకాశానికి పెరిగిపోయింది. ఆ వివరాలన్నీ ఇక్కడ అవసరం లేదుగాని, మూడవ ఎన్నిక (2024)లో ఎదురుదెబ్బల వల్ల కొంత అడ్డుకట్ట పడింది. పరివార్ తోడ్పాటులేకున్నా తాము దిగ్విజయం సాధించగలమన్న మోదీ బృందపు ఎన్నికల ముందు నాటి ధీమా దెబ్బతినటంతో సంఘ్ పరివార్ ఆనందించింది. నాగపూర్‌లో మోహన్ భాగవత్ అసాధారణ ప్రసంగం, దానిని అంతే అసాధారణమైన విధంగా బహిరంగపరచటం, ఆ తర్వాత కాలంలో మోదీ బృందం కొంత అణకువగా మారటం తెలిసినవే. ఆ అణకువ తర్వాత వారి ప్రవర్తనతో పాటు, అనంతర కాలపు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కన్పించింది.
ఇంతకూ మోదీ మారకపు విలువ విద్యలు 2014 తర్వాత 2019లోనూ పనిచేసి 2024 వచ్చేసరికి ఎందుకు చేయనట్టు? ఈ మధ్యకాలంలో గమనించదగ్గవి రెండు కనిపించాయి. 2014లో అట్టహాసంగా ప్రజలకు హామీ ఇచ్చినట్టు ధరల నియంత్రణ, ఉద్యోగ ఉపాధుల కల్పన, అవినీతి అదుపు, పరిపాలన మెరుగుదల వంటివేమీ అంతగా జరగలేదు. కనీసం ప్రజలను మెప్పించే స్థాయిలో. ఆ విధంగా చూసినప్పుడు, 2024 నాటి ఎదురుదెబ్బలు 2019లోనే తగలవలసింది. కానీ ఆయన ఆ ప్రమాదాన్ని నివారించేందుకు ఒక మార్గం ఎంచుకున్నారు. అది హిందూత్వ మార్గం. అది ఒకవైపు పరివార్ లక్ష్యాలకు, మరొకవైపు, మోదీ అధికారం పదిలమయేందుకు ఉభయతారకంగా ఉపయోగపడింది.
భారతదేశంలో అధిక సంఖ్యాకులు హిందువులు. వారిలో అత్యధికులు తమ మత సంప్రదాయాలను అనుసరించేవారే. కానీ, అందులో పరివార్ కోరుకునే మతతత్వ దృష్టిగలవారు తక్కువగా ఉంటారు. బీజేపీకి ఓటు వేసే వారిలో ఎక్కువ మందికి తమ జీవిత సమస్యల లౌకిక దృష్టి ప్రధానమవుతుంది. మొదటినుంచి లౌకికవాద మధ్యేమార్గవాదిగా పేరున్న కాంగ్రెస్, అదేవిధమైన ఇతర పార్టీలు పరిపాలనలో వరుసగా విఫలమవుతుండినందున ఆ ఓటర్లు క్రమంగా, బీజేపీ వైపు మళ్లటం మొదలైంది.
అదొక కారణం కాగా, హిందూ విశ్వాసాల నుంచి హిందూత్వ భావనల వైపు మొగ్గుతుండిన వారి మద్దతు మరొక కారణం అయి బీజేపీని గెలిపించసాగాయి. తర్వాత, బీజేపీ పాలన కూడా అసంతృప్తికరంగా ఉండటంతో ప్రజలు వ్యతిరేకులు కాసాగారు. అది గ్రహించిన మోదీ, సాధారణ స్థాయి హిందూ మత విశ్వాసాలు మాత్రమే గలవారిని హిందూత్వ భావనల వైపు కదిలించే ప్రయత్నాలు ఇంకా ముమ్మరం చేశారు. ప్రధానమంత్రి స్థానంలో ఉన్నందున మోదీ వైపు నుంచి ఇది ప్రత్యేకంగా కన్పించింది. తక్కిన విషయాలు ఎట్లున్నా వ్యక్తిగతంగా తన అధికారం కొనసాగేందుకు అది అవసరం.
ఆ విధంగా ఆయన సాధారణమైన హిందూ మత భావనలను హిందూత్వ భావనలుగా మారకం చేసేందుకు ప్రయత్నించి తగిన మేర సఫలమయారు. ఇంకా అవుతున్నారు కూడా. అదే సమయంలో ఒకటి అంగీకరించాలి. ప్రతిపక్షాల వైఫల్యాలు సైతం అందుకు కారణమవుతున్నాయి. అంతిమ విశ్లేషణలో మాత్రం, పరిస్థితులు ఏవైనా, ఏ విధంగా సహకరించినా, హిందూ భావనలను హిందూత్వ భావనలుగా మారకం చేయటంలో మోదీ సఫలమవుతూ వస్తున్నారు. ఇది 2019 ఎన్నికల సమయానికి బాగా కనిపించింది. 2024 నాటికి కొంత వెనుకంజ వేసినా, ఆ తర్వాతి అసెంబ్లీ ఎన్నికలకు తిరిగి పుంజుకుంది.
ఇప్పుడు తాజాగా పహల్గాంలో టెర్రరిస్టు దురంతం, ఆ దరిమిలా పాకిస్థాన్‌తో పరిమిత యుద్ధం ప్రజలలో సహజంగానే దేశభక్తి భావనలను ఉప్పొంగేట్టు చేశాయి. జరిగిన ఘటనలను బట్టి ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో కఠినమైన చర్యలు తీసుకుంది. అందుకు ప్రజలు మోదీ ప్రభుత్వాన్ని కొనియాడారు. ఇటువంటివి జరిగినప్పుడు ఏ పార్టీ ప్రభుత్వానికైనా ఖ్యాతి లభించటం సహజం. కాని అదే సమయంలో, దేశభక్తి భావనలను హిందూత్వ భావనలుగా, తిరిగి వాటిని మోదీ వ్యక్తిగత అనుకూల భావనలుగా మారకం చేసే ప్రయత్నాలు బాగా జరుగుతున్నాయి.
రాజకీయంగా, ఇంగ్లీషు మీడియా ద్వారా. పహల్గాం ఘటన కశ్మీర్ సమస్యతో, దేశ అంతర్గత భద్రతతో, పాకిస్థాన్ జోక్యాలతో ముడిబడినటువంటిది. గతంలోనూ ఉండిన ఈ సమస్యను, ఇదే తరహా ఘటనలను అప్పటి ప్రభుత్వాలు అటువంటి దృష్టితో ఎదుర్కొనేందుకు ప్రయత్నించాయి. కానీ, ప్రస్తుత ప్రధాని ఆ సమస్యను దేశ భద్రత దృష్టితో ఒకవైపు ఎదుర్కొంటూనే, మరొకవైపు పైన అనుకున్న విధంగా మారకం చేస్తూ లాభపడజూస్తున్నారు. సమస్య ఏమంటే, అందువల్ల విషయం మరింత క్లిష్టంగా మారుతున్నది. మోదీకి కలిగే లాభం మాట ఎట్లున్నా.
– టంకశాల అశోక్