రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉన్న బాగ్‌లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో ఇటీవల ఫుడ్ పాయిజన్ అయి 66 మంది చిన్నారులు దవాఖాన పాలయ్యారు. కింగ్ కోఠి జిల్లా దవాఖానలో చేరిన ఆ చిన్నారులు కడుపునొప్పితో బాధపడుతుంటే ఇరవై నాలుగు గంటలైనా కనీసం వైద్య పరీక్షలు చేయలేదు. ఇంత నిర్లక్ష్యమేమిటని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించగా అధికారులు నీళ్లు నమిలారు.
మార్పుమార్పు అంటూ ఏరికోరి తెచ్చుకున్న కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ వ్యవస్థలు నిద్రావస్థలోకి చేరాయనడానికి కింగ్ కోఠి దవావఖాన ఉదంతమే ఓ ఉదాహరణ. పేదవాడికి నాణ్యమైన వైద్యమందించడంలో ప్రభుత్వ దవాఖానలు పూర్తిస్థాయిలో విఫలమయ్యాయి. సర్కార్ వైద్యం దూరమవుతుండటంతో సొంత పైసలు పెట్టుకొని కార్పొరేట్ దవాఖానల మెట్లు ఎక్కుతున్న తెలంగాణం నేడు మన కండ్లముందు కనిపిస్తున్నది. నాడు కేసీఆర్ సర్కార్ వైద్యరంగానికి పెద్దపీట వేసి పేదవాడి చెంతకు ఉచిత వైద్యాన్ని తీసుకొచ్చింది.
బస్తీ దవాఖానలు మొదలుకొని వైద్య కళాశాలల ఏర్పాటు వరకు నాణ్యమైన వైద్యం కోసం కేసీఆర్ సర్కార్ ఎంతగానో కృషిచేసింది. ఉచితంగానే 134 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి పేదవాడి ప్రాణాన్ని నిలిపిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. కానీ, నేడు చిన్న రోగాలకు కూడా మందులు దొరక్క ప్రైవేట్ చుట్టూ తిరగాల్సిన దుస్థితి పట్టడం బాధాకరం. స్కానింగ్ మిషన్లుంటే సిబ్బంది ఉండరు.. సిబ్బంది ఉంటే యంత్రాలు పనిచేయవు. చేసేదేమీ లేక పేదలు అప్పులు తెచ్చి ప్రైవేట్ డయగ్నోస్టిక్ సెంటర్ల బాట పడుతుండ్రు.
నాటి సర్కార్ దవాఖానల్లో ప్రసవాలు పెంచేందుకు బీఆర్ఎస్ సర్కార్ కృషి చేసింది. అందులో భాగంగా కేసీఆర్ కిట్ పథకాన్ని తీసుకొచ్చి గర్భిణులకు బాసటగా నిలిచింది. పైసా ఖర్చులేకుండా కాన్పు చేసి క్షేమంగా తల్లీబిడ్డలను ఇంటికి చేర్చే బాధ్యతను తీసుకున్నది. ఆ చొరవతో పెరిగిన కాన్పుల రేట్ నేడు కాంగ్రెస్ పాలనలో అమాంతం పడిపోయింది. కేసీఆర్ కిట్‌ను నిలిపివేయడమే అందుకు కారణం. ఇదేనా ప్రజాపాలన అంటే? నేటికీ పేదల పెద్దాసుపత్రులుగా పేరుగాంచిన గాంధీ, ఉస్మానియా దవాఖానల్లో ఔషధాలు, సిబ్బంది కొరత తీవ్రంగా వెంటాడుతున్నది. ఖాళీ పోస్టులను భర్తీ చేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
గత ప్రభుత్వంలో వైద్యశాఖపై రోజుల తరబడి సమీక్షలు నిర్వహించేవారు. నేడు వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇదే కింగ్ కోఠి జిల్లా దవాఖానలో సిబ్బంది లేరని ల్యాబ్‌కు తాళం వేసుకోవడం దారుణం. గాడితప్పిన వైద్యాన్ని తీర్చిదిద్దిన కేసీఆర్‌కు జనాలు జేజేలు పలుకుతున్న తరుణంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. పేదల ఆరోగ్యంపై విషం చిమ్ముతున్నది. ఇదేనా రేవంత్ చెప్తున్న రైజింగ్ తెలంగాణ? వైద్యరంగం పూర్తిగా ఫాలింగ్ డానికి కారకులెవరు? పాలకుల నిర్లక్ష్యానికి ప్రజలను బలిచేయడం ఎంత వరకు సబబు? ఈ వ్యవస్థను సరిదిద్దకుంటే సామాన్యుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. ఈ విపత్కర సమయంలో అందరం ఒక్కటై గళమెత్తాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– రాజు పిల్లనగోయిన 96185 66638