కాంగ్రెస్ కాలనాగై తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాటేసింది. మహోజ్వల రాష్ర్టాన్ని దివాలా తీయించింది. రెండున్నరేండ్లలో ఎక్కడా కొత్త పథకం లేదు, కొత్త ప్రాజెక్టు లేదు. కానీ మూడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు అయింది. అభివృద్ధి అనేది కనపడనప్పుడు మరి ప్రభుత్వం తెచ్చిన అప్పు పైసలు ఏమయ్యాయి? ఎవరి పాలయ్యాయి? ఈ ప్రశ్నలు తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి పీసీసీ అధ్యక్షుడు, నేటి సీఎం రేవంత్‌రెడ్డి అడ్డగోలుగా ప్రచారం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై తప్పుడు లెక్కలు చెప్పారు. ఒకసారి ఎనిమిది లక్షల కోట్లు అని, మరొకసారి పది లక్షల కోట్లు అని, కాదు కాదు.. తొమ్మిది లక్షల కోట్లు అని ఇలా నోటికి ఎంత వస్తే అంత చెప్పుకొంటూ తిరిగారు. సరే..ఈయన మాటలకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? వారికి ఆర్బీఐ, కాగ్, కేంద్ర ప్రభుత్వం ఏమైనా అధికారిక లెక్కలు ఇచ్చాయా? వాటి ఆధారంగా కాంగ్రెస్ నాయకులు లెక్కలు చెప్పారా? అంటే అది కూడా లేదు. పోనీ ఇలా ప్రచారం చేసిన బీజేపీ గానీ, ఇతర పార్టీలు ఏమైనా అధికారిక లెక్కలు చెప్పాయా? అంటే ఆ పని ఒక్కటంటే ఒక్క రాజకీయ పార్టీ చేయలేదు. ఈ ప్రచారాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. వేలెత్తి చూపటం తేలిక, కానీ మోస్తే గానీ భారం తెలియదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరింది. అనాటి తెలంగాణలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. చుట్టూ సమస్యల వలయం. చుట్టుముట్టిన గాడాంధకారం. పంటలకు నీళ్లు లేక, కరెంట్ లేక, సాగుబడి లేదు. ఈ సమస్యలన్నీ ఒక వైపు ఉంటే, ఇంకోవైపు ఆంధ్రా పెత్తందారులు, పెట్టుబడిదారుల సూటిపోటి మాటలు, హేళనలు, అవమానాలు.
దీనితోపాటు అదనంగా ఆంధ్రప్రదేశ్‌తో విడిపోతూ వారసత్వంగా వచ్చిన అప్పు రూ.77,694 కోట్లు. ఒకటా రెండా ఇలా చెప్పుకొంటూ పోతే, చెప్తే రామాయణం, వింటే భారతం అన్నట్టు అనేక సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో విలయతాండవం చేశాయి. ఇలాంటి దుస్థితిలో తెలంగాణను పరిపాలించే ఒక గొప్ప అవకాశం ప్రజలు కేసీఆర్‌కు అప్పగించారు. రాష్ర్టాన్ని అభివృద్ధి బాట పట్టించే గురుతరమైన బాధ్యతను నెత్తిన పెట్టుకొని, రాష్ర్టాన్ని కేసీఆర్ మహోన్నతంగా తీర్చిదిద్దారు. ఆటుపోట్లు ఎదురైనా వెనక్కి తగ్గలేదు.
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. ప్రజలు తాగునీటి కోసం కష్టాలు పడకుండా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడికలు తీయించి గ్రామాలు, పట్టణాల్లో నీటి ఎద్దడి తీర్చారు. కొత్తగా 1,250 చెక్‌డ్యామ్‌లు కట్టించారు. నీరు వృథా కాకుండా నిలువ ఉంచారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భూగర్భ జలాలు 4.4 మీటర్లకు పెరిగింది.
మార్చి, ఏప్రిల్, మే మధ్య మండుటెండల్లో కూడా చెరువులు నిండుగా గలగలా పారాయి. వరి ఉత్పత్తిలో, తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థాయిలో నిలిచింది. 24 గంటల ఉచిత విద్యుత్తు రైతుల పాలిట వరమైంది. ఐటీ ఎగుమతులు విలువ వేల కోట్ల నుంచి లక్షల కోట్లకు ఎగ బాకింది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. చీకటిని చీల్చుకుంటూ, గాడాంధకారాన్ని బద్ధలుకొడుతూ, ఒక్కో ఇటుక పేర్చుకుంటూ తెలంగాణను మరింత కొత్తగా, మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దటం కోసం అవిశ్రాంతంగా శ్రమించారు కేసీఆర్.
బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్ల పాలనలో చేసిన అప్పు దాదాపు రూ.4.17 లక్షల కోట్లు. సమైక్య రాష్ట్రం నుంచి వారసత్వంగా వచ్చిన అప్పు రూ.77 వేల కోట్లు. కేసీఆర్ చేసిన అప్పుతో కాళేశ్వరం, మిషన్‌భగీరథ, మిషన్ కాకతీయ, పింఛన్ పెంపు, స్త్రీ,శిశు సంక్షేమం, కొత్త జిల్లాలకు కలెక్టరేట్లు, ఎస్పీ భవనాలు, కమిషనరేట్లు, బస్తీ దవాఖానలు, సూపర్ స్పెషాలిటీ దవాఖానలు… ఇలా చెప్పుకొంటూ పోతే పెద్ద జాబితా అవుతుంది. రాష్ట్ర ప్రజలకు దివిటీగా మారి వెలుగునిచ్చారు కేసీఆర్. సవాళ్లను అధిగమించి సత్తా చాటారు. ప్రస్తుత ముఖ్యమంత్రిలా ఏడుపులు, పెడబొబ్బలు పెట్టలేదు. తెలంగాణ పరువును బజారులో పెట్టలేదు. అప్పు పుట్టట్లేదు అని అబద్ధాలు చెప్పలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.3,47,294 కోట్లు అని సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. మరి మార్కెట్లో అప్పు పుట్టడం లేదు అని ప్రజలకు ఎందుకు చెప్పారో సమాధానం చెప్పాలి. మనల్ని ఎవరూ నమ్మట్లేదు అని ప్రజలకు అవాస్తవాలు చెప్పి ఎందుకు నమ్మించారో కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది. ఇంకో ప్రధానమైన విషయం ఏమిటంటే అప్పు తెచ్చిన మూడున్నర లక్షల కోట్ల రూపాయలు ఏమయ్యాయి!?
ఎవరి పాలయ్యాయి? ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? ఉద్యోగుల బకాయిలు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు అలాగే ఉన్నాయి. కొత్తగా ఒక్క ప్రాజెక్టు నిర్మాణానికి పునాది వేసిందీ లేదు. ఏదైనా సాగునీటి ప్రాజెక్టు మొదలు పెట్టిందీ లేదు. తాగునీటి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందీ లేదు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఇవ్వలేదు. కొత్తగా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ప్రవేశ పెట్టలేదు. ఒక్కటంటే ఒక్క పనీ చేసింది లేదు. మరి.. చేసిన అప్పు ఏమైంది. చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది.
– గౌతంప్రసాద్ నింబూరి