తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతుబీమా, రైతుబంధు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, పంట రుణాల మాఫీ, గోదాముల నిర్మాణం, ఇన్పుట్ సబ్సిడీలతో పాటు పంట పొలాలకు నీళ్ళందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. పాలమూరు, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతులు అనేక ఇక్కట్లకు గురయ్యారు. రైతుల ఆత్మహత్యల వార్త లు రోజూ పత్రికల్లో చూస్తుండేవాళ్ళం. కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయరంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి వ్యవసాయాన్ని బలోపేతం చేశారు. దీంతో తెలంగాణలో భూముల విలువ పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో ఒక ఎకరం భూమి అమ్మి తే ఆంధ్రాలో పది ఎకరాలు కొనే పరిస్థితి ఏర్పడింది. ఇలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు దీర్ఘకాలిక లక్ష్యాలను సాధిస్తూ రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నది.
గడిచిన తొమ్మిదేండ్లలో వరి సాగు విస్తీర్ణం 97 శాతం పెరిగింది. 2014లో 49,63,068 ఎకరాల్లో వరి సాగవగా, 2023 ఆర్థిక సంవత్సరానికి అది 97,97,797 ఎకరాలకు పెరిగింది. అలాగే పత్తి, కంది పంటల సాగు విస్తీర్ణం 10, 19 శాతానికి పెరిగాయి. సమైక్య రాష్ట్రంలో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు సకాలంలో అందుబాటులో లేక రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. అది గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తాను రూపొందించిన వ్యవసాయ ప్రణాళికలో భాగంగా రైతులకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను వ్యవసాయ శాఖ వేసవి కాలంలోనే తెప్పిం చి గ్రామ స్థాయిలో అందుబాటులో ఉంచుతున్నది. వాటిని నిల్వచేసి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు రాయితీ మీద పంపిణీ చేస్తున్నది.
ప్రభుత్వం అన్ని స్థాయుల్లో వ్యవసాయశాఖను క్రమబద్ధీకరించి రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులను అందించి వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించింది. సమైక్య రాష్ట్రంలో భూ యాజమాన్య హక్కులపై స్పష్టత లేక అనేక వివాదాలు జరిగేవి. తెలంగాణ ఏర్పడ్డాక, సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకొని గ్రామస్థాయి నుంచి భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టి ఎవరి భూమి పట్టాలు వారికి ఇప్పించారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా గ్రామీణ స్థాయిలో ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రాష్ట్రంలో దాదాపు 94 శాతం భూ ముల మీద హక్కుదారులకు స్పష్టత వచ్చేలా చేశారు. ఈ వివరాల ఆధారంగానే ధరణి ద్వారా కొత్త పాస్ బుక్కులను మంజూరు చేశారు. దీంతో పంట పెట్టుబడికి ఇచ్చే రైతుబంధు పథకం పకడ్బందీగా అమలై అన్ని వివాదాలకు తెరపడింది.
భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల పంట పెట్టుబడికి రైతుబంధు పథకం అమలవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం 2018 నుంచి 2023 వరకు 11 విడుతలుగా రైతులకు రూ.72,910 కోట్లు పంట పెట్టుబడిగా అందజేసింది. రైతుబంధు పథకం ఐక్య రాజ్య సమితి ప్రశంసలు కూడా పొంద డం గమనార్హం. ఇక రైతుబీమా విషయానికి వస్తే 65 లక్షల మంది రైతులలో 18-65 ఏండ్ల మధ్యనున్న 50 లక్షల మంది రైతులు బీమాకు అర్హత పొందారు. ఈ పథకం ప్రారంభమైన దగ్గరి నుంచి ఇప్పటివరకు రూ.5,388.38 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియంగా చెల్లించింది.
ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోతలతో రైతులు పడ్డ ఇక్కట్లను చూసిన సీఎం కేసీఆర్ రాష్ట్రం ఏర్పాటయ్యాక వ్యవసాయానికి 24 గంటలూ ఉచిత విద్యుత్ ఇచ్చి రైతుల కష్టాలు తీర్చారు. సమైక్య రాష్ట్రంలో 19 లక్షల వ్యవసాయ మోటార్లుండగా 2023 నాటికి మరో 8 లక్షల వ్యవసాయ మోటార్లకు కనెక్షన్లు మంజూరు చేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో లక్ష రూపాయల వరకు రుణం తీసుకున్న 35,31,913 మంది రైతులకు రూ.16,144.48 కోట్లను నాలుగు విడుతల్లో మాఫీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు ఈ ఏడాదికి గాను రూ.1741.91 కోట్ల రుణాలను ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మంజూరు చేసింది.
సాగునీటి ప్రాజెక్టుల విషయానికి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును మూడున్నరేండ్లలో నిర్మించింది. నేడు కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నదిని 250 కిలోమీటర్ల మేర జీవధారగా మార్చింది. దాదాపు 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును అభివృద్ధి చేసింది. ఒకప్పుడు నీళ్ళు లేక అల్లాడిన తెలంగాణలో నేడు దాదాపు 20 రిజర్వాయర్లు నీళ్లతో కళ కళలాడుతున్నాయి. సాగునీటి విధానంపై సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన విధానాలు సఫలీకృతమై 70 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. రానున్న రెండేండ్లలో మరో 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
దక్షిణ తెలంగాణ వరప్రదాయిని పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం…ఈ ప్రాజెక్టు మూలంగా నాగర్కర్నూల్, మహబూబ్నగర్, నారాయణ పేట్, రంగారెడ్డి, వికారాబాద్,నల్గొండ జిల్లాలకు సాగునీరు, తాగునీరు కొరత తీరనున్నది. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మూడు పంపు హౌస్ లలో 145 మెగావాట్ల భారీ సామర్థ్యం కలిగిన తొమ్మిది పంపులను ఏర్పాటు చేసింది. ఏదుల పంపుహౌస్ దగ్గర ఆసియాలోనే అతి పెద్ద సర్జ్పూల్తో పాటు 67.67 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల ఆరు రిజర్వాయర్లను నిర్మించింది. ఈ ప్రాజెక్టు కింద 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు,1200 గ్రామాలకు తాగునీరు అందనున్నది. ఈ నెల 16 న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.