అగ్రరాజ్యాల ఆధిపత్యం ఇంకెన్నాళ్లు?
పశ్చిమాసియాలో రగులుతున్నది యుద్ధం మాత్రమే కాదు - బీటలు వారుతున్న ప్రపంచ పరిపాలనా వ్యవస్థకు ప్రత్యక్ష సాక్ష్యం. గాజా నుంచి లెబనాన్ వరకు, ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ వరకు, ఆసియా నుంచి అమెరికా వరకు విస్తరించిన ఈ పరిణామాలు ఒక కీలకమైన ప్రశ్నను సంధిస్తున్నాయి.
పశ్చిమాసియాలో రగులుతున్నది యుద్ధం మాత్రమే కాదు – బీటలు వారుతున్న ప్రపంచ పరిపాలనా వ్యవస్థకు ప్రత్యక్ష సాక్ష్యం. గాజా నుంచి లెబనాన్ వరకు, ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ వరకు, ఆసియా నుంచి అమెరికా వరకు విస్తరించిన ఈ పరిణామాలు ఒక కీలకమైన ప్రశ్నను సంధిస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థలు అంతర్గత కారణాల వల్ల నిర్వీర్యమయ్యాయా?, అగ్రరాజ్యాల ఆధిపత్య ధోరణులకు బందీలైపోయాయా?ఈ రెండింటిలో ఏది నిజమైనా ప్రమాదకరమే. ప్రపంచదేశాల భద్రత, క్షేమం దృష్ట్యా తక్షణమే అరికట్టవలసిన పరిణామం ఇది.
ఐక్యరాజ్యసమితి వంటి సంస్థల పనితీరును ప్రస్తుత యుద్ధవాతావరణం నేపథ్యంలో పరిశీలించాలి. ఇటీవలి ఉద్రిక్తతలు ఒక విషవలయాన్ని సృష్టిస్తున్నాయి. అమెరికా ఇరాన్‌పై చేపట్టిన దాడులను ‘ముందస్తు ఆత్మరక్షణ చర్యలు’గా సమర్థించుకుంటున్నది. సమాధానంగా ఇరాన్ క్షిపణి దాడులకు దిగింది. ప్రతిగా ఇరాన్‌తో పాటు గాజా, లెబనాన్ ప్రాంతాలపై ఇజ్రాయెల్ తీవ్రమైన సైనికచర్యలకు పాల్పడుతున్నది. ఇలా చర్యప్రతిచర్యల పరంపర సుదీర్ఘకాలం కొనసాగుతూ ఆ ప్రాంతాన్ని మరింత అస్థిరత వైపు నెడుతున్నది. ఈ ఘర్షణల్లో పాల్గొనే ప్రతి దేశమూ ఐక్యరాజ్యసమితి ప్రకటన పత్రంలోని 51వ అనుచ్ఛేదం పరిధిని తనకు తానుగా విస్తరించుకుంటూ, తన చర్యలను సమర్థించుకుంటున్నది.
ఆత్మరక్షణకు వెసులుబాటు కల్పించే ఈ సడలింపును, తన దాడికి చట్టబద్ధత చేకూర్చే సాధనంగా వాడుకుంటున్నది. ఈ చర్యలు, జెనీవా ఒప్పందాల ప్రాతిపదికగా రూపుదిద్దుకున్న అంతర్జాతీయ మానవతా చట్టంలోని కొన్ని ప్రాథమిక కట్టుబాట్లకు కూడా విరుద్ధంగా ఉన్నాయి.
‘ప్రొపోర్షనాలిటీ’, అంటే – అవసరానికి మించిన బలప్రయోగం చేయకుండా ఉండటం; ‘డిస్టింక్షన్’, అంటే – పౌరవసతులను యుద్ధపరిధి నుంచి మినహాయించడం వంటి మౌలిక సూత్రాల అమలుపై జటిలమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అయినప్పటికీ, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ న్యాయస్థానం, అంతర్జాతీయ నేర న్యాయస్థానం వంటి సంస్థలు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడంలో చొరవ చూపడం లేదు.
ఈ ఘర్షణలు ఆయా దేశాల్లో మానవతా సంక్షోభాన్ని సృష్టించడం మాత్రమే కాదు, వివాదంతో ఏమాత్రం సంబంధం లేని దేశాలపై కూడా ఒత్తిడి తెచ్చి, యుద్ధపరిధిని విస్తృతం చేసే అవాంఛనీయ పోకడలకు దారితీశాయి. హొర్ముజ్ జలసంధి వంటి కీలక రవాణామార్గాలను లక్ష్యంగా చేసుకోవడం – ప్రపంచ దేశాల ఇంధన భద్రతకు, ఆర్థిక స్థిరత్వానికి సవాలుగా మారింది. ఇందులో కూడా అంతర్జాతీయ సంస్థల ఆలసత్వం స్పష్టంగా కనబడుతున్నది. ఈ సందర్భంలో, ప్రపంచ శాంతి పరిరక్షణకు బాధ్యత వహించవలసిన వ్యవస్థల పాత్రపై సహజంగానే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
1945వ సంవత్సరంలో ఏర్పడిన ఐక్యరాజ్యసమితి ప్రకటన పత్రంలోని 24వ అనుచ్ఛేదం ప్రకారం అంతర్జాతీయ శాంతి-భద్రతలను కాపాడవలసిన ప్రాథమిక బాధ్యత సమితిలో భాగమైన భద్రతామండలిదే. రెండో ప్రపంచ యుద్ధంలో విజేతలుగా నిలిచి, ఆ కాలంలో శక్తికేంద్రాలుగా పేరొందిన అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, ఇంగ్లాండ్ దేశాలు భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వాన్ని పొందాయి. ఏదైనా తీర్మానాన్ని నిరాకరించే ‘వీటో’ హక్కు వీటికి ఉంటుంది. ఏ ఒక్క దేశం వ్యతిరేకించినా ఆ తీర్మానం అమల్లోకి రాదు. ఒకరకంగా, ఈ ఐదింటిలో ఏ దేశమైనా, ప్రపంచంలోని ఏ దేశ భవితవ్యాన్ని అయినా శాసించగలదు.
మండలి నిష్క్రియాపరత్వానికి ఇదొక ప్రధాన కారణం. గాజా యుద్ధవిరమణ తీర్మానాలపై అమెరికా అడ్డంకులు, సిరియా అంశాల్లో రష్యాచైనా నిరాకరణ – ఇవన్నీ యాదృచ్ఛిక ఘటనలు కాదు. వ్యవస్థలోని లోపాలను శక్తిమంతమైన దేశాలు తమకు అనుకూలంగా మలచుకుంటున్న ఘటనలు. శాశ్వత సభ్యదేశాల దృక్పథం, వ్యవహారశైలిలో సారూప్యత లోపించడం కూడా అస్థిరత, ఉద్రిక్తతలకు దారితీస్తున్నది. ఉదాహరణకు, భద్రతామండలి తీర్మానం ద్వారా భారత్ అణుపరీక్షలను ఖండిస్తూ, వాటిని నిలిపివేయాలని కోరుతూ తక్షణమే కఠిన వైఖరి తీసుకున్నది. కానీ నేటి పశ్చిమాసియా సంక్షోభంలో ఆ దృఢత్వం, వేగిరపాటు కనిపించడం లేదు.
సభ్యుల్లో ఏకాభిప్రాయం ఉన్నప్పుడు భద్రతామండలి నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుంది. కానీ అందులోని సభ్యుల పరస్పర ప్రయోజనాలు ఢీకొన్నప్పుడు అది తన కార్యశీలతను కోల్పోతున్నది. తద్వారా, భద్రతామండలి క్రమంగా శాశ్వత సభ్యదేశాల స్వలాభాపేక్ష కోసం ప్రపంచదేశాల ప్రయోజనాలను పణంగా పెట్టే వ్యాపారసంస్థలా మారింది.
ఇదే సమయంలో ఐక్యరాజ్యసమితికి నిర్ణయాలను తీసుకోగలిగే అధికారమే కానీ, వాటిని అమలు పరచగలిగే స్వతంత్ర వ్యవస్థ లేదు. ఆర్థిక స్వావలంబన కూడా లేదు. మనుగడ కోసం కొన్ని పెద్ద దేశాలపై అధికంగా ఆధారపడవలసి వస్తున్నది. ఇవన్నీ సమితి స్వతంత్రత, నిష్పాక్షికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఎనిమిది దశాబ్దాల క్రితం రూపుదిద్దుకున్న భద్రతామండలి నిర్మాణం, నేటి ప్రపంచ స్థితిగతులను ప్రతిబింబించడంలో విఫలమవుతున్నది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం, ఆ దేశాల్లో అసంతృప్తిని పెంచుతున్నది. అందుకే భారత్ సహా అనేక దేశాలు ఎంతోకాలంగా భద్రతామండలి విస్తరణను కోరుతున్నాయి.
భారత్ తన జనాభా, ఆర్థికసామర్థ్యం, సైనికపాటవం, దక్షిణ సూడాన్‌లోని UNMISS, కాంగోలోని MONUSCO వంటి శాంతి పరిరక్షణ దళాల్లో చేసిన గణనీయమైన సేవల ఆధారంగా మండలిలో శాశ్వత సభ్యత్వం కోరుతున్నది. భద్రతామండలిని ఒక నిష్పాక్షికమైన వ్యవస్థగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో భాగంగా – బ్రిక్స్, ఏసియాన్, అరబ్ లీగ్, నాటో, సార్క్ వంటి పరిణితి చెందిన, ప్రాంతీయ-లక్ష్య సారూప్యత కలిగిన దేశాల సమూహాలకు అందులో ప్రాతినిధ్యం కల్పించడం ఒక ప్రత్యామ్నాయం.
అయితే, ఆ విధానం కూడా సరికొత్త సమీకరణాలు, అంతర్గత విభేదాలను సృష్టించే ప్రమాదం ఉన్నది. ఏ నమూనా ఏకపక్ష ధోరణులను నిజంగా తగ్గించగలదు? అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. ఈ సమస్యను పరిష్కరించాలంటే, భద్రతామండలి సంస్కరణలపై స్పష్టమైన రాజకీయ సంకల్పం, విస్తృతస్థాయి మేధోమథనం, కాలబద్ధమైన నిర్దిష్ట చర్యలు తప్పనిసరి.
ఈ దిశగా, కేవలం సభ్యత్వ విస్తరణ సరిపోదు. మరింత క్రియాశీలకమైన పునర్వ్యవస్థీకరణ తక్షణావసరం. అందులో భాగంగా వీటో హక్కు వినియోగంపై శాశ్వతసభ్యదేశాలకు ప్రస్తుతం ఉన్న విస్తృతాధికారాలపై కత్తెర వేసే దిశగా కృషి జరగాలి. మానవతా సంక్షోభం ఏర్పడిన సందర్భాల్లో సభ్యులందరి అభిప్రాయం మేరకు నిర్ణయాలు తీసుకోవాలి, శాశ్వతసభ్యదేశాలకు పరిమితం కాకూడదు. సమితిని ఆర్థికంగా బలోపేతం చేసి, తన మనుగడ కోసం అగ్రరాజ్యాలపై ఆధారపడే విధానానికి స్వస్తి పలకాలి. ఈ సంస్కరణలు సరళంగా, హేతుబద్ధంగా కనబడినప్పటికీ, ఆచరణలో అనేక అడ్డంకులు ఎదురవుతాయి. అగ్రరాజ్యాలు సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న తమ ఆధిపత్యాన్ని స్వచ్ఛందంగా పరిమితం చేసుకునే నిర్మాణాత్మక వైఖరిని అవలంబిస్తేనే, సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతాయి.
ఈ సందర్భంలో, భారతదేశం 1954వ సంవత్సరంలో ప్రతిపాదించిన పంచశీలలోని ‘దేశాల సార్వభౌమత్వాన్ని గుర్తించడం, భౌగోళిక సమగ్రతకు గౌరవం, ఇతర దేశాలపై దాడి చేయకపోవడం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం, సమానత్వం-పరస్పర లాభం, శాంతియుత సహజీవనం’ ఐదు సూత్రాలను పునరుద్ధరించ వలసిన అవసరం ఉన్నది. ఈ సూత్రాలు బాండుంగ్ సదస్సు వంటి ప్రతిష్ఠాత్మక వేదికల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో విస్తృత అంగీకారాన్ని పొంది; భారతదేశానికి విశేషమైన గుర్తింపును తెచ్చిన అలీన విదేశాంగ విధానానికి పునాదిగా నిలిచాయి.
భారత్, చైనాతోపాటు అభివృద్ధి చెందుతున్న బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు సభ్యత్వ విస్తరణతోపాటు, ప్రతిపాదిత సంస్కరణల విషయంలో ఏకాభిప్రాయం సాధించే దిశగా మరింత నిర్మాణాత్మకంగా కృషి చేయాలి. మొత్తానికి, పశ్చిమాసియా సంక్షోభం ప్రాంతీయ యుద్ధ స్థాయి నుంచి ప్రపంచ పరిపాలనా వ్యవస్థ జవాబుదారీతనాన్ని పరీక్షించే గీటురాయిగా మారింది. చట్టాలు ఉన్నా, అవి అమలు కాకపోతే వ్యవస్థ గాడి తప్పుతుంది. సంస్థలు ఉన్నా, వాటికి జవసత్వాలు లేకపోతే నిష్ప్రయోజనం అవుతాయి. ప్రపంచం ఇప్పుడు ఒక కీలక మలుపులో ఉన్నది – అంతర్జాతీయ వ్యవస్థను పునర్నిర్మించాలా? లేకపోతే అది క్షీణించడాన్ని చూస్తూ ప్రేక్షకపాత్ర వహించాలా?
– కృష్ణ బాలాజీ 99490 98406
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

