ఇంట్లో వేడి ఎక్కువగా ఉందా? భరించలేని ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నదా? అయితే, బాల్కనీ తోటలకు జై కొట్టాలని అంటున్నారు నిపుణులు. ఇంట్లో వేడిని తరిమేయడంలో బాల్కనీలో పెంచుకునే మొక్కలు సమర్థంగా పనిచేస్తాయని చెబుతున్నారు.
మొక్కలు వేర్ల ద్వారా పీల్చుకున్న నీటిలో.. కేవలం ఒక్కశాతం మాత్రమే వాడుకుంటాయి. మిగిలిన 99 శాతం నీటిని.. ఆకులపై ఉండే సూక్ష్మ రంధ్రాల ద్వారా ఆవిరి రూపంలో గాలిలోకి విడుదల చేస్తాయి. ఈ నీటి ఆవిరి చుట్టుపక్కల ఉండే వేడిని గ్రహించి, బాల్కనీలోని గాలి ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఇది ఇంట్లో వాడుకునే ‘ఎయిర్ కూలర్’ పనితీరులాగే ఉంటుంది. అంతేకాకుండా, కాంక్రీట్ గోడలు, సిమెంట్ ఫ్లోరింగ్.. సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహిస్తాయి. ఆ వేడిని అలాగే పట్టి ఉంచుతాయి. అందుకే, సాయంత్రం బయట చల్లగా ఉన్నా ఇంట్లో ఉక్కపోస్తుంది. ఈ ప్రభావాన్ని తగ్గించడంలోనూ బాల్కనీ మొక్కలు ముందుంటాయి. సిమెంట్ స్లాబ్‌పై, గోడల పక్కన మొక్కలను పెంచడం వల్ల.. సూర్యరశ్మిని ఆ మొక్కల ఆకులే గ్రహిస్తాయి. కాంతిని కిరణజన్య సంయోగ క్రియకు వాడుకొని.. మిగిలిన కాంతిని పరావర్తనం చేస్తాయి. అలా, కాంక్రీట్ స్లాబ్స్, గోడలు వేడెక్కకుండా అడ్డుకుంటాయి. ఇక బాల్కనీలో ఎత్తుగా పెరిగే మొక్కల్ని పెంచడం వల్ల అవి సూర్యకిరణాలు నేరుగా గదిలోకి, కిటికీలపై పడకుండా అడ్డుకుంటాయి. ఇవి ఒక రకమైన గ్రీన్ కర్టెన్లా పనిచేసి.. గది ఉష్ణోగ్రత పెరగకుండా చూస్తాయి. వివిధ పర్యావరణ అధ్యయనాల ప్రకారం.. దట్టమైన మొక్కలు ఉన్న బాల్కనీ, టెర్రస్ చుట్టుపక్కల ఉష్ణోగ్రత, సాధారణ కాంక్రీట్ ప్రాంతాల కంటే మూడు డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తక్కువగా ఉంటుంది. ఇది ఏసీపై లోడ్‌ను తగ్గించి, విద్యుత్ బిల్లు ఆదా అవ్వడానికీ సహాయపడుతుంది.
ఈ మొక్కలు బెస్ట్!
మనీ ప్లాంట్, ఇతర తీగ మొక్కలు బాల్కనీ గ్రిల్స్‌కు అల్లుకుంటాయి. ఇంటికి చక్కని నీడనిస్తాయి. అరెకా పామ్/ స్నేక్ ప్లాంట్ లాంటివి గాలిలోని తేమ శాతాన్ని సమతుల్యంగా మారుస్తాయి. గాలినీ శుద్ధి చేస్తాయి. ఇక కలబంద లాంటి మొక్కల్ని పెంచుకుంటే.. రాత్రి వేళల్లోనూ అవి ఆక్సిజన్‌ను విడుదల చేస్తూ, చుట్టుపక్కల వాతావరణాన్ని చల్లబరుస్తాయి.