Vikarabad Forest | వికారాబాద్ అడవుల్లో ఐదు దాకా నదులు ఊపిరిపోసుకుంటాయి. ఇక్కడి గాలి విశిష్టమైంది. ఆరోగ్యదాయకమైంది. అందుకే అనంతగిరిలో టీబీ శానిటోరియం నెలకొన్నది. విశిష్టమైన జీవవైవిధ్యం ఈ అడవుల చల్లని నీడలో వర్ధిల్లుతున్నది. అనంతగిరి కొండలకు అటూ ఇటూ అడవులు పరుచుకొని ఉన్నాయి. ఒకవైపు ఉన్న అడవిని దామగుండం అని, మరో వైపు ఉన్న అడవి అనంతగిరి అడవి అని పిలుస్తారు. ‘అనంతగిరికా హవా లాఖో బీమారియోంకా దవా’ అనే నానుడి అక్కడి స్వచ్ఛమైన గాలి విశిష్టతను తెలియజేస్తున్నది. మూసీ మూలాధారమైన నీటి ఊటల్లో కొన్ని దామగుండం వైపు ఉన్నాయి.
అయితే ఇప్పుడీ పర్యావరణానికి నౌకాదళ కమ్యూనికేషన్ కేంద్రం రూపంలో ముప్పు ఏర్పడుతున్నది. వికారాబాద్ అడవిని ఆనుకొని ఉన్న దామగుండం అటవీ ప్రాంతంలో నిర్మిస్తున్న వెరీ లో ఫ్రీక్వెన్సీ (వీఎల్ఎఫ్) రాడార్ కోసం భారీగా అడవులను నరికేయబోతుండటమే అందుకు కారణం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత జనవరి 24న భూమి బదిలీకి సంబంధించిన ఒప్పందం కుదిరింది. రాష్ట్ర ప్రభుత్వం రాడార్ కోసం అప్పగించిన 2,900 ఎకరాల భూమిని నేవీ తన ఆధీనంలోకి తీసుకొని సరిహద్దులు గీసే పనికి శ్రీకారం చుట్టింది. రాడార్ కేంద్రం కోసం పెద్ద ఎత్తున చెట్లను కొట్టివేయాల్సి ఉంటుంది. రోడ్ల నిర్మాణం కూడా జరుగుతుంది. రాడార్ చుట్టూరా ఓ చిన్నసైజ్ పట్టణమే వెలుస్తుందంటున్నారు. ఈ నేపథ్యంలో దామగుండం అటవీ భూముల పరిరక్షణ అంశం మరోసారి చర్చలోకి వచ్చింది.
దేశ రక్షణ కోసం కమ్యూనికేషన్స్ వ్యవస్థ లాంటివి నిర్మించడం మఖ్యమే. కానీ సదరు నిర్మాణాలు పర్యావరణానికి ముప్పు తెచ్చిపెట్టేవిగా ఉండకూడదన్నదీ అంతే ముఖ్యం. దామగుండం ప్రతిపాదన వచ్చినప్పటి నుంచీ స్థానికులు, పర్యావరణ ఉద్యమకారులు నిరసనలు తెలుపుతున్నారు. న్యాయస్థానాల్లో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. నేవీ రాడార్‌తో సుమారు 40-50 కిలోమీటర్ల పరిధిలో రేడియషన్ ప్రభావం ఉంటుందని అంటున్నారు. రాడార్ వ్యవహారంపై రాజకీయాలూ చోటుచేసుకున్నాయి. కేంద్రంలో కాంగ్రెస్ హయాంలో రాడార్ కేంద్రంపై నిర్ణయం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫైలు బయటకు తీసి హడావుడిగా స్థల కేటాయింపు జరిపింది. తీరా స్థానికుల నుంచి తీవ్ర నిరసన ఎదురైనప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంపైకి నెపం నెట్టివేసేందుకు కాంగ్రెస్ సర్కారు విఫలయత్నం జరిపింది. ఆ సంగతి అలా ఉంచితే మూసీ నది సుందరీకరణ పేరిట భారీ ప్రణాళికలు వేస్తున్న ప్రభుత్వం ఆ మూసీ జన్మస్థలమైన అడవుల విధ్వంసానికి ఎలా సిద్ధమవుతున్నదనేది ప్రశ్న.
2027లో నిర్మాణం పూర్తిచేసుకుంటుందని భావిస్తున్న దామగుండం రాడార్ కేంద్రం కోసం ఒక అంచనా ప్రకారం సుమారు 12 లక్షల చెట్లను నరికివేయాల్సి ఉంటుంది. దీనివల్ల అంతకు ఎన్నోరెట్లు పక్షులు ఆవాసం కోల్పోతాయి. నదీ మూలాల వద్ద చెట్ల నరికివేత వల్ల వరద సమస్య పెచ్చరిల్లిపోయి, జనావాసాలూ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా పలురకాల గొలుసుకట్టు చర్యకు ఈ విధ్వంసం కారణమవుతుంది. ఈ నేపథ్యంలో రాడార్ కేంద్రం వేరే చోటుకి తరలించాలనే సూచనలు వినవస్తున్నాయి. పైగా ఇక్కడ ఉపయోగించాలనుకుంటున్న సాంకేతికతకు కాలం చెల్లిందని, చాలా దేశాల్లో దీనిని పక్కన పెడుతున్నారనే వాదనలూ వినిపిస్తున్నాయి. చెట్ల నరికివేత ప్రారంభం కాకముందే ప్రకృతి, ప్రజా సంక్షేమం దృష్ట్యా రాష్ట్ర ప్రభు త్వం ఈ సమస్యపై దృష్టిపెడితే బాగుంటుంది.