సముద్రంలో తెరచాపతో నావ నడిపే నావికునికి గాలివాటాన్ని పసిగట్టి దాన్ని దరికి చేర్చే తత్వం సహజంగా ఉన్నట్టే.. సమస్య మూలాలు ఎరుకైనోడికి పరిష్కారం ఎరుకైతదట. అలాగే కొంతమందిలో నాయకత్వ లక్షణాలు సహజంగానే ఉంటాయి. అలాంటివారే విపత్కర పరిస్థితుల్లోనూ చాకచక్యంగా రాష్ర్టాన్ని ప్రగతిపథంలో నడుపుతారు. ఆ కోవకు చెందిన నాయకుల్లో కేసీఆర్ ప్రథమస్థానంలో ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుత ప్రభుత్వ పాలనను పరిశీలిస్తే ఆ విషయం ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తికావస్తున్న సందర్భంగా ఇటీవల ప్రజాపాలన విజయోత్సవాలను పాలకులు పెద్ద ఎత్తున నిర్వహించారు. గద్దెనెక్కిన ఏడాదిలోనే ఊహకందని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ప్రజా విజయోత్సవాల పేరిట ఉత్తర ప్రగల్భాలు పలికారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోని మరే రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా అభివృద్ధి చేసిందని, సంక్షేమ పథకాలు అమలుపరిచిందని, కేసీఆర్ హయాంలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని అదిరిపోయే లెవెల్లో డప్పు కొట్టుకున్నారు. కానీ, వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి.
బీఆర్ఎస్ సర్కార్ పాలనలో పదేండ్ల పాటు స్వేచ్ఛగా ఊపిరిపీల్చుకున్న తెలంగాణ మళ్లీ ఎమర్జెన్సీ రోజులను చూస్తున్నది. నాటి నిర్బం ధ కాండను కాంగ్రెస్ సర్కార్ పాలన తలపిస్తున్నది. బందూకు లేని ప్రజాస్వామిక తెలంగాణలో వెనుకటి పోలీస్ కవాతుల శబ్దాలతో తెల్లవారే రోజులు వచ్చాయి. నయా ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. హక్కుల గురించి నిలదీస్తే బెదిరింపులకు దిగుతున్నారు. పోరాడితే సస్పెండ్ చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ నియంతృత్వ రాజ్యమే. నిర్బంధ సామ్రాజ్యంలో పన్నెండు నెలల్లో రెండు భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. ఫార్మాసిటీ తమకు వద్దని చెప్పినందుకు 40 మందికి పైగా లగచర్ల గిరిజన రైతులకు సంకెళ్లు వేశారు. వారిని జైల్లో నిర్బంధించి అరిగోస పెడుతున్నారు. రైతులకు గుండెపోటు వచ్చినా కనికరించకపోవ డం దారుణం.
ఇండ్లు కోల్పోయి రోడ్డునపడ్డ బాధితుల ఆక్రోశం, ఇంటి యజమానుల ఆత్మహత్యలతో సర్వం కోల్పోయిన కుటుంబాల ఆక్రందనలు, నేతన్నల ఆత్మబలిదానాల శోకాలను వింటూ వికృతానందం పొందుతున్న పాలకుల తీరు ఉమ్మడి పాలనను గుర్తుచేస్తున్నది.
ఇదిలా ఉంటే.. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ అంటూ హైడ్రా పేరిట హంగామా చేశారు. అప్పోసొప్పో చేసి కట్టుకున్న ఇండ్లను కూల్చి బీద, మధ్యతరగతి ప్రజలను నిస్సహాయులను చేశారు. వందల కుటుంబాలను రోడ్డున పడేశారు. దిక్కుతోచక చాలామంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఎంతటి దారుణం. గూడు లేనోనికి ప్రభుత్వం గూడు కల్పించాలె. అంతేగానీ, ఉన్న గూడును చెదరగొట్టకూడదు. కూడులేనోనికి సన్నబియంతో కూడుపెట్టాలె. అంతేతప్ప, కలుషితమైన బువ్వను తినిపించి పిల్లల ప్రాణాలను బలిగొనవద్దు. గుడ్డను ప్రసాదించాలె గానీ, ఇచ్చే గుడ్డ (బతకమ్మ చీర)ను లాక్కొని నేతన్నల చావులకు కారణం కావొద్దు.
ఎన్నికల ముందు పిడికిలెత్తి మరీ గర్జించి చెప్పిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంటూ, కుటుంబ ఫంక్షన్‌ను రేవ్ పార్టీగా చిత్రీకరిస్తూ, కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తామని చెప్తూ అనవసరమైన అంశాలను తెరపైకి తీసుకొస్తూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు. తద్వారా రేవంత్ కొత్త ట్రెండ్ సృష్టించారు.
అసత్య ప్రచారాలు, అసాధ్యపు గ్యారెంటీ లు, అబద్ధపు పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అయితే, అహంకార ధోరణితో విచక్షణ కోల్పోయి గత ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని అంగీకరించకుండా, కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలుచేయకుండా, ఆరు గ్యారెంటీల ఊసెత్తకుండా కాలం వెళ్లదీస్తున్నారు. కళ్లు మూసుకొని పాలు తాగే పిల్లి తననెవరూ గమనించడం లేదని భావించే చందంగా సాగుతున్న పాలనను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. గత పదేండ్ల కేసీఆర్ పాలన ఎందరికో ఆదర్శం. తొమ్మిదేండ్లలో సాగు విస్తీ ర్ణం భారీగా పెరిగింది. 1.68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యింది. రైతులకు నాణ్యమైన ఉచిత కరెంట్‌ను కేసీఆర్ సర్కార్ సరఫరా చేసింది.
ఏటా ఎకరానికి రూ.10 వేలు పెట్టుబడిసాయం అందించింది. నిరుడు వానకాలం పంట నాటికీ సుమారు రూ.80 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమచేశారు. ఈ పథకాన్ని ఎన్నో రాష్ర్టాలు ప్రశంసించాయి. మోదీ సర్కార్ సైతం కాపీ కొట్టింది. రేవంత్ రెడ్డి కూడా రైతుబంధు స్థానే రైతుభరోసా పేరిట ఏటా ఎకరానికి రూ.15 వేలు ఇస్తానని చెప్పి మోసం చేశారు. రుణమాఫీ చేస్తానని నూటొక్క దేవుళ్లపై ఒట్టేసి మాట తప్పారు. ఇక కౌలు రైతులు, ఉపాధి కూలీల సంగతి ఎప్పు డో మర్చిపోయారు. ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసినప్పటికీ, దాని వల్ల ఆటో డ్రైవర్ల జీవితం అస్తవ్యస్తమైంది. రాబడి లేక, బతుకు భారమై ప్రజాభవన్ సాక్షి గా ఆత్మహత్యలకు పాల్పడుతుండగా, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
పథకాలు అమలు చేస్తే కేసీఆర్‌లా చేయా లి. ఆయన తీసుకొచ్చిన అన్ని పథకాలు అద్భుతమైనవే. కానీ, ప్రజలకు మంచి జరుగుతుంటే ఓర్వలేని కాంగ్రెస్.. కోడిగుడ్డుపై ఈకలు పీకినట్టు ఈ పథకాల వల్ల అధిక శాతం అనర్హులకు లబ్ధి జరుగుతున్నదని, నిధులు దుర్వినియోగమవుతున్నాయని దుష్ప్రచారం చేసింది. కానీ, కేసీఆర్ సర్కార్ పథకాల ఫలితాలు మన కండ్ల ముందే కనిపిస్తున్నాయి. రైతుబంధు వల్ల సాగువిస్తీర్ణం రెండింతలైంది, పంట దిగుబడి మూడింతలైంది. మొత్తంగా మన తెలంగాణ కోనసీమ ను మరిపించింది. అయినప్పటికీ, ఈ సంవత్సరం పంట దిగుబడి కాళేశ్వరం వల్ల రాలేద ని, కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల వల్లనే 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని రేవంత్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం విడ్డూరం. బిడ్డెవరికి పుడితే ఏంటి పేరు తనదైతే చెల్లిపాయే అనే రీతిలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఆరు గ్యారెంటీలిస్తానని చెప్పినోడిది నాలుకనా లేక తాటిమట్టనా అని తెలంగాణ ప్రజానీకం ప్రశ్నిస్తున్నది.
– ఆర్ఆర్ఆర్