మొదటినుంచీ బెదిరిస్తున్నట్టుగానే బ్రెజిల్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50 శాతం సుంకాలను విధించారు. అయితే, ట్రంప్ వైఖరిపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ లూలా ద సిల్వా ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 కోట్ల మంది జనాభా ఉన్న తమ దేశాన్ని ట్రంప్ అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని, సుంకాల బెదిరింపులతో దారికి తెచ్చుకోవాలని భావిస్తున్నారని లూలా తీవ్రంగా స్పందించారు. తాము ఈ అంశాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామని, అమెరికా పట్ల విధేయత ప్రదర్శించాల్సిన అవసరం తమకు లేదని కరాఖండిగా తేల్చిచెప్పారు. తాము ప్రతి ఒక్కరినీ గౌరవిస్తామని, ఎదుటివారు కూడా తమను గౌరవించాలని కోరుకుంటామని ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
ట్రంప్ వ్యవహారశైలి, ఆయన వైఖరి వల్ల కలుగుతున్న ఇబ్బందికర పరిస్థితులను అమెరికన్లతో పంచుకోవడానికి బ్రెజిల్ అధ్యక్షుడు లూలా తొలిసారి ‘ది న్యూయార్క్ టైమ్స్’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అమెరికాకు ఎగుమతయ్యే బ్రెజిల్ వస్తువులపై 50 శాతం సుంకాలను విధించారు. అయితే, ఈ సుంకాలు ట్రేడ్ వార్‌లో భాగంగా కాదు, రాజకీయ కారణాల వల్ల కావడం గమనార్హం. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో 2022 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, ఆ పదవిలో అక్రమంగా కొనసాగేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని ట్రంప్ కోరుతుండగా బ్రెజిల్ సానుకూలంగా స్పందించడం లేదు. ఇది అమెరికా అధ్యక్షుడి ఆగ్రహానికి కారణమైంది.
అయితే, ఈ అంశం చర్చల పరిధిలోకి రాదని లూలా చెబుతున్నారు. బహుశా బ్రెజిల్లో న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉందని అమెరికా అధ్యక్షుడికి తెలియకపోవచ్చని ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. బ్రెజిల్ సార్వభౌమాధికారం విషయంలో జోక్యం చేసుకుంటే ఊరుకోబోమని తెగేసి చెప్పారు. అమెరికా ఆర్థిక, సాంకేతిక, సైనిక శక్తి తమకు తెలుసని కానీ, బ్రెజిల్ ఒక తక్కువస్థాయి దేశంగా మరో దేశంతో చర్చలు జరుపదని చెప్పడం బ్రెజిల్ తెగువకు నిదర్శనం. అమెరికా ఎగుమతులపై ప్రతీకార సుంకాలను అధ్యయనం చేస్తున్నట్టు లూలా ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.
బహుశా ఏ ప్రపంచ నాయకుడూ లూలా లాగ ట్రంప్‌ను వ్యతిరేకించడం లేదు. లెఫ్టిస్ట్ అయిన లూలా ఈ శతాబ్దంలో అత్యంత కీలకమైన లాటిన్ అమెరికన్ రాజనీతిజ్ఞుడిగా మన్ననలు అందుకుంటున్నారు. ఆయన ప్రసంగాల్లో ఇప్పుడు ట్రంప్‌పై విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆయన సోషల్ మీడియా ఖాతాల్లో బ్రెజిల్ సార్వభౌమాధికారానికి సంబంధించిన పోస్టులే కనిపిస్తున్నాయి. అంతేకాదు, ‘బ్రెజిల్ బ్రెజిలియన్లది’ అని రాసి ఉన్న టోపీని ఆయన ధరిస్తున్నారు.
2021 జనవరి 6న అమెరికా పరిపాలనా భవనాలపై జరిగిన దాడి గనుక బ్రెజిల్లో జరిగి ఉంటే, ట్రంప్ కూడా బోల్సోనారో లాగ విచారణను ఎదుర్కొనేవారని లూలా చెప్పడం విశేషం. ఈ వ్యాఖ్యలపై వైట్ హౌజ్ స్పందించలేదు. ట్రంప్ తన మిత్రుడు బోల్సోనారోకు సహాయం చేయడానికి బ్రెజిల్‌పై టారిఫ్ విధించారు. 50 శాతం సుంకాల వెనుక ఉన్నది ఆర్థిక కారణాలు కాదు, రాజకీయ కారణాలనేది బహిరంగ రహస్యం.
ట్రంప్, బోల్సోనారో రాజకీయ జీవితాలను పరిశీలిస్తే.. వారిద్దరూ రెండోసారి వరుసగా ఎన్నికవలేదు. అంతేకాదు, ఓటమిని అంగీకరించేందుకు నిరాకరించారు. ఎన్నికల విజేతలు తమ పదవులను అలంకరించకుండా అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా వారి మద్దతుదారులు పరిపాలనా భవనాలపై దాడి చేశారు. 2023లో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారో మద్దతుదారులు ప్రభుత్వ కార్యాలయాలపై దాడి చేశారు. దీనిపై ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. బోల్సోనారో దోషిగా తేలితే ఆయన దశాబ్దాల పాటు జైలులో మగ్గాల్సి ఉంటుంది.
కేసు విచారణలో ట్రంప్ జోక్యాన్ని ఆశిస్తున్నట్టు గత జనవరిలో బోల్సోనారో చెప్పారు. ఆ సమయంలో ఆయన మాటలను ఎవరూ పట్టించుకోలేదు. అయితే, ఇప్పుడు నిజంగానే ఈ కేసులో ట్రంప్ జోక్యం చేసుకున్నారు. జూలై 9న బ్రెజిల్ అధ్యక్షుడు లూలాకు రాసిన లేఖలో బోల్సోనారోపై నమోదైన కేసు గురించి ట్రంప్ ప్రస్తావించారు. గతంలో తనపైనా ఇలాంటి కేసు నమోదైందని గుర్తుచేశారు. అంతేకాదు కేసు విచారణ జరుగుతున్న తీరును కూడా ఆయన తప్పుపట్టారు. ఈ నేపథ్యంలోనే బ్రెజిల్‌పై ట్రంప్ సుంకాలు విధించారు. బ్రెజిల్‌పై సుంకాలు విధిస్తానని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్‌లో బెదిరించడం సరికాదని లూలా పేర్కొన్నారు.
ట్రంప్ ప్రవర్తన.. చర్చలు, దౌత్యపరమైన అన్ని ప్రమాణాలను ఎప్పుడో ఉల్లంఘించిందని చెప్పారు. ‘మీకు వాణిజ్య, రాజకీయపరమైన విభేదాలు ఉంటే, సమావేశం ఏర్పాటుచేసి, మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. అంతేకానీ, సుంకాలు విధించడం, అల్టిమేటం జారీచేయడం సరికాదు’ అని లూలా స్పష్టం చేశారు. బోల్సోనారోకు సహాయం చేయడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాల వల్ల కాఫీ, మాంసం, నారింజ సహా బ్రెజిల్ నుంచి గణనీయంగా అమెరికా దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని, అందుకు అమెరికన్లు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని లూలా హెచ్చరించారు. వాస్తవానికి అమెరికా లేదా బ్రెజిల్ ప్రజలు ఆ భారం మోయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
2024 అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థి కమలా హారిస్‌కు లూలా బహిరంగంగా మద్దతు పలికారు. అయితే, జనవరిలో ట్రంప్ ప్రమాణస్వీకారానికి ముందు ఆయనకు అభినందన లేఖ పంపినట్టు కూడా ఆయన చెప్పారు. బిల్ క్లింటన్ తర్వాత ట్రంప్ మాత్రమే తనతో సత్సంబంధాలు లేని అమెరికా అధ్యక్షుడని లూలా చెప్పారు. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ట్రంప్ అందుకు సిద్ధంగా లేరని ఆరోపించారు.
అయితే, బోల్సోనారో కేసును పర్యవేక్షిస్తున్న బ్రెజిల్ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ మోరేస్ వైట్ హౌజ్‌కు లక్ష్యంగా మారారు. అణచివేత, మానవ హక్కులను ఉల్లంఘించే ఏకపక్ష నిర్బంధాలు, రాజకీయ ప్రేరేపిత కేసుల విచారణ తదితర కారణాలు చూపుతూ ఆయనపై అమెరికా ఆంక్షలు విధించింది. బోల్సోనారో కుమారుడు ఎడ్వర్డో బోల్సోనారో ఈ ఆంక్షల కోసం చాలాకాలంగా అమెరికాలో లాబీయింగ్ చేయిస్తున్నారు. ఇప్పటికే బ్రెజిల్ సుప్రీంకోర్టు ఇతర న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యుల వీసాలను అమెరికా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఒక దేశ సుప్రీంకోర్టు ఆ దేశంలోనే కాకుండా, ప్రపంచం వ్యాప్తంగా గౌరవించబడాలని లూలా స్పందించారు. అయితే, ఇరుదేశాల మధ్య తీవ్రరూపు దాల్చిన ఈ వివాదం భవిష్యత్తులో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
– ఎడిటోరియల్ డెస్క్ (‘న్యూయార్క్ టైమ్స్’ సౌజన్యంతో..)