అడుసు తొక్కనేల కాలు కడగనేల? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిని గమనిస్తుంటే ఈ సామెత గుర్తుకొస్తున్నది. తనను ఎవరో తరుముతున్నట్టుగా హడావుడిగా నిర్ణయాలు తీసుకోవడం.. పర్యవసానాలు ఆలోచించకుండా అడుగులు వేయడం.. ఎదురుదెబ్బలు తగలగానే ఉక్కిరిబిక్కిరై పోవడం.. ఆ వెంటనే దుందుడుకు మాటలతో ప్రత్యర్థుల మీద చెలరేగిపోవడం.. పరిస్థితి చేయిదాటి పోతున్నదని అనుకుంటున్న సమయంలో గత పాలకుల మీద ఎక్కుపెట్టిన కేసులను కదిలించడం.. ఇదే ఆయన పొలిటికల్ స్ట్రాటజీ!
అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటినా ఆయన ఈ బలహీనత నుంచి బయటపడలేకపోతున్నారు. ఇదే తన బలమని, ఇలాంటి గేమ్ ఆడటంలో తాను గొప్ప ప్లేయర్‌నని ఆయన భావిస్తున్నారేమో! తాను ఫుట్‌బాల్ ప్లేయర్‌నని, తన గేమ్‌ప్లాన్ తనకు ఉంటుందని అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకుడి విజయానికి పర్ఫెక్ట్ గేమ్ ప్లాన్ ఎంత ముఖ్యమో.. మంచి పరిపాలకుడిగా, పాలనాదక్షుడిగా పేరు తెచ్చుకోవడానికి అంతకంటే కఠోరమైన శ్రమ, తన మీద నమ్మకం ఉంచిన ప్రజల పట్ల నిబద్ధత, వారిని నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు నడిపించగలిగే దార్శనికత, తన టీమ్‌కు స్ఫూర్తిదాయకంగా నిలిచేలా ఉన్నత వ్యక్తిత్వాన్ని ప్రదర్శించుకునే లక్షణం కూడా అంతే ముఖ్యం. అయితే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలో అదే లోపిస్తున్నదా? అనే అనుమానం కలుగుతున్నది.
రాష్ట్ర క్యాబినెట్‌లోని ఏ మంత్రికి వ్యతిరేకంగా ఏ మీడియాలో, ఏ కథనం వచ్చినా, వెనుక ‘తమ నాయకుడే’ ఉన్నాడనే చర్చ సొంత పార్టీలోనే నడుస్తున్నదంటే బాధ్యులెవరు? క్యాబినెట్‌లోని దాదాపు సగం మంది మంత్రులు ఏదో ఒక వివాదంలో కేంద్ర బిందువులుగా మారడం, తరచూ ఐఏఎస్, ఐపీఎస్‌లు, వివిధ శాఖల ఉన్నతాధికారుల బదిలీలు జరగడం, అధికార పార్టీ గ్రూప్ రాజకీయాలకు తాము బలిపశువులుగా మారుతున్నామనే భావన అధికార యంత్రాంగంలో ప్రబలుతున్నది.
ఇదీ రాష్ట్ర పరిపాలన ఏమాత్రం సవ్యంగా లేదన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నది. ఈ పరిస్థితికి ప్రధానంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది ఇలాగే కొనసాగితే తన గేమ్‌ప్లాన్ బెడిసికొట్టి, అసలుకే ప్రమాదం వస్తుందన్న విషయాన్ని ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. అధికారంలో ఉన్నవారు తమ పొరపాట్లు, తప్పటడుగులు, తప్పిదాలు దిద్దుకోవడానికి, పాలనాదక్షుడిగా ప్రజల హృదయాల్లో ముద్ర వేసుకోవడానికి ఉండే సమయం చాలా పరిమితమైనది. ప్రతిపక్షంలో ఉన్నవారు అధికారంలోకి రావడానికి జీవితకాల సమయం ఉంటుంది కానీ, అధికార పక్షం దానిని నిలుపుకోవడానికి ఉండేది ఐదేండ్ల పరిమిత కాలమే! చూస్తుండగానే రెండేండ్లు గడిచిపోయాయి. అది కూడా ఇదిగో ఫలానా మహత్కార్యం నెరవేర్చాను అని గర్వంగా చెప్పుకోవడానికి ఏమీ లేకుండానే!
వివిధ అధికారిక కార్యక్రమాలకు సంబంధించిన వేదికల మీద రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ముఖ్యమం త్రి హోదాకు తగ్గట్టుగా లేవన్న అభిప్రాయం ఇప్పటికే విభిన్న వర్గాల్లో ఏర్పడింది. ఎన్నికల సమయంలో రాజకీయ సభల్లో నేతలు అదుపు తప్పి మాట్లాడితే, అనుచరులు ఉర్రూతలూగవచ్చునేమో, సాధారణ ప్రజలు వినోదంగా చూడవచ్చునేమో, కానీ అధికారిక కార్యక్రమాల్లో అనుచిత, అసందర్భ వ్యాఖ్యలు చేస్తే చివరకు సొంత పార్టీ కార్యకర్తలు కూడా హర్షించరు. విద్యార్థులు, ఉన్న త విద్యావంతులు, కవులు, కళాకారులు, పారిశ్రామిక, వాణిజ్యవేత్తల లాంటి విశిష్ట సమూహాలు సభికులుగా ఉన్నచోట ఒక్క మాట తూలినా ఆ తర్వాత భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉం టుంది. అందరూ మన వ్యక్తిత్వాన్ని, సంస్కారా న్ని స్కాన్ చేసి పెట్టుకుంటారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి ఏ వేదిక మీద, ఏ సమావేశంలో ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడటం సబబో కాదో అనే విజ్ఞత, విచక్షణ కూడా లేకపోతే ఎలా?
తాజాగా ఖమ్మం జిల్లా మద్దులపల్లిలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ గద్దెలను కూల్చేయండంటూ టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగానే కాదు, తీవ్ర ఆందోళనకరంగానూ ఉన్నాయి. నిజానికి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి వినకూడని మాటలివి. హోంశాఖ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రికి శాంతిభద్రతల పరిరక్షణ ఎంత తలనొప్పి వ్యవహారమో, ఆ అంశాన్ని ఎంత సున్నితంగా డీల్ చేయాలో తెలియదని భావించలేం. అయినా, అంత బాహాటంగా విధ్వంసకర భాష మాట్లాడటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇదేం రాజకీయం?
ఒక పార్టీ కార్యకర్తలను మరో పార్టీ మీదకు ఎగదోయడం.. ఎక్కడి సంస్కృతి? ముఖ్యమంత్రి వ్యాఖ్యలనే అడ్వాంటేజ్‌గా తీసుకొని, రేపు ఎక్కడైనా టీడీపీ కార్యకర్తలో, మరో పార్టీ కార్యకర్తలో తమకు గిట్టని బీఆర్ఎస్ గద్దెలనో, కాంగ్రెస్ గద్దెలనో ‘కూల్చుడు’ అనే దుష్ట సంప్రదాయానికి ఒడిగడితే, ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగితే పరిస్థితి ఏమిటి? శాంతిభద్రతలు అదుపు తప్పాయనే పేరుతో తమకు ఆదర్శప్రాయులైన చంద్రబాబు బషీర్‌బాగ్‌లో విద్యుత్తు ఉద్యమకారులపై కాల్పులు జరిపినట్టుగానో, ఇందిరాపార్క్ వద్ద అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించినట్టుగానో, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సర్కార్ ఖమ్మం జిల్లా ముదిగొండలో సీపీఎం కార్యకర్తలపై కాల్పులు జరిపినట్టుగానో, రాజకీయ మంటలు పెట్టి, గ్రామాల్లో, పట్టణాల్లో కొట్లాటలు పెట్టి, విద్వేషపు జ్వాలలు రాజేసి తెలంగాణ బిడ్డలను ఆహుతి చేస్తారా? ఎందుకీ ‘గద్దెల కూల్చుడు’ సంస్కృతి? ఎందుకీ భావదారిద్య్రం? ముఖ్యమంత్రి హోదాలో, నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు తమ మాటలు సమాజం మీద ఎలాంటి ప్రభావం పడేస్తాయో, ఏ పరిణామాలకు దారితీస్తాయో ఆలోచన లేకుండా మాట్లాడటం బాధ్యతారాహిత్యమే అవుతుంది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదే పదే చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఆదర్శనీయులుగా ప్రస్తావించడం, వారే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారని మాట్లాడటం తెలంగాణ ప్రజల మనోభావాలను పట్టించుకోని తెంపరితనమే.
ఏదో ఒకటి రెండు ప్రత్యేక సందర్భాల్లో వారి హయాంలో రూపుదిద్దుకున్న మంచి పథకాలను గుర్తుచేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ, 2004లోనే కేంద్రంలోని యూపీఏ-1 ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో చేర్చినప్పటికీ, అది ఆచరణలోకి రాకుండా అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించిన వైఎస్, చంద్రబాబులాంటి నాయకులను పదే పదే మన భాగ్యవిధాతలు అన్నట్టుగా మాట్లాడటమంటే తెలంగాణ ప్రజల మనోభావాలను రెచ్చగొట్టడమే. ఇవాళ కాకపోయినా మరో దశాబ్దం తర్వాత అయినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యమనే విషయం కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో చేర్చిన నాడే బోధపడినా, హైదరాబాద్‌కు దీటుగా ఆంధ్రాలోనో, రాయలసీమలోనో మరో ప్రత్యామ్నాయ నగరాన్ని నిర్మించుకోవాలన్న ఆలోచన కూడా చేయని నాయకులను ఆదర్శనీయులుగా ఎంచుకోవడం నిజంగా భావదారిద్య్రమే.
తెలంగాణ అంశాన్ని మినహాయించి మాట్లాడుకున్నా.. చంద్రబాబు మార్క్ సంస్కరణలు మొత్తం ఉమ్మడి రాష్ట్ర ప్రజల జీవితాలను, ముఖ్యంగా వ్యవసాయరంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయన్న విషయాన్ని ఏ నాయకుడూ విస్మరించరాదు. ‘ప్రభుత్వరంగ సంస్థలపై నిర్లక్ష్యం.. ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల పట్ల అలవికాని అనురాగం’ ఇదే కదా ఆ ఇద్దరు మహానేతల పరిపాలనా ప్రతిభ. నిజానికి పరిపాలనారంగంలో వైఎస్, చంద్రబాబుకు మించిన పాలనాదక్షులుగా, దార్శనికులుగా, సంస్కరణల పథనిర్దేశకులుగా పేరు సంపాదించుకున్న చరిత్ర కాంగ్రెస్‌కు చెందిన తెలంగాణ బిడ్డలైన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రులు జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్రి, కేంద్ర మాజీమంత్రి జైపాల్‌రెడ్డి లాంటి వారికి ఉన్నది కదా. నాడు ఎందరో ఉద్దండులున్న పార్లమెంట్లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ప్రశంసలందుకున్న జైపాల్‌రెడ్డి తెలంగాణ బిడ్డ మాత్రమే కాదు, సీఎం రేవంత్‌రెడ్డికి బంధువు కూడా కదా. దేశ రాజకీయాల్లోనే తమదైన ముద్ర వేసిన, స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించిన తెలంగాణ ముద్దుబిడ్డలను వదిలేసి, ఆంధ్రా నేతల భజన చేయడం భావదారిద్య్రం, వికృత రాజకీయ క్రీడ కాకపోతే మరేమిటి?
‘ప్రభుత్వరంగ సంస్థలపై నిర్లక్ష్యం.. ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల పట్ల అలవికాని అనురాగం’ ఇదే కదా ఆ ఇద్దరు మహానేతల పరిపాలనా ప్రతిభ. నిజానికి పరిపాలనారంగంలో వైఎస్, చంద్రబాబుకు మించిన పాలనాదక్షులుగా, దార్శనికులుగా, సంస్కరణల పథనిర్దేశకులుగా పేరు సంపాదించుకున్న చరిత్ర కాంగ్రెస్‌కు చెందిన తెలంగాణ బిడ్డలైన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రులు జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, కేంద్ర మాజీమంత్రి జైపాల్‌రెడ్డి లాంటి వారికి ఉన్నది కదా.
2015లో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలో తెలంగాణలో ఉత్పత్తి అయిన వరి ధాన్యం 30.5 లక్షల టన్నులు. ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి అయింది 74.9 లక్షల టన్నులు. కానీ, పదేండ్లు తిరిగొచ్చేసరికి 2023-24 నాటికి తెలంగాణ ఉత్పత్తి 168.8 లక్షల టన్నులకు ఎగబాకింది. ఆంధ్రప్రదేశ్ 73.4 లక్షల టన్నులకు పరిమితమైంది. పదేండ్లలో తెలంగాణ ఉత్పత్తి దాదాపు ఐదున్నర రెట్లు పెరిగితే, ఏపీ ఉత్పత్తి అక్కడే తచ్చాడుతున్నది. ఇది భారతదేశ వ్యవసాయశాఖ విడుదల చేసిన లెక్క. ఇప్పుడు చెప్పండి.. ఎవరు ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? ఎవరిని చూసి ఎవరు నేర్చుకోవాలి?