తెలంగాణ భూమి తన పరివర్తన కోసం 18వ శతాబ్ది ఆరంభం నుంచి 20వ శతాబ్ది చివరి వరకు మూడు శతాబ్దాల పాటు పాలకులతో అనేక సాయుధ సంఘర్షణలు సాగించింది. ఈ సుదీర్ఘ కాలంలో ప్రజల పోరాటాలు సర్వాయి పాపన్న నుంచి నక్సలైట్ పోరాటం దాకా పలు సందర్భాలలో కనిపించాయి. కొన్ని మధ్యయుగాల రాచరిక ఫ్యూడల్ వ్యవస్థలతో కాగా, మరికొన్ని స్వాతంత్య్రానంతరం ఆధునిక పార్లమెంటరీ ప్రజాస్వామ్య దశలో. స్థానిక ఫ్యూడల్ వర్గాలతో పాటు అంతర్గత వలస పాలకులతో. ఈ 300 ఏండ్ల దశ నుంచి తెలంగాణ పరివర్తనా ఆరాటం 21వ శతాబ్ది ఆరంభంలో బీఆర్ఎస్ స్థాపనతో నిరాయుధ శాంతియుత ఉద్యమ దశలోకి పరివర్తన చెందింది.
2014లో లక్ష్యాన్ని సాధించింది. గత పాతికేండ్లలో ఇది మొదటి పరివర్తన కాగా, స్వరాష్ట్ర సాధన తర్వాత నుంచి తన వర్తమానాన్ని, భవిష్యత్తును తాను తీర్చిదిద్దుకునే రెండవ పరివర్తనా దశలోకి ప్రవేశించింది. స్వల్పకాలంలోనే అనేక విజయాలు సాధించింది. గత పాతికేండ్ల ఈ రెండు పరివర్తనల నాయకత్వం కేసీఆర్ ఆధ్వర్యాన బీఆర్ఎస్దే. ఆ విధంగా గత కాలపు మూడు వందల సంవత్సరాల అనిశ్చిత దశ తిరుగులేని విధంగా ముగిసిపోయి, తెలంగాణ కోరుకున్న ఒక కొత్త దశ ఆరంభమైంది.
తెలంగాణ పరివర్తనకు ఆ విధమైన నాయకత్వం వహించిన బీఆర్ఎస్ పార్టీ తన రజతోత్సవాన్ని (2001-25) ఈ నెల 27న ఈ గడ్డకు చారిత్రక కేంద్రమైన వరంగల్లులో జరుపుకోనున్నది. ఆ వివరాలలోకి వెళ్లటానికి ముందు, గతం గురించి కొంత క్లుప్తంగానైనా చెప్పుకోవటం అవసరం. దక్కన్ పీఠభూమిలో భాగమైన తెలంగాణ వర్షాభావాలు, రాతి నేలలు, కొన్ని ప్రాంతాలలో అడవులు, రెండు పెద్ద నదులున్నా అభివృద్ధి కాని సాగునీటి వనరులు, చెరువులూ బావుల కింద పరిమిత వ్యవసాయం వంటి సమస్యలు ఒకవైపు ఉండగా, స్థానిక ప్రభువులు, ఫ్యూడల్ వర్గాలు, బయటినుంచి వచ్చి చేరిన వ్యాపార బృందాలు మరొకవైపు మోహరించి తరతరాలుగా దోపిడీకి గురైంది. ఇందుకు వ్యతిరేకంగా, ప్రత్యామ్నాయ వ్యవస్థల నిర్మాణం కోసం సర్దార్ పాపన్న నుంచి రైతాంగ సాయుధ పోరాటం వరకు అనేక ఘర్షణలు దేశ స్వాతంత్య్ర కాలంవరకు సాగాయి. స్వాతంత్య్రంతో ముగిసిపోవలసిన ఆ పీడన, స్థానిక భూస్వామ్య దోపిడీతో పాటు సీమాంధ్ర ధనిక వర్గాల అంతర్గత వలస పాలనగా కొనసాగి, ఆ కారణంగా ఒకవైపు ప్రత్యేక రాష్ట్ర ఆందోళనలు, మరొకవైపు నక్సలైట్ పోరాటాల వంటి మార్గాలలో ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటనలను ఎదుర్కొన్నది.
ఈ నేపథ్యంలో దీర్ఘకాలం పాటు సామాన్యుల నిరసనలు, ప్రతిఘటనల సంప్రదాయం ఉన్నందువల్లనే తొలిదశల ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలలో హింస చోటుచేసుకున్నది. రెండవ వైపు నుంచి సీమాంధ్ర ధనిక పాలకులకు తెలంగాణపై పట్టు పోరాదు గనుక, వారి మోచేతి నీళ్లు తాగి బతుకుతుండిన ఇక్కడి కాంప్రడార్ క్లాస్‌కు ఎంగిలి మెతుకులు కావాలి గనుక, ఇరువురు కలిసి ఉద్యమకారులపై అంతకు అనేక రెట్ల హింసకు పాల్పడ్డారు. నక్సలైట్ ఉద్యమం విషయానికి వస్తే, అందులోని విప్లవ సిద్ధాంతం మాట ఎట్లున్నా, ప్రధానంగా వందల ఏండ్ల ఫ్యూడల్ పీడన పట్ల, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అంతర్గత వలస దోపిడీ పట్ల ధిక్కారంతోనే ఇక్కడి ప్రజలు నక్సలిజం వైపు ఆకర్షితులయ్యారు. తొలి దశ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల వలెనే ఇది కూడా తీవ్ర అణచివేతకు గురైంది. రెండింటిని అణచివేసిందీ అవే శక్తులు.
18వ శతాబ్దం మొదట సర్వాయి పాపన్నతో ఆరంభమైన ఈ ప్రతిఘటనలు, అణచివేతల చరిత్ర ఆ విధంగా 20వ శతాబ్ది చివరివరకు కొనసాగింది. ఈ విధమైన 300 సంవత్సరాల ఎడతెగని చరిత్ర కారణంగానే తెలంగాణ పేరు ప్రపంచవ్యాప్తంగా వివిధ అధ్యయనాలలో నమోదైంది. తెలంగాణ అనే పేరు వినని అకడమీషియన్ అంటూ బహుశా ఎవరూ ఉండరు.
ఆ విధంగా మూడు శతాబ్దాల పాటు కల్లోల పథంలో సాగివచ్చిన తెలంగాణ, 20వ శతాబ్దపు చివరి 10 సంవత్సరాలలోకి (సుమారు 1990 తర్వాత నుంచి) ప్రవేశించినప్పటి నుంచి ఒక సంధి దశను చూసింది. మౌలికంగా సమస్యలు, స్వరాష్ట్ర ఆకాంక్ష వెనుకటి వలెనే ఉన్నాయి. 1970ల నాటి ఉద్యమం మందగించింది. నక్సలైట్ ఉద్యమం బాగా బలహీనపడసాగింది. వెనుకబడిన వర్గాలను, పేదలను తగినంత ఆకర్షించిన ఎన్టీఆర్, చంద్రబాబు కుయుక్తుల వల్ల అధికారంతో పాటు ప్రాణాన్ని సైతం కోల్పోవటం, చంద్రబాబు పాలన తెలంగాణకు మరింత హానికరంగా పరిణమించటంతో ఇక్కడి సమస్యలు, ప్రయోజనాల దృక్కోణం నుంచి తిరిగి పెద్ద శూన్యం ఏర్పడటం మొదలైంది.
ఈ వివిధ పరిస్థితుల మధ్య, 21వ శతాబ్ది సమీపిస్తున్నకొద్దీ స్వరాష్ట్ర సాధన తప్పనిరి అనే మాట నెమ్మదిగా తిరిగి వినరావటం మొదలైంది. క్షేత్రస్థాయిలో గమనించినపుడు, 1969-71 కాలం లో ఉండిన చదువులు, ఉద్యోగాలు, అభివృద్ధి సమస్యలు మరింతగా పెరిగాయి. నీటి సమస్య మరీ ఎక్కువైంది. గత ఉద్యమాల కాలంలో సాగునీటి సమస్య ఉండినప్పటికీ, జనాభా పెరుగుదల వల్ల మరింత భూమి సాగు చేయవలసి రావటం, చెరువులూ బావులు వట్టిపోతుండటం, బోర్లకు కరెంటు కొరత, ప్రభుత్వ సహకారం అరకొర కావటం, పెట్టుబడుల లేమి, అప్పుల భారం, మార్కెటింగ్ మోసాలు, అందుబాటుకు రాని విత్తనాలూ ఎరువులు, మరొకవైపు కుటుంబ సభ్యుల మధ్య భూమి పంపిణీతో పొలాలు ముక్కచెక్కలు కావటం, వాటి అమ్మకాలు, వలసల వంటివి గతం కన్న తీవ్ర సమస్యలయ్యాయి. రైతులు, పేద ల ఆత్మహత్యలు పెరిగాయి. భూమిపై వ్యవసా యంపై, వనరులపై ఒత్తిడి పెరిగింది. వీటి మూ లంగానే యువకులు నక్సలిజం వైపు మళ్లగా, 1990 ప్రాంతం వచ్చేసరికి సీమాంధ్ర పాలకుల తో పాటు వారితో కుమ్మక్కయిన తెలంగాణ ధనిక వర్గాలు కలిసి 20 ఏండ్లలో (1970-90) వేలా ది మంది యువతీ యువకుల ప్రాణాలు తీశారు.
ఆ విధంగా 1990లు ఒక శూన్యరూపంలో ఆవిష్కృతమవుతుండగా, సరిగా ఆ సరికొత్త దశకు సరిపోగల ఆ శూన్యాన్ని పూరించగల వ్యూహాన్ని, ఉద్యమ కార్యాచరణ మార్గాన్ని రూపొందించిన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. లక్ష్యం, ఫిలాసఫీ ఇదివరకటివే. ఆ లక్ష్యసాధనకు తగినవని ఆయన భావించిన వ్యూహం, ఆచరణ మార్గం మాత్రం భిన్నమైనవి. ఆ మేరకు కేసీఆర్ చేసిందేమిటి? ఒకటి, లక్ష్యం అదే అయిన స్థితిలో ఈ సరికొత్త దశ ఏమిటి? ఈ దశలో వివిధ పరిస్థితులు, సామాజిక తరగతులు, వాటి ఆకాంక్షలు, ఉద్యమ సన్నద్ధతలు, ప్రత్యర్థుల తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయి? వీటన్నింటి మధ్య నుంచి ప్రయాణం, లక్ష్యాన్ని చేరుకోవటానికి తగిన వ్యూహం ఏ విధంగా ఉండాలి? ఆ వ్యూహానికి సరిపోగల ఆచరణ మార్గమేమిటి? అన్నవి తన ఆలోచనలు, ఇతరులతో చర్చల ద్వారా రూపొందించుకోవటం. అందుకు ప్రయాణ గమనంలో, అనుభవాలను బట్టి, అవసరమైన సవరణలు చేసుకోవటం ఇదీ కేసీఆర్ చేసిన పని. ఆ క్రమంలో ఇక చివరిదాకా ఎట్టి పరిస్థితులలో రాజీ పడకపోవటం. ప్రజలకు పూర్తి విశ్వాసాన్ని కలిగించి తన వెంట నిలుపుకోవటం.
2001లో పార్టీ స్థాపన నాటికే తన వద్ద ఈ వ్యూహాలు సిద్ధంగా ఉండటం వల్ల ఆ మేరకు ఆచరణలు కూడా స్థూలంగా కనిపించటం మొదలైంది. ఆ విధంగా చూస్తూ చూస్తుండగానే ఆయన వెంట వివిధ ప్రజావర్గాలు చేరసాగాయి. ఆ పరిణామానికి తెలంగాణ వ్యతిరేకుల వైపు నుంచి ప్రతిక్రియలు వెంటనే మొదలుకావటమే కేసీఆర్ వ్యూహం, ఆచరణ సరైనవనేందుకు రుజువుగా నిలిచాయి. దెబ్బతీసేందుకు ప్రత్యర్థి శక్తులు ప్రయత్నించిన కొద్దీ ఉద్యమానికి, కేసీఆర్‌కు ప్రజల మద్దతు వేగంగా పెరగటం కనిపించింది. మొత్తమ్మీద ప్రస్తుత చర్చ సందర్భంగా గుర్తించవలసిన విషయం ఏమంటే, తెలంగాణ ప్రజల 300 ఏండ్ల ఆరాటం అప్పటి పోరాటాల సుదీర్ఘ దశను దాటివచ్చి, బీఆర్ఎస్ స్థాపనతో మొదలైన ఒక కొత్త పరివర్తనా దశలోకి ప్రవేశించింది. ఆ పని విజయవంతంగా జరిగింది.
కేసీఆర్ నాయకత్వాన అది మొదటి పరివర్తనా దశ (2001-14). పైన అనుకున్నట్టు తెలంగాణ ప్రజల బాధలు, గాథలు ఆకాంక్షలు అవే. కానీ, లక్ష్యాన్ని చేరేందుకు అనుసరించే మార్గం భిన్నమైనది. ఆ అర్థంలో దానిని పరివర్తన అంటున్నాము. ఈ దశలో జరగవలసింది స్వరాష్ట్రమనే లక్ష్యాన్ని చేరటం. ఆ పరివర్తనను చేరుకున్న తర్వాత, పరిపాలన ఇక్కడి వారి అధీనంలోకి వస్తుంది గనుక, ఈ నేల, ఈ ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు తగినవిధంగా ముందుకు వెళ్లటమనే రెండవ పరివర్తన దశ వస్తుంది.
ఇందులో మొదటి పరివర్తన 2001లో మొదలై 2014 వరకు ఏ విధంగా జరిగిందో తెలిసిందే. ఇక రెండవ పరివర్తన కూడా పదేండ్ల కాలంలో కొంతమేరకు ఘనంగా, అనూహ్యంగా, కొంతమేరకు సంతృప్తికరంగా జరిగి, కొంతమేర ఇంకా మిగిలి ఉంది. తెలంగాణ ఈ రెండవ పరివర్తనలోకి తిరుగులేని విధంగా ప్రవేశించిందన్నది మాత్రం నిర్వివాదాంశం. ఈ రోజు 2014 కన్న ముందటి తెలంగాణతో ప్రస్తుత స్థితిగతులను పోల్చిచూసినట్టయితే ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా గణనీయమైన మార్పులు కనిపిస్తాయి. అవన్నీ పలు స్వతంత్ర సంస్థల రికార్డులలో నమోదైనవే అయినందున ఇక్కడ తిరిగి రాయటం లేదు. ఈ విధమైన రెండవ పరివర్తనను మరింత ముందుకు తీసుకుపోయేందుకు వీలుగా పార్టీని, సమాజాన్ని సన్నద్ధం చేసే మహత్తర కార్యక్రమం వరంగల్ సభతో మొదలుకానున్నది. ఆ పని చేయగలది ఈ గడ్డ కోసం, ఈ గడ్డపై పుట్టి, ఈ గడ్డకు అంకితమైన బీఆర్ఎస్ మాత్రమే. అది తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ.