గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు కావడం గ్రూప్-1 సీనియర్ అభ్యర్థుల పట్ల శాపంగా మారింది. గత ప్రభుత్వం 2022 ఏప్రిల్‌లో 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చింది. 2022 అక్టోబర్ 16న మొదటిసారి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా.. పేపర్ లీక్ కారణంగా టీఎస్పీఎస్సీ దాన్ని రద్దు చేసింది. 2023 జూన్ 11న రెండోసారి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా.. పరీక్షకు హాజరైన అభ్యర్థుల వేలిముద్రలను బయోమెట్రిక్ విధానం ద్వారా తీసుకోలేదని హైకోర్టు మరోసారి పరీక్షను రద్దు చేసింది. ఆ కేసు తదనంతరం సుప్రీంకోర్టుకు చేరింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన టీఎస్పీఎస్సీ నూతన బోర్డు ఆగమేఘాల మీద సుప్రీంకోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకున్నది. దాంతోపాటు పాత నోటిఫికేషన్‌ను రద్దు చేయడంతో గ్రూప్-1 కొలువుల కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న సీనియర్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, తెలంగాణలో గానీ ఇలా నోటిఫికేషన్ రద్దు చేసిన సందర్భాలు లేవు. 2011లో విడుదలైన గ్రూప్-1 నోటిఫికేషన్, పరీక్షపై కూడా ఎన్నో కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ 2016లో మళ్లీ పరీక్ష నిర్వహించి నియామకం చేపట్టారు. అంటే 2011 నుంచి 2016 మధ్యకాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పటికీ నోటిఫికేషన్ మాత్రం రద్దు కాలేదు.
పేపర్ లీకేజీ కారణంగా రద్దు అయిన ఇతర పరీక్షల నోటిఫికేషన్లను టీఎస్పీఎస్సీ రద్దు చేయలేదు. కేవలం గ్రూప్-1 నోటిఫికేషన్‌పైనే చర్యలు చేపట్టడం దేనికి సంకేతం? నోటిఫికేషన్ న్యాయబద్ధంగా లేకుంటేనే దాన్ని రద్దు చేయాలి. ఇప్పటివరకు గ్రూప్-1 నోటిఫికేషన్లో తప్పు ఉందని ఎవరూ చెప్పలేదు. న్యాయస్థానాల్లోనూ కేసులు వేయలేదు. కోర్టు కూడా పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని మాత్రమే చెప్పింది.
టీఎస్పీఎస్సీ గ్రూప్- 1 నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్టు వెలువరించిన ప్రకటనలో ‘ప్రజాభీష్టం మేరకే’ అని ఉంది. 2022లో గ్రూప్-1కు దరఖాస్తు చేసుకున్న ఏ ఒక్క అభ్యర్థి కూడా నోటిఫికేషన్ రద్దు చేయాలని ఇప్పటివరకు కోరలేదు. ప్రజాభిప్రాయమే ముఖ్యమనుకుంటే, అభ్యర్థుల్లో 90 శాతం మంది తెలుగు ఆప్షనల్ పేపర్‌గా పెట్టాలని కోరారు. ప్రతి రాష్ట్రంలో వారివారి మాతృభాషను ఒక ఆప్షన్ పేపర్‌గా గ్రూప్-1లో పెడుతున్నారు. ప్రజాభీష్టం మేరకు అని చెప్పే ప్రభుత్వం మొదటగా దీన్ని అమలు చేయాలి కదా. మెయిన్స్ ఉర్దూలో రాసుకునే అవకాశం ఇస్తే ఒక వర్గం వారు అధికంగా లాభపడే అవకాశం ఉంది. కాబట్టి మెయిన్స్ పరీక్షను ఆంగ్లం, తెలుగులోనే నిర్వహించాలని 95 శాతం మంది కోరుతున్నారు. ప్రజాభీష్టం మేరకే అనుకుంటే.. దీన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, ఆర్టీవో లాంటి పోస్టులకు జనరల్ డిగ్రీని అర్హతగా పరిగణించాలని 95 శాతం మంది అభ్యర్థులు కోరుతున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి కదా. గ్రూప్-1 పోస్టులు అంటేనే అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు. మరి వాటికి ప్రత్యేక విద్యార్హత పెట్టాల్సిన అవసరం ఏమిటి?
2022 ఏప్రిల్‌లో నోటిఫై చేసి నోటిఫికేషన్ ఇచ్చి రెండుసార్లు పరీక్ష నిర్వహించిన పోస్టులకు.. 2022, 2023లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఎలా అర్హులవుతారని సీనియర్ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. రిజర్వేషన్ అమలు, అర్హత పరీక్ష పాసయ్యే సంవత్సరం.. తదితర లీగల్ విషయాలపై కోర్టులను ఆశ్రయించాలని గ్రూప్-1 సీనియర్ అభ్యర్థులు భావిస్తున్నారు. పాత నోటిఫికేషన్ అలాగే ఉంచి, కొత్తగా కలిపిన 60 పోస్టులను అనుబంధ నోటిఫికేషన్లో కొత్త రూల్ అఫ్ రిజర్వేషన్ ప్రకారం.. కొత్త, పాత అభ్యర్థులకు అవకాశం ఇస్తే బాగుండేది. లేదా గతంలో ఉన్న 503 పోస్టులు పాత రూల్ అఫ్ రిజర్వేషన్ ప్రకారం పాత అభ్యర్థులకే చెందేటట్టు నోటిఫికేషన్లో పేర్కొంటే బాగుండేది. కొత్తగా గుర్తించిన 60 పోస్టులకు కొత్త రూల్ అఫ్ రిజర్వేషన్ ప్రకారం.. కొత్త, పాత అభ్యర్థులకు కలిపి అవకాశం ఇవ్వాలి. లేదా 60 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలి.
ప్రజా ప్రభుత్వం అని చెప్పుకొంటున్న కాంగ్రెస్ సర్కార్ వస్తూనే తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నవారి కొలువుల ఆశలపై నీళ్లు చల్లింది. స్వరాష్ట్రంలో గ్రూప్-1 ఉద్యోగాలు సాధించాలని, కాంగ్రెస్ వస్తే తమకు న్యాయం జరుగుతుందని తీవ్రంగా శ్రమిస్తూ, ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న గ్రూప్-1 సీనియర్ అభ్యర్థులకు అన్యాయం చేయడం తగదు. కొత్తవాళ్ల కోసం పాత వాళ్లు బలైపోవాలా? అని సీనియర్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు.. గత ప్రభుత్వం ఇచ్చిన 503 పోస్టులకు బిచ్చం వేసినట్టు కేవలం 60 పోస్టులు కలిపి ‘నోటిఫికేషన్ మేమే ఇచ్చాం’ అని చెప్పుకోవడం సరికాదు. సీఎం రేవంత్‌రెడ్డి పదేపదే ఊతపదంగా వాడే ఇత్తేసి పొత్తు కూడటమంటే ఇదేనేమో.
– ఎస్.శేఖర్
88852 33320