విశ్వ మానవాళికి శాంతి, అహింస సందేశాలను ప్రబోధించిన మహనీయులు మహాత్మా గాంధీ. ఆయన అందించిన ఆయుధాలు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ. సత్యం, త్యాగం, సహకారం, నిజాయితీ, నిగ్రహం వంటి లక్షణాలు పోరాడేవారికి అవసరం అని గాంధీజీ బోధించారు. వీటన్నింటిని జాతీయోద్యమంలో ఆచరించి, ప్రయోగించి దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించిపెట్టారు. అందుకే ఆయనను జాతిపితగా గౌరవించుకుంటున్నాం. సరిగ్గా అలాంటి పరిస్థితులే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పునరావృతమయ్యాయి. శాంతియుత సత్యాగ్రహం, సహాయ నిరాకరణం, అహింసను మించిన అస్ర్తాలు లేవని 14 ఏండ్ల సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానానికి నాయకత్వం వహించిన కేసీఆర్.. గాంధీ బాటలో నడిచి తెలంగాణ సాధించి గాంధేయవాదిగా వినుతికెక్కారు.
మలిదశ తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ 2001-14 వరకు నడిపించిన ప్రతి పోరాటంలో శాంతి మంత్రాన్నే జపించారు. అహింసా సందేశాలను బోధిస్తూనే ముందుకుసాగారు. అందుకే తెలంగాణ ఉద్యమ కాలంలో ఏ సంస్థపైనా, ఏ వ్యక్తిపైగానీ దాడులు జరుగలేదు. జాతి యావత్తు ఆశ్చర్యపడేలా శాంతియుత మార్గంలో నడిచి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ప్రపంచం ముందుంచాం. ఇదంతా కేసీఆర్ నేతృత్వంలోనే సాధ్యమైందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. భారత స్వాతంత్య్రోద్యమంలో గాంధీజీ సత్యాగ్రహ దీక్ష తర్వాత దేశ చరిత్రలో నిలిచిపోయిన గొప్ప సత్యాగ్రహ దీక్షల రూపకర్తలు తెలంగాణ ప్రజలు. హైదరాబాద్ స్వాతంత్య్రోద్యమ పోరాటంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఈ సత్యాగ్రహదీక్షలే కీలకపాత్ర పోషించాయి. 2009, నవంబర్ 29న కేసీఆర్ గాంధీజీ స్ఫూర్తితో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఇది రాష్ట్ర, దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో తెలిసిందే. చరిత్రలో కేసీఆర్ దీక్ష ఒక మైలురాయి. కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి ఆమరణదీక్షను చేపట్టి మూడు కోట్ల తెలంగాణ ప్రజల ఆశయానికి జీవం పోశారు. కేసీఆర్ స్ఫూర్తితో వేలమంది ప్రజలు స్వచ్ఛందంగా సత్యాగ్రహ దీక్షలు మొదలుపెట్టారు. ఆ దీక్షల ప్రభావంతోనే కేంద్రం అనివార్య పరిస్థితుల్లో దిగిరాక తప్పలేదు.
పిడికెడు ఉప్పుతో జాతి యావత్తును కదిలించింది ఉప్పు సత్యాగ్రహం. ఆ ఘటనకు ముందు నిర్వహించబడిన దండియాత్రలా తెలంగాణ పది జిల్లాల ప్రజలు కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ట్యాంక్‌బండ్‌పై ‘మిలియన్ మార్చ్‌ను నిర్వహించారు. ప్రభుత్వ నిర్బంధాన్ని, పోలీసుల నిషేధాజ్ఞలను ధిక్కరించి లక్షలాది మంది ప్రజలు శాంతియుత ర్యాలీలో పాల్గొని జయప్రదం చేశారు. దీని తర్వాత సాగరహారం, సమర దీక్ష, సడక్ బంద్, వంటావార్పు వంటి వినూత్న శాంతియుత ప్రజా ఉద్యమాలు కొనసాగుతూనే వచ్చాయి. ఇక్కడ జరిగిన సకలజనుల సమ్మె జాతీయోద్యమంలో ప్రధాన ఘట్టమైన సహాయ నిరాకరణోద్యమానికి ప్రతీక అని చెప్పవచ్చు. ఇది యావత్తు మలిదశ ఉద్యమంలోనే అత్యంత ప్రధాన ఘట్టం. ఈ సమ్మెలో కోట్ల మంది ప్రజలు పాల్గొన్నా ఎక్కడా ఒక్క హింసాత్మక సంఘటన కూడా చోటుచేసుకోలేదు. ఇలా తెలంగాణ సాధించే వరకు కేసీఆర్ పిలుపుతో దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు ఒకటేమిటి శరపరంపరగా నిర్వహించిన ప్రతీ నిరసన గాంధేయ మార్గంలోనే సాగింది. ఫలితంగా అరువై ఏండ్ల కలను తెలంగాణ ప్రజలు సాకారం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో గాంధేయ మార్గాన్ని అనుసరించి గొప్ప పరిణతిని చూపారు ఇక్కడి ప్రజలు.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పాలనాపగ్గాలు చేపట్టిన కేసీఆర్ గాంధేయమార్గాన్ని వీడకుండా వారి ఆలోచనల ను తూచ తప్పకుండా అమలుచేస్తూనే రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించారు. గంగా జెమునా తెహ్జీబ్ సంస్కృతిని కాపాడుతూ జాతీయ సమైక్యతకు, శాంతియుత సహజీవనానికి నాటి తెలంగాణ ప్రభుత్వం ఎనలేని కృషిచేసింది. విద్యతోనే సమాజంలోని అంతరాలను తొలగించవచ్చని, సమానత్వం సాధించవచ్చని తలచి అన్నివర్గాల విద్యాభ్యున్నతి కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలు, కళాశాలలను స్థాపించి పేద పిల్లలు చదువుకోవడానికి తెలంగాణ తొలి ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందించింది. గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం ‘దళితబంధు’ వంటి ప్రత్యేక పథకాలను అమలుచేసింది. గ్రామాల్లో వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆర్థిక స్వావలంబనతో పాటు, స్వయం సమృద్ధి వైపు నడిపించింది. గాం ధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణ పల్లెల్లో ఆవిష్కృతమైంది. ఇలా స్వరాష్ట్రం సాకారమయ్యేవరకు, ఆ తర్వాతా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం అణువణువునా గాంధేయ మార్గాన్ని, వాదాన్ని నింపుకొని అనుసరించిన వ్యక్తి కేసీఆర్. అందుకే, ఆయననుతెలంగాణ జాతిపితగా కీర్తిస్తున్నాం.
(వ్యాసకర్త: చరిత్ర ఉపన్యాసకులు)
– డాక్టర్ సందెవేని తిరుపతి
98496 18116